కోపంతో కొర‌డా తీసిన కేసీఆర్‌!

Update: 2017-06-16 05:47 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ కు కోపం వ‌చ్చేసింది. ఇటీవ‌ల కాలంలో క‌ల్తీలు.. న‌కిలీలు.. మోసాలు.. జూదాలు లాంటి వాటి విష‌య‌మై త‌ర‌చూ వార్త‌లు రావ‌టంపై ఆయ‌న క‌న్నెర్ర చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ద‌గా చేయ‌లేం.. చ‌ట్టం నుంచి త‌ప్పించుకోలేమ‌న్న‌ట్లుగా అక్ర‌మార్కుల గుండెల్లో రైళ్లు ప‌రిగెత్తించేలా చేయాల‌ని ఆయ‌న డిసైడ్ అయ్యారు. అదే విష‌యాన్ని తాజాగా వెల్ల‌డించారు.

క‌ల్తీలు.. న‌కిలీలు.. జూదం.. అక్ర‌మ రిజిస్ట్రేష‌న్ లాంటి అక్ర‌మాల‌పై ఉక్కుపాదం మోపేలా.. అలాంటి త‌ప్పులు చేయాలంటే భ‌య‌ప‌డేట‌ట్లుగా ఒక చ‌ట్టాన్ని త‌యారు చేయాల‌ని నిర్ణ‌యించారు. ఏదైనా స‌మ‌స్య వ‌చ్చిన‌ప్పుడు ఒక్కో ముఖ్య‌మంత్రి ఒక్కోలా రియాక్ట్ అవుతుంటారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీరు మాత్రం కాస్త భిన్నంగా ఉంటుంది. ఆయ‌న స‌మ‌స్య‌ను చూసే తీరు మిగిలిన వారి కంటే వేరుగా ఉంటుంది. త‌ప్పును ఒప్పుకోవ‌టానికి ఏ మాత్రం వెనుకాడ‌రు. అదే స‌మ‌యంలో.. జ‌రిగిన త‌ప్పు భ‌విష్య‌త్తులో జ‌ర‌గ‌కుండా ఉండేందుకు భారీ ఎత్తున చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లు స్ప‌ష్టం చేస్తారు.

త‌ప్పు జ‌రిగిన‌ప్పుడు.. అవును జ‌రిగింది త‌ప్పే.. అలాంటివి జ‌ర‌గ‌కుండా చూస్తామంటూ ఓపెన్ గా చెప్పేస్తే ఎవ‌రు మాత్రం ఏమంటారు? జ‌రిగిన త‌ప్పును క‌వ‌ర్ చేస్తూ.. త‌ప్పును ఒప్పుకోక‌పోతే.. మీడియా సైతం ఏదోలా వారి త‌ప్పును హైలెట్ చేసే ప్ర‌య‌త్నం చేస్తుంది. కానీ.. అందుకు భిన్నంగా అవును జ‌రిగింది త‌ప్పే.. ఇక‌పై అలాంటివి జ‌ర‌గ‌కుండా చూస్తామ‌ని చెప్ప‌టంతో పాటు.. అందుకు చెక్ పెట్టే చ‌ర్య‌ల్ని వ‌రుస‌గా ప్ర‌క‌టించిన‌ప్పుడు ఎవ‌రు మాత్రం ఏం అన‌లేరు క‌దా. జ‌నాల మైండ్ సెట్ ను బాగా అర్థం చేసుకోవ‌టంతో పాటు.. త‌న మాట‌ల‌తో.. చేత‌ల‌తో కన్విన్స్ చేసే సీఎం కేసీఆర్‌.. తాజాగా అలాంటి వైఖ‌రినే మ‌రోసారి ప్ర‌ద‌ర్శించారు.

జాగీరు భూముల రిజిస్ట్రేష‌న్ల‌ను నిరోధించ‌టానికి ఆర్వోఆర్ చ‌ట్టంలో మార్పులు చేయాల‌ని.. విత్త‌నాలు.. ఎరువుల క‌ల్తీలు.. న‌కిలీ ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలు.. దొంగ‌నోట్లు.. పేకాట లాంటి వాటికి అడ్డుక‌ట్ట వేసేందుకు.. అలాంటి త‌ప్పులు చేసే వారికి క‌ఠిన శిక్ష‌లు అమ‌లు చేసేందుకు వీలుగా కొత్త చ‌ట్టాన్ని చేయాల‌ని కేసీఆర్ భావిస్తున్నారు. ఇప్ప‌టికే న‌కిలీలు.. క‌ల్తీలు చేసేవారిపై పీడీ చ‌ట్టాన్ని ప్ర‌యోగించి జైల్లో వేసినా.. ఇంకాఇలాంటి త‌ప్పులు చేసే వారి సంఖ్య త‌గ్గ‌క‌పోవ‌టంతో.. మ‌రింత ప‌దునైన చ‌ట్టాన్ని త‌యారు చేయాల‌ని అధికారుల‌కు కేసీఆర్ సూచించారు. ఈ నెల 17న జ‌రిగే మంత్రిమండ‌లి స‌మ‌యానికి న‌మూనాను సిద్ధం చేయాల‌ని.. ఆ స‌మావేశంలో చ‌ర్చించి.. నిర్ణ‌యం తీసుకోవ‌టంతో పాటు.. మంత్రివ‌ర్గ ఆమోదం తెలిపి.. ఆర్డినెన్స్ జారీ చేసిన త‌ర్వాతి రోజు నుంచే కొత్త చ‌ట్టం అమ‌లు జ‌రిగేలా చేయాలంటూ కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. చూస్తుంటే.. రానున్న రోజుల్లో త‌ప్పులు చేయాలంటూ ఒళ్లు జ‌ల‌ద‌రించే ప‌రిస్థితి కేసీఆర్ తీసుకురానున్నారా? అదే జ‌రిగితే.. అంత‌కు మించిన సంతోష‌క‌ర‌మైన వార్త ఏముంటుంది?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News