క‌ర్ణాట‌క‌లో సీన్ రివ‌ర్స‌వుతోంది

Update: 2018-04-07 05:32 GMT
పొరుగు రాష్ట్రమైన క‌ర్ణాట‌క‌లో ఆస‌క్తిక‌ర‌మైన ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జాతీయ పార్టీలైన బీజేపీ - కాంగ్రెస్‌ లు హోరాహోరీ పోరు చేస్తుండ‌గా...ప్రాంతీయ పార్టీ అయిన జేడీఎస్ సైతం త‌న స‌త్తా చాటుకునేందుకు సిద్ధ‌మవుతోంది. ఈ క్ర‌మంలో కుమార‌స్వామి కీల‌క శ‌క్తిగా ఎదిగారని అంటున్నారు. ఇందుకు తాజా స‌భ‌ను ఉదాహ‌ర‌ణ‌గా పేర్కొంటున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కర్ణాటకకు చెందిన దాదాపు 12 మంది ఉన్నతస్థాయి నేతలతో కలిసి తుమకూరు జిల్లాలో ఇటీవల నిర్వహించిన ఎన్నికల ప్రచార సభకు హాజరయ్యారు. అదేరోజు జిల్లా కేంద్రానికి దూరంగా జేడీఎస్ నేత హెచ్‌ డీ కుమారస్వామి మండుటెండలో ప్రచారం చేపట్టారు. కుమారస్వామి వెంట ఒక్కరంటే ఒక్కరు కూడా పెద్ద నేతలు లేకున్నా రాహుల్ సభ కంటే ఎక్కువ సంఖ్యలో జనం కుమారస్వామి సభకు హాజరయ్యారు. దీంతో విశ్లేష‌కుల లెక్క‌లు మారిపోయాయంటున్నారు.

జేడీఎస్ అసలు తమకు పోటీనే కాదని ఇటీవలి వరకు అధికార కాంగ్రెస్ - ప్రతిపక్ష బీజేపీ భావించాయి. ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది. మైసూర్‌ లో కుమారస్వామి సభలకు వస్తున్న ప్రజా స్పందనతో కాంగ్రెస్ ఆందోళనకు గురవుతోంది. జేడీఎస్ భారీ విజయాలు సాధిస్తే రాష్ట్రం మొత్తం మీద కాంగ్రెస్ సీట్లు తారుమారవుతాయని బీజేపీ లెక్కలు వేసుకుంటోంది. చాలా స్థానాల్లో ఫలితాలను ప్రభావితం చేయగలిగే స్థాయిలో ఉన్న వక్కళిగ సామాజిక వర్గం ఓటర్లు జేడీఎస్‌ కు అండగా నిలిచే అవకాశం ఉందని అంచ‌నా. రాష్ట్ర - జాతీయ రాజకీయాల్లో నిలబడాలంటే ఇదే చివరి అవకాశమని దేవెగౌడకు - కుమారస్వామికి బాగా తెలుసని అందుకే చెమ‌టోడుస్తున్నార‌ని చెప్తున్నారు.ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ లేదా బీజేపీ ఏది అధికారంలోకి వచ్చిన జేడీఎస్ అప్రాధాన్య పార్టీగా మారిపోతుందన్నారు.

కాగా ప్ర‌స్తుత ఎన్నిక‌ల‌పై కుమారస్వామి ఆస‌క్తిగా స్పందించారు. `మేం ఎవరికీ బీ-టీంగా ఉండదల్చుకోలేదు. మేం మా విజయం కోసం పోరాడుతున్నాం. స్పష్టమైన మెజార్టీతో మేం అధికారాన్ని సాధిస్తాం. రెండు జాతీయ పార్టీలను మట్టికరిపిస్తాం` అని కుమారస్వామి చెప్పారు. తాను గెలుపు కోసం పోరాడుతున్నానే తప్ప ఎవరికో సహాయం చేయడానికి కాదని అన్నారు. కాగా, ప్ర‌స్తుత గ‌ణాంకాల నేప‌థ్యంలో గౌడల మీద సిద్ధరామయ్య, రాహుల్‌గాంధీ విమర్శలు చేయకపోవడమే మంచిదని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
Tags:    

Similar News