బీజేపీ బరాబర్‌ తెలంగాణకు వస్త‌ది: కిష‌న్ రెడ్డి కామెంట్స్‌

Update: 2022-05-14 23:30 GMT
బీజేపీ బరాబర్‌ తెలంగాణకు వస్తుందని బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. టీఆర్ఎస్‌ వైఫల్యాన్ని, బీజేపీ చైతన్యాన్ని సభ ద్వారా తెలియజెప్పాలని ఆయన అన్నారు. అమిత్‌ షా ఎందుకొస్తున్నారని టీఆర్ఎస్‌ నేతలు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణకు రావాలంటే కల్వకుంట్ల ఫ్యామిలీ పర్మిషన్‌ అవసరమా? వాళ్లకేమైనా రాసిచ్చామా? అని నిలదీశారు కిషన్‌రెడ్డి. తెలంగాణపై కల్వకుంట్ల కుటుంబానికి ఎంత హక్కు ఉందో.. ఉద్యమకారులకు, ప్రజలకు, బీజేపీకి అంతే హక్కు ఉందని కిషన్‌రెడ్డి అన్నారు.

ఈ ఎనిమిది ఏళ్లలో తెలంగాణలోని గ్రామాలకు కేంద్రం నిధులు ఇచ్చిందని కిషన్‌రెడ్డి గుర్తు చేశారు. టీఆర్ఎస్‌ను, కేసీఆర్‌ను దళితులు నమ్మే పరిస్థితి లేదన్నారు. తుక్కుగూడ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి ప్ర‌సంగించారు.

అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగం వద్దని కేసీఆర్‌ వద్దంటున్నారని అన్నారు. కేసీఆర్ సొంత రాజ్యాంగం రాసుకుని కుమారుడిని సీఎం చేసుకోవాలని చూస్తున్నారని  కిషన్‌రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్రతి ఇంటికి వంట గ్యాస్‌ను మోడీ ఇచ్చార‌ని తెలిపారు. రెండున్నరేళ్లుగా పేదలకు ఉచితంగా బియ్యం ఇస్తున్నామ‌న్నారు.

దేశంలోని అందరికీ మోడీ  ప్రభుత్వం ఉచితంగా టీకాలు ఇచ్చిందని కిషన్‌రెడ్డి తెలిపారు. బీజేపీ నేతలు రాష్ట్రంలో ఎందుకు తిరగకూడదని ఆయ‌న ప్ర‌శ్నించారు. దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్‌ ఎందుకు చేయలేదని  కిషన్‌రెడ్డి నిల‌దీశారు. ఎస్సీలకు మూడెకరాల భూమి ఇచ్చారా? అని ప్ర‌శ్నించారు.

దళితబంధు, నిరుద్యోగ భృతి ఎంతమందికి ఇచ్చారని నిల‌దీశారు. రైతులకు ఉచితంగా ఎరువులు ఇస్తానన్న హామీ ఏమైందన్నారు. ఎస్టీల రిజర్వేషన్లు పెరగకపోవడానికి కారణం కేసీఆర్ కాదా? అని ప్ర‌శ్నించారు. ఎస్టీల రిజర్వేషన్లు పెంచేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు.

కారును తుక్కుతుక్కు చేసి గ్యారేజీకి పంపడం ఖాయమ‌ని కిష‌న్ రెడ్డి వ్యాఖ్యానించారు. అమిత్‌ షా రాక చూసి ప్రగతిభవన్‌లో ప్రకంపనలు వచ్చాయని అన్నారు. అవినీతి, అసమర్థ పాలనలోనే తెలంగాణ నంబర్‌వన్ అని విమ‌ర్శ‌లు గుప్పించారు. లంకాదహనం మాదిరిగా త్వరలోనే గడీల దహనం త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నుంద‌న్నారు. తెలంగాణ రజాకార్ల సమితి నుంచి ప్రజలకు విముక్తి కల్గుతుందన్నారు. అభినవ సర్దార్‌.. అమిత్ షా తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పిస్తారని చెప్పారు.  కారును తుక్కుతుక్కు చేసి గ్యారేజీకి పంపడం ఖాయమ‌ని అన్నారు.
Tags:    

Similar News