మ‌ళ్లీ గెలుకుతున్న కోమ‌టిరెడ్డి

Update: 2018-06-12 14:59 GMT
గ‌వ‌ర్న‌ర్ మీద దాడిచేసి స‌భా నియ‌మావ‌ళిని ఉల్లంఘించార‌ని శాస‌న‌స‌భ నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి - సంప‌త్ కుమార్ ల‌ను తెలంగాణ ప్ర‌భుత్వం స‌స్పెండ్ చేసింది. ఈ కేసులు ప్ర‌భుత్వ నిర్ణ‌యానికి వ్య‌తిరేకంగా హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు నిచ్చింది. దాంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీర్పును స‌వాల్ చేశారు.  వారి పిటిషన్ విచార‌ణార్హః కాద‌ని కొట్టివేస్తూ కోమ‌టిరెడ్డి - సంప‌త్ కుమార్ ల‌కు అనుకూలంగా మ‌రోసారి కోర్టు వ‌చ్చింది. దీంతో ఈ సారి త‌మ‌ను శాస‌న‌స‌భ్యులుగా గుర్తిస్తార‌ని  కోమ‌టిరెడ్డి - సంప‌త్ కుమార్ లు భావించారు. అయినా తెలంగాణ ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేదు.

దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌తో క‌లిసి స్పీక‌ర్ మ‌ధుసూధ‌నాచారిని క‌లిశారు. రెండు రోజుల‌యినా ప్ర‌భుత్వం నుండి స్పంద‌న లేక‌పోవ‌డంతో తమను ఎమ్మెల్యేలుగా కొనసాగించాలన్న హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయడంలేదని కాంగ్రెస్‌ నేతలు కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి - సంపత్‌ కుమార్‌ కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. ఎమ్మెల్యేలుగా త‌మ‌ను పేర్కొనకపోవడమే కాకుండా.. త‌మ‌కు రావాల్సిన మర్యాద, జీతభత్యాలు ఏవీ ఇవ్వడంలేదు కాబట్టి వారిద్దరిపైనా కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌ హైకోర్టును కోరారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిగే అవకాశం ఉంది.

ఎమ్మెల్యేల పిటిషన్ తిర‌స్క‌రించిన నేప‌థ్యంలో తెలంగాణ ప్ర‌భుత్వం మ‌రో సారి అప్పీలుకు వెళ్లే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం. స‌భా మ‌ర్యాద‌ల‌కు భంగం క‌లిగించిన వ్య‌వ‌హారంలో శాస‌న‌స‌భ్యుల‌ను ఉపేక్షిస్తే భ‌విష్య‌త్ లోనూ ఇలాంటి ఘ‌ట‌న‌లు చోటు చేసుకునే అవ‌కాశం ఉంటుంద‌ని తెలంగాణ ప్ర‌భుత్వం భావిస్తుంది. అందుకే ఎట్టి ప‌రిస్థితుల‌లోనూ వీరి విషయంలో వెన‌క్కి త‌గ్గ‌డం లేద‌ని తెలుస్తుంది. కోర్టు తీర్పు అమ‌లు చేయ‌కుంటే కాంగ్రెస్ స‌భ్యులం అంతా క‌లిసి రాజీనామా చేద్దామ‌ని కోమ‌టిరెడ్డి స‌వాల్ విసిరారు. అయితే ఆ స‌వాల్ కు సొంత‌పార్టీ స‌భ్యులే స్పందించ‌క పోవ‌డంతో కోమ‌టిరెడ్డి ఆ విషయం మ‌ళ్లీ ఎత్త‌డం లేదు. ఈ వ్య‌వ‌హారం ఏ మ‌లుపులు తిరుగుతుందో వేచిచూడాలి.
Tags:    

Similar News