మోడీ అపాయింట్‌మెంట్‌ ఇచ్చారా?

Update: 2015-07-10 04:56 GMT
ప్రతి చిన్న విషయానికి ఢిల్లీకి పరిగెత్తటం కొందరు ముఖ్యమంత్రులు చేస్తుంటారు. విషయం ఎంత పెద్దది అయినా సరే.. తన రాష్ట్రం నుంచి కాలు కదపకుండా తన అధికారుల చేత పనులు పూర్తి చేసేందుకు మరికొందరు ముఖ్యమంత్రులు ప్రయత్నిస్తుంటారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ రెండో కోవకు చెందిన వారు.

ఎంతో అవసరం అయితే తప్పించి హైదరాబాద్‌ నుంచి కాలు బయటకు పెట్టరు. ఏదైనా జాతీయ స్థాయి సమావేశాల్లో హాజరు కావాల్సి వస్తే తప్పించి ఆయన ఢిల్లీకి పెద్దగా వెళ్లరు. ఇక.. ఆయన ఢిల్లీకి వెళ్లిన సందర్భంలో ప్రధాని మోడీని కలిసే ప్రయత్నం చేయటం.. ఆయన నుంచి పెద్ద రెస్సాన్స్‌ రాకపోవటం లాంటివి చోటు చేసుకున్నాయని చెబుతారు.

 ఆ మధ్య ఒక పెళ్లికి కేరళ వెళ్లిన ఆయన.. అక్కడి నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీని కలవాలని అనుకున్నా.. ఆయన అపాయింట్‌మెంట్‌ ఫిక్స్‌ కాని నేపథ్యంలో హైదరాబాద్‌కు తిరిగి వచ్చేసినట్లు చెబుతారు. తర్వాత కూడా ప్రధానిని కలిసేందుకు ప్రయత్నించినా ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు. తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ నెల 15న ఢిల్లీకి వెళుతున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని నరేంద్రమోడీని కలవనున్నట్లు చెబుతున్నారు.

గతంలోనూ ఇదే తీరులో కలిసే ప్రయత్నం చేయటం.. అనంతరం ఆయన అపాయింట్‌మెంట్‌ ఫిక్స్‌ కాకపోవటం.. కేంద్ర మంత్రుల్ని కలిసి వచ్చేయటం లాంటివి చేయటం తెలిసిందే. మరి.. ఈసారి అయినా ఆయనకు మోడీ దర్శన భాగ్యం లభిస్తుందో లేదో చూడాలి.



Tags:    

Similar News