ఇద్దరు బాబులకూ అత్యంత సన్నిహితుడైనా... ?

Update: 2022-02-23 01:30 GMT
ఆయన సీనియర్ మోస్ట్ నేత. ఒక విధంగా చెప్పాలంటే టీడీపీ తో పాటే రాజకీయాల్లో సాగుతున్న నాయకుడు.1983 నుంచి పోటీ చేస్తూ గెలుస్తూ వస్తున్న ఆయనే శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి కళా వెంకట రావు. ఆయన ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ గా సైతం పనిచేశారు. చంద్రబాబుకే కాదు, లోకేష్ బాబుకు కూడా అత్యంత సన్నిహితుడుగా కళాకు పేరుంది.

అలాంటి నేత ఇపుడు ఏమీ కాకుండా మిగిలిపోతున్నారా అన్న చర్చ అయితే జిల్లాలో జోరుగా  సాగుతోంది. ఉత్తరాంధ్రా జిల్లాల నుంచి తొలి హోం మంత్రిగా మూడున్నర దశాబ్దాల క్రితమే పనిచేసిన కళా వెంకటరావు బలమైన సామాజికవర్గానికి చెందిన వారు. విజయన‌గరం, శ్రీకాకుళం జిల్లాలలో తనకు బంధు గలం, బలం దండీగా ఉన్న నేత. అలాంటి నాయకుడి రాజకీయ జీవితం ఇపుడు అయోమయంలో పడిపోయిందని టాక్.

వచ్చే ఎన్నికల్లో కళాకు టికెట్ ఇస్తారా అన్నంతగా చర్చ వస్తోంది అంటే ఈ సీనియర్ కి ఇబ్బందికరమే అంటున్నారు. కళా రాజకీయ పలుకుబడి బాగా తగ్గిపోవడంతోనే ఆయనకు టికెట్ రాదు అన్న మాటా ఉంది. పోటీ చేద్దామనుకున్న ఎచ్చెర్లకు ఆయన నాన్ లోకల్ క్యాండిడేట్ గా ఉన్నారని అంటున్నారు. అక్కడ స్థానిక తమ్ముళ్ళు కళాకు టికెట్ ఇవ్వవద్దు, తమలో ఎవరికైనా ఇవ్వండి అంటున్నారు.

మరో వైపు కలిశెట్టి అప్పలనాయుడు అక్కడ కళాకు పోటీగా దూసుకుపోతున్నారు. ఆయన పక్కా లోకల్ కార్డుని ఉపయోగిస్తున్నారు. 2019 ఎన్నికల్లో కళా వైసీపీ అభ్యర్ధి గొర్లె కిరణ్ కుమార్ మీద దాదాపుగా 19 వెలా ఓట్ల భారీ తేడాతో ఓడిపోవడంతో ఆయన రాజకీయ  కళ మసకబారింది అంటున్నారు. పోనీ తనకు కాకున్నా కుమారుడికి అయినా టికెట్ ఇస్తారా అని ఆయన గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇంకోవైపు కళాకు పట్టున్న రాజాం వెళ్ళి  విజయనగరం జిల్లాలో కలసిపోయింది. దాంతో స్థాన బలం రాజకీయ పలుకుబడి సిక్కోలులో తగ్గిన కళా వచ్చే ఎన్నికల్లో ఏం చేయాలో తెలియక ఆలోచనలో పడ్డారా అన్న చర్చ అయితే ఉంది.

ఇక వచ్చే ఎన్నికల్లో కొత్త ముఖాలకు టికెట్లు ఇస్తామని తెలుగుదేశం అధినాయకత్వం అంటోంది. మాజీలను, సీనియర్లను పార్టీ కోసం వాడుకుంటుంది అంటున్నారు. ఈ పరిణామాల నేపధ్యంలో కళా వర్గంలో ఆందోళన మొదలైంది. ఇద్దరు బాబులకూ బాగా క్లోజ్ గా ఉన్నా రాజకీయం  ఏ మాత్రం వెలిగిపోవడంలేదని వారు వాపోతున్నారు.
Tags:    

Similar News