అంతా ఓకేనా : ఇక అంబేద్కర్ కోనసీమగానే...?

Update: 2022-06-24 10:23 GMT
నెల రోజుల క్రితం పచ్చని కోనసీమలో ఎలా చిచ్చురేగిందో అందరికీ తెలిసిన విషయమే. కొత్తగా ఏర్పడిన  కోన్ససీమ జిల్లాకు అంబేద్కర్ పేరుని చేరుస్తూ ప్రభుత్వం నాడు నోటిఫికేషన్ జారీ చేసింది. నెల రోజుల టైమ్  ఇచ్చింది. అయితే ఆ తరువాత ఆందోళనలు పెద్ద ఎత్తున సాగాయి. ఇక ఏకంగా మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇంటి మీద పడి ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఈ పరిణామంతో గోదావరి జిల్లాలలో అగ్గి రాజుకుంది.

అది చివరికి రాజకీయంగా కూడా మంటపుట్టించింది. ఈ దారుణ మారణకాండకు పాల్పడిన వారు ఎవరు అన్న దాని మీద కూడా అధికార విపక్ష పార్టీలు ఒకరి మీద మరొకరు దుమ్మెత్తి పోసుకున్నారు. మొత్తానికి కొనసీమ చిచ్చు నుంచి ఎంత వీలైతే అంత రాజకీయాన్ని పిండుకోవాలని. అందులో చలి కాచుకోవాలని పెద్ద ప్రయత్నమే జరిగింది.

ఇక ప్రభుత్వం కొత్త పేరుకు ఇచ్చిన నెల రోజుల సమయం కూడా ముగిసింది. కోనసీన భగ్గుమన్న తరువాత అందరి చూపూ సర్కార్ వైఖరి మీదనే ఉంది. ప్రభుత్వం ఏమి నిర్ణయం చేస్తుంది అని కూడా అంతా ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు.

ఎట్టకేలకు ఈ రోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ కోనసీమ జిల్లాను అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మారుస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. దానికి మంత్రి వర్గం కూడా ఆమోదముద్ర వేసింది.

అదే విధంగా కొత్తగా ఏర్పాటు చేసిన రెవిన్యూ డివిజన్లూ, మండలాలకు కూడా  మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. ఇక కోనసీమ పేరుని అలాగే ఉంచాలని కోరుతూ కోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. వాటి మీద విచారణకు కోర్టు నిర్ణయం తీసుకుంది. మరి న్యాయపరమైన నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.

మరో వైపు చూస్తే కొత్త జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలన్న ప్రతిపాదనల మీదనే అంత రచ్చ సాగుంది. అగ్గిలా కోనసీమ భగ్గుమంది. ఇపుడు ఏకంగా పేరుని డిసైడ్ చేశారు. మరి దాంతో కోనసీమలో ఏం జరుగుతుంది అన్న ఉత్కంఠ కూడా ఉంది. దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. కోన సీమ జిల్లాలో 1300 మందితో గట్టి పోలీసు బందోబస్తుని కూడా నిర్వహిస్తున్నారు.
Tags:    

Similar News