ఢిల్లీలో ఉంటే దెబ్బేన‌ని కేసీఆర్ కు అర్థ‌మైందా?

Update: 2018-04-05 06:08 GMT
తెలివి అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ దే. స‌మ‌యానికి త‌గ్గ‌ట్లు త‌క్ష‌ణ‌మే నిర్ణ‌యాలు తీసుకోవ‌టంలో ఆయ‌న త‌ర్వాతే ఎవ‌రైనా. ఎందుకు చేశారో అన్న‌ట్లుగా మోడీకి మ‌ద్ద‌తుగా నిలిచేట‌ట్లు.. పార్ల‌మెంటు స‌జావుగా జ‌ర‌గ‌కుండా త‌న ఎంపీల్ని నిర‌స‌న‌ల‌కు పుర‌మాయించిన కేసీఆర్‌.. ఇప్పుడు వారిని ఢిల్లీని వ‌దిలేసి తెలంగాణ‌కు వ‌చ్చేయాల‌న్న ఆదేశాల్ని జారీ చేశారు.

మ‌రో రెండు రోజులు పార్ల‌మెంటు స‌మావేశాలు (గురు.. శుక్ర‌వారం) జ‌ర‌గ‌నున్నాయి. మోడీ స‌ర్కారుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. టీడీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై చ‌ర్చ జ‌ర‌గ‌కుండానే రోజువారీగా వాయిదా ప‌డుతున్న ప‌రిస్థితి. అవిశ్వాస తీర్మానం చ‌ర్చ జ‌ర‌గ‌కుండా ఉండేందుకు అన్నాడీఎంకే ఎంపీలు కావేరీ ఇష్యూను.. టీఆర్ ఎస్ ఎంపీలు ముస్లిం.. గిరిజ‌నుల రిజ‌ర్వేష‌న్ల పెంపు పేరుతో ఆందోళ‌న చేస్తున్నార‌న్న అప‌వాదును మూట‌క‌ట్టుకున్నారు.

జాతీయ స్థాయిలో బీజేపీ.. కాంగ్రెసేత‌ర కూట‌మిని ఏర్పాటు చేయాల‌న్న త‌లంపులో ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఉన్నార‌ని చెబుతున్న వేళ‌లోనే.. అందుకు భిన్నంగా లోక్ స‌భ‌లో టీఆర్ఎస్ ఎంపీలు మోడీ స‌ర్కారుకు వ్య‌తిరేకంగా పెట్టిన అవిశ్వాస తీర్మానంపై చ‌ర్చ‌ను అడ్డుకునేలా ఆందోళ‌న చేయ‌టం ఏమిటంటూ విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి.

ఇది త‌న ఇమేజ్ ను డ్యామేజ్ చేయ‌ట‌మే కాదు.. త‌న విశ్వ‌స‌నీయ‌త మీద కూడా ప్ర‌భావం చూపిస్తుంద‌న్న విష‌యాన్ని గ్ర‌హించిన కేసీఆర్‌.. త‌న ఎంపీల్ని ఆందోళ‌న చేయ‌టం ఆపివేయించారు. అయిన‌ప్ప‌టికీ డ్యామేజ్ కంట్రోల్ కాని వేళ‌.. ఆయ‌న కొత్త మార్గాన్ని ఎన్నుకున్నట్లుగా క‌నిపిస్తోంది. పార్ల‌మెంటులో తెలంగాణ‌కు న్యాయం జ‌ర‌గ‌ని వేళ‌.. అక్క‌డే ఉండే క‌న్నా ఎంపీలంతా తెలంగాణ‌కు తిరిగి వ‌చ్చేసి.. నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ర్య‌టిస్తూ.. ప్ర‌జాస‌మ‌స్య‌ల ప‌రిష్కారాల‌పై దృష్టి సారించాలంటూ ఆదేశాలు జారీ చేశారు.

ఇదంతా ఎందుకు? అంటే.. డ్యామేజ్ కంట్రోల్ లో భాగంగా చెప్ప‌క త‌ప్ప‌దు. ఆందోళ‌న‌లు చేస్తే మోడీ స‌ర్కారుకు అనుకూలంగా.. ఆయ‌న ప్ర‌భుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానం చ‌ర్చ‌కు రాకుండా ఉండేందుకే అన్న విమ‌ర్శ‌లు వ‌స్తుంటే.. ఆందోళ‌న‌లు నిలిపివేస్తే.. ముస్లిం.. గిరిజ‌నుల రిజ‌ర్వేష‌న్ల పెంపుపై కేసీఆర్ స‌ర్కారుకు క‌మిట్ మెంట్ లేదంటూ వేలెత్తి చూపించుకునే అవ‌కాశం లేక‌పోవ‌టంతో ఢిల్లీ నుంచి తిరిగి వ‌చ్చేయాల‌న్న మాట‌ను కేసీఆర్ చెప్పిన‌ట్లుగా చెబుతున్నారు.

అధినేత ఆదేశాల నేప‌థ్యంలో గురువారం టీఆర్ఎస్ ఎంపీలు ఢిల్లీ నుంచి తెలంగాణ‌కు రిట‌ర్న్ అవుతున్నారు. కేంద్రం త‌న మాట విన‌కుంటే.. పోరాడి సాధించాల్సిన కేసీఆర్‌.. నియెజ‌క‌వ‌ర్గాల‌కు ఎంపీలు తిరిగి వెళ్లిపోవాలంటూ ఆదేశాలు జారీ చేయ‌టం చూస్తుంటే.. ఢిల్లీలో ఉండి వేలెత్తి చూపించుకునే క‌న్నా.. రిట‌ర్న్ వ‌చ్చేయ‌టం ద్వారా మోడీ స‌ర్కారుపై తాము గుర్రుగా ఉన్నామ‌న్న సందేశాన్ని పంపిన‌ట్లుగా ఉంటుంద‌ని భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

నిజానికి.. టీఆర్ఎస్ ఎంపీలు ఢిల్లీ నుంచి తిరిగి వ‌చ్చేయ‌టం కార‌ణంగా తాను మోడీకి వ్య‌తిరేక‌మ‌న్న సిగ్న‌ల్ ఇవ్వొచ్చ‌న్న ఉద్దేశంతోనే తాజా మాట చెప్పిన‌ట్లుగా చెప్పొచ్చు. దీనికి త‌గ్గ‌ట్లే త‌మ అధినేత మాట‌ను అదే ప‌నిగా వ‌ల్లె వేస్తూ.. డ్యామేజ్ కంట్రోల్ చేసుకునే పనిలో ప‌డ్డారు గులాబీ ఎంపీలు.


Tags:    

Similar News