ఉద్యోగుల మనసుల్ని దోచుకునేలా కేసీఆర్ నోటి మాట

Update: 2022-02-12 04:28 GMT
మూడ్ బాగోవాలే కానీ.. కోరుకున్న దాని కంటే ఎక్కువ ఇచ్చే సిత్రమైన మైండ్ సెట్ తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సొంతం. ఆయన ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అంత తేలిగ్గా చెప్పేయలేని పరిస్థితి. వరాల దేవుడిగా పేరున్న ఆయన.. కొన్నిసార్లు కోరుకోకుండానే వరాలు ఇచ్చేయటం.. మరికొన్ని సార్లు ఎంతలా ప్రాథేయపడ్డా.. వరాలు ఇవ్వటానికి ససేమిరా అనేస్తుంటారు. అయినా.. వరాల దేవుడికి భక్తులకు నేరుగా వరాలు ఇచ్చే శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ.. అందుకు భిన్నంగా తాజాగా సీఎం కేసీఆర్ నోటి నుంచి వచ్చిన మాట రోటీన్ కు భిన్నంగా ఉండటం గమనార్హం.

తాజాగా జనగామ జిల్లాలో జరిగిన బహిరంగ సభకు సీఎం కేసీఆర్ హాజరు కావటం.. కేంద్రంలోని మోడీ సర్కారు మీదకు తాను గురి పెట్టిన వైనాన్ని ఓపెన్ గా చెప్పేయటమే కాదు.. తెలంగాణ ప్రజల ఆశీర్వాదం ఇవ్వాలే కానీ.. ఢిల్లీ కోటను బద్ధలు కొడతానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేంద్రం రాష్ట్రానికి హ్యాండిచ్చేసిన వైనాన్ని అయినప్పటికీ తన సమర్థతతో.. రాష్ట్రాన్ని డెవలప్ చేస్తున్న తీరును నాన్ స్టాప్ గా చెప్పేయటం తెలిసిందే.

భావోద్వేగ ప్రసంగాల్లో దిట్ట అయిన కేసీఆర్.. ఎప్పటిలానే తెలంగాణ ఉద్యమం గురించి.. అవసరానికి స్మరించుకునేందుకు సిద్ధంగా ఉంచుకునే జయశంకర్ సారు ప్రస్తావన తీసుకొచ్చి.. నాటి పరిస్థితుల్ని గుర్తు తేవటం.. తన కన్నీళ్ల గురించి ప్రస్తావించటం లాంటివి జరిగిపోయాయి.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. తన ప్రసంగంలో చివర్లో రాష్ట్ర ఉద్యోగులకు తీపి కబురును అందించారు.అయితే.. చివర్లో ఇచ్చిన ట్విస్టు చూసినప్పుడు.. సీఎం కేసీఆర్ తెలివే తెలివి అనుకోకకుండా ఉండలేం. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వ ఉద్యోగులతో పీఆర్సీ పంచాయితీ పెట్టుకుంటే.. సీఎం కేసీఆర్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రం అన్ని రంగాల్లో డెవలప్ అయినట్లుగా చెప్పిన కేసీఆర్.. ‘ఇంతగా డెవలప్ అయ్యిందంటే ఉద్యోగులు రాత్రింబవళ్లు పని చేయటం వల్లనే సాధ్యమైంది. చిన్న చిన్న సమస్యలు వస్తాయని.. వాటిని చూసి ఉద్యోగులు ఆగం కావొద్దు. బాగా పని చేసి భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకంటే ఎక్కువ జీతాలు పొందాలి’ అంటూ తీపి కబురును చెప్పారు.

ఈ సందర్భంగా కేసీఆర్ నోటి నుంచి గమ్మత్తు మాట ఒకటి వచ్చింది.  జిల్లాలను విభజన చేసేటప్పుడు అన్ని విధాలుగా ఆలోచించిన తర్వాతే చేశామని.. మారుమూల ప్రాంతాల్లో కూడా డెవలప్ చేసేందుకు జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లుగా చెప్పారు. మారుమూల ప్రాంతాల్లో పని చేసే ఉద్యోగులకు ప్రత్యేక భత్యం ఇవ్వాలని సీఎస్ ను అడిగినట్లుగా పేర్కొన్నారు.

ఎక్కడైనా వరం ఇవ్వాలని దేవుడు డిసైడ్ అయ్యాక.. పూజారి అనుమతి అవసరం లేదు కదా? మరి.. తెలంగాణ వరాల దేవుడు ఆదేశాలు జారీ చేయకుండా.. సీఎస్ ను అడగటం ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది. సీఎస్ ను ఫలానా చేయాలని ముఖ్యమంత్రి కోరితే.. కాదనే పరిస్థితి సీఎస్ కు ఉంటుందా? అందులోనూ కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి వద్ద పని చేసే వారికి? అలాంటప్పుడు సీఎస్ ప్రస్తావనను తీసుకొచ్చుడేంది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు చెప్పినట్లే చెప్పి.. సీఎస్ పేరుతో మెలిక పెట్టిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Tags:    

Similar News