సీన్లోకి నాన్న‌ను దించుతానంటున్నాడు

Update: 2018-05-17 07:54 GMT
మెజార్టీ లేకున్నా ప్ర‌భుత్వ ప‌గ్గాల్ని బీజేపీ స్వీక‌రించ‌టంపై విప‌క్షాలు తీవ్ర‌స్థాయిలో మండిప‌డుతున్నాయి. అనైతిక చ‌ర్య‌కు పాల్ప‌డ్డారంటూ ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మెజార్టీ లేకున్నా య‌డ్యూర‌ప్ప‌కు అవ‌కాశం క‌ల్పించ‌టంపై జేడీఎస్ పార్టీలు పోరాటానికి రెఢీ అంటున్నాయి. ఇందులో భాగంగా బీజేపీపై తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు జేడీఎస్ నేత కుమార‌స్వామి.

త‌మ పోరాటానికి నాయ‌క‌త్వం వ‌హించి.. అన్ని ప్రాంతీయ పార్టీల‌తో మాట్లాడాల్సిందిగా త‌న తండ్రిని కోర‌నున్న‌ట్లుగా కుమార‌స్వామి వెల్ల‌డించారు. ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌ల్ని బీజేపీ ధ్వంసం చేస్తోంద‌ని..  ఆ పార్టీ అనుస‌రిస్తున్న తీరును త‌న తండ్రి  దృష్టికి తీసుకెళ్ల‌నున్న‌ట్లు వెల్ల‌డించారు.  దేశ ప్ర‌యోజ‌నాల్ని కాపాడ‌టం కోసం ప్రాంతీయ పార్టీల‌న్నీ క‌లిసి సాగాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

మెజార్టీ లేకున్నా.. య‌డ్యూర‌ప్ప‌కు సీఎంగా ఛాన్స్ ఇచ్చి గ‌వ‌ర్న‌ర్ వ‌జూభాయ్ వాలా త‌ప్పుగా వ్య‌వ‌హ‌రించార‌ని చెప్పారు. త‌న‌కున్న అధికారాన్ని దుర్వినియోగం చేసిన‌ట్లుగా కుమార‌స్వామి నిప్పులు చెరిగారు. బీజేపీ ప్ర‌లోభాల‌కు గురి కాకుండా త‌మ ఎమ్మెల్యేల్ని కాపాడుకోవ‌టం త‌మ ముందు ఉన్న ల‌క్ష్యంగా కుమార‌స్వామి వెల్ల‌డించారు.

త‌మ పార్టీ ఎమ్మెల్యేల్ని కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని.. కేంద్ర ప్ర‌భుత్వం వైఖ‌రి ఎలా ఉందో ప్ర‌జ‌లు గ‌మ‌నించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని కుమార‌స్వామి పిలుపునిచ్చారు. ఇప్ప‌టివ‌ర‌కు కుమారులు న‌డిపిన రాజ‌కీయం ఎలా ఉందో చూశారు. మ‌రి.. త‌న తండ్రిని రంగంలోకి దింప‌నున్న‌ట్లుగా కుమార‌స్వామి చెప్పిన మాట‌ల‌కు ఎఫెక్ట్ ఎంతలా ఉంటుందో చూడాలి.


Tags:    

Similar News