వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ గా కేటీఆర్‌..అందుకే ఈ స్కెచ్‌

Update: 2017-04-05 07:41 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్‌ ఎస్ అధినేత  కేసీఆర్ త‌న‌యుడు మంత్రి కేటీరామారావు ఆ పార్టీ ర‌థ‌సార‌థిగా కానున్నారా? త‌్వ‌ర‌లో ఆయ‌న టీఆర్‌ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప‌గ్గాలు చేప‌ట్ట‌నున్నారా?  జిల్లాలను వ‌రుస‌గా చుట్టేయ‌డం వెనుక కార‌ణం ఇదేనా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. టీఆర్ ఎస్ పగ్గాలు చేపడతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నెల 21న జరిగే టీఆర్‌ ఎస్ ప్లీనరీ సందర్భంగా ఆయనను వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్‌ గా నియమిస్తారనే వార్తలు ఊపందుకున్నాయి.

రెండేళ్ళ క్రితమే కేటీఆర్ టీఆర్‌ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అవుతారని వార్తలు వెలువడ్డాయి. అయితే, నాటి నుండి కొత్త కమిటీ వేయకపోవడంతో ఆ తంతు జరగలేదు. క్యాబినెట్‌ లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు తరువాత అత్యధిక శాఖలు కలిగిన మంత్రిగా కేటీఆర్ తనదైన ముద్ర వేశారు. ఇక పార్టీపై పట్టు బిగించే విధం గా అడుగులు వేస్తున్నారు. ఇందుకు సంస్థాగత ఎన్నికల ప్రక్రియను సరైన సమయంగా ఎంచుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా టీఆర్‌ ఎస్ సభ్యత్వ నమోదు ప్రక్రియ సాగుతున్న సమయంలో కేటీఆర్ జిల్లా పర్యటనలు పెట్టుకున్నారు. ఈ పర్యటనల్లో భాగంగా జిల్లాకు చెందిన మంత్రి, ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా భేటీ అవ్వడం, అక్కడ ఏర్పాటు చేసిన సభల్లో స్థానిక నేతలు లేవనెత్తిన అంశాలపై అక్కడికక్కడే వరాలు కురిపిస్తున్నారు. దీనికి పెద్దపల్లితో శ్రీకారం చుట్టిన కేటీఆర్, అక్కడ జరిగిన సభలో ఎంపీ బాల్క సుమన్ అడిగిన వెంటనే పెద్దపల్లికి రూ.50 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అనంత‌రం తాండూరులో జరిగిన సభలో సైతం అక్కడికక్కడే రూ.50 కోట్లు ప్రకటించారు. దీని ద్వారా జిల్లా నాయకత్వంతో ప్రత్యక్ష సంబంధాలు పెరగడంతో పాటు,సభల్లో అడిగిన వెంటనే నిధులు ప్రకటించడం ద్వారా ప్రజల అభిమానాన్ని చూరగొనవచ్చనే వ్యూహాన్ని అవలంభిస్తున్నారు.

ఇలా ఏప్రిల్ 21న జ‌ర‌గ‌బోయే ప్లీనరీ వ‌ర‌కు జిల్లాలు చుట్టేయ‌నున్న‌ట్లు చెప్తున్నారు. అనంత‌రం జ‌ర‌గ‌బోయే ప్లీన‌రీలో కేటీఆర్‌ను కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడిగా ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్‌ లో ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ దే తుది నిర్ణ‌యం అని స్పష్టం చేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News