పంత్ స్థానంలో ఆంధ్రా క్రికెటర్.. క్లిక్కైతే లెక్కే వేరు

Update: 2023-01-01 13:39 GMT
కారు ప్రమాదంలో బాగానే గాయపడిన టీమిండియా యువ క్రికెటర్ రిషభ్ పంత్ కనీసం ఆరు నెలలు క్రికెట్ ఆడే పరిస్థితి లేదు. కనీసం అతడు తిరిగి ప్రాక్టీస్ ప్రారంభించేందుకైనా కొన్ని నెలలు పడుతుంది. ఈ నేపథ్యంలో అతడు కీలక సిరీస్ లు మిస్ కానున్నాడు. ఫిబ్రవరి నుంచి ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగే నాలుగు టెస్టుల సిరీస్, ఐపీఎల్ కు ప్రస్తుతం పంత్ అందుబాటులో ఉండడని తెలుస్తోంది.ప్రమాదంలో అయిన గాయాల తీవ్రతను బట్టి అతడు నాలుగైదు నెలల తర్వాత మైదానంలో కనిపించే పరిస్థితి నెలకొంది.


టెస్టులకు అతడే మొనగాడు పంత్ టి20, వన్డే, టెస్టు మూడు ఫార్మాట్లలోనూ దుమ్మురేపగల సత్తా ఉన్నవాడు. అయితే, పరిమిత ఓవర్ల క్రికెట్ లో నిలకడ లోపం అతడికి శాపమైంది. దీనికితోడు సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ వంటి స్పెషలిస్టులు పోటీ పడుతుండడంతో కచ్చితంగా రాణించాల్సిన ఒత్తిడి. ఈ నేపథ్యంలో వన్డేలు, టి20ల్లో కనీస ప్రభావమే చూపగలిగాడు. దీంతో పంత్ ను టెస్టులకు ఎక్కువగా పరిమితం చేస్తూ వచ్చింది సెలక్షన్ కమిటీ. వాస్తవానికి పంత్ ఆటతీరు కొంత మార్చుకుంటే పరిమిత ఓవర్ల ఫార్మాట్ లోనూ దుమ్మురేపుతాడు.
 

కానీ.. నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకోవడం అతడికి పెద్ద మైనస్.ఇక టెస్టుల్లో మాత్రం పంత్ కు తిరుగులేదు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ గడ్డపై సెంచరీలు కొట్టిన ఘనత అతడి సొంతం.ఈ ఫార్మాట్లో పంత్ లేకుంటే టీమిండియా కొన్ని సిరీస్ లే కోల్పోయేది. అంతెందుకు ఇటీవలి బంగ్లాదేశ్ పర్యటనలోనూ పంత్ లేకుంటే టెస్టుల్లో పరాభవం ఎదుర్కొనాల్సి వచ్చేది.


ఇప్పుడు ఎవరికి చాన్స్? ఆంధ్రా భరత్ కేనా? పంత్ గాయపడి ఆస్పత్రి పాలవడంతో టెస్టుల్లో అతడి స్థానంలో ఎవరిని తీసుకుంటారనేది కీలకం కానుంది. టి20లు, వన్డేల్లో దుమ్మురేపుతున్న జార్ఖండ్ కుర్రాడు ఇషాన్ కిషన్, కేరళ ప్రతిభావంతుడు సంజూ శాంసన్ ముందుగా రేసులో ఉన్నారు. కానీ, వీరింతవరకు టెస్టు ఆడలేదు. ఇక కొన్నాళ్ల నుంచి టెస్టులకు వికెట్ కీపర్ గా ఎక్కువగా వినిపిస్తున్న పేరు కోనా శ్రీకర్ భరత్. విశాఖపట్టణానికి చెందిన భరత్..
రంజీల్లో ఆంధ్రా తరఫున నిలకడైన ప్రదర్శనతో టీమిండియాకు మూడేళ్ల కిందటే ఎంపికైనా మ్యాచ్ ఆడే చాన్స్ రాలేదు. బెంగాల్ కీపర్ సాహా, రిషభ్ పంత్ మొదటి చాయిస్ లుగా ఉండడమే దీనికి కారణం. ఇప్పుడు వారిద్దరూ అందుబాటులో లేని నేపథ్యంలో భరత్ కు చాన్స్ వచ్చింది. అందులోనూ ఆస్ట్రేలియాలాంటి జట్టుపై సిరీస్ ఆడే చాన్స్ దక్కడం చెప్పుకోదగ్గ విషయం. భరత్ ఆ సిరీస్ లో గనుక రాణిస్తే అతడి కెరీర్ ఊపందుకుంటుంది.


వారిద్దరి నుంచి ప్రధాన పోటీ టీమిండియా టెస్టు కీపర్ స్థానం కోసం భరత్ కు పోటీగా ఇషాన్ కిషన్,మధ్యప్రదేశ్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ ఉపేంద్ర యాదవ్ ఉన్నారు.ఉపేంద్ర కూడా భరత్ లానే ఇండియా ఎ జట్టు తరఫున రాణించాడు. ఇక ఆస్ట్రేలియాతో ఫిబ్రవరి 9 నుంచి నాలుగు టెస్టుల సిరీస్‌ ప్రారంభం కానుంది. అయితే, టీం మేనేజ్ మెంట్ భరత్‌, ఉపేంద్ర ఇద్దరికీ నేరుగా జట్టులో స్థానం కల్పించవచ్చు. డ్యాషింగ్‌ లెఫ్ట్‌హ్యాండర్‌ ఇషాన్‌కు అవకాశం ఇవ్వొచ్చు కూడా. సాకేతికంగా చూసుకుంటే.. సెకండ్‌ కీపర్‌గా ఉన్న భరత్‌.. నాగ్‌పూర్‌ టెస్టులో అరగేట్రం చేసే అవకాశాలు ఉన్నాయి. కాగా, ఉపేంద్రకు మెరుగైన గణాంకాలు ఉన్నాయి. మంచి కీపింగ్‌ నైపుణ్యాలతో పాటు 45+ యావరేజ్‌ అతడి సొంతం.భరత్ కంటే మెరుగైన హిట్టర్‌ కూడా. సెలెక్షన్‌ కమిటీ ఎవరిని ఎంపిక చేసుకుంటుందో చూడాల్సి ఉంది.
Tags:    

Similar News