118 మంది ఎమ్మెల్యేల‌తో రాజ్ భ‌వ‌న్ లో కుమార‌స్వామి!

Update: 2018-05-16 12:04 GMT
క‌ర్ణాట‌క ఎన్నిక‌లు దేశవ్యాప్తంగా ఎంత ఉత్కంఠ‌ను రేపాయో....వాటి ఫ‌లితాలు `అంత‌కు మించి` తీవ్ర ఉత్కంఠ‌ను రేకెత్తిస్తున్నాయి. రాస్తే రామాయ‌ణం...తీస్తే థ్రిల్ల‌ర్ మూవీ త‌ర‌హాలో క‌న్న‌డనాట రాజ‌కీయ ప‌రిణామాలు ఘ‌డియ‌ఘ‌డియ‌కు మారుతున్నాయి. క‌లిసొచ్చే కాలానికి సీఎం ప‌ద‌వి న‌డిచి రావ‌డంతో జేడీఎస్ నేత కుమార‌స్వామి....కాంగ్రెస్ కు మ‌ద్ద‌తిచ్చేందుకు ముందుకు వ‌చ్చారు. సెంచ‌రీకి ప‌రుగు దూరంలో చివ‌రి వికెట్ ర‌నౌట్ అయిన త‌ర‌హాలో ఉంది బీజేపీ ప‌రిస్థితి. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మెజారిటీ సీట్లు ద‌క్కించుకున్న‌ప్ప‌టికీ ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌డానికి దొడ్డిదారులు వెత‌కాల్సి రావ‌డం ఆ పార్టీ పెద్ద‌ల‌కు మింగుడు ప‌డ‌డం లేదు. దీంతో, దేవెగౌడ కుటుంబంతో....జేడీఎస్ తో మూడు ముక్క‌లాటాడేందుకు కూడా బీజేపీ సిద్ధ‌ప‌డింది. ఈ నేప‌థ్యంలోనే క‌న్న‌డ నాట క్యాంపు రాజ‌కీయాలు ఊపందుకున్నాయి. 12 మ‌ది జేడీఎస్ ఎమ్మెల్యేల‌కు త‌లా 100 కోట్ల రూపాయ‌ల‌ను బీజేపీ ఆఫ‌ర్ చేసింద‌ని కుమార‌స్వామి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ నేప‌థ్యంలోనే ఆ పార్టీ ఎమ్మెల్యేలు ...ఈ పార్టీలో చేర‌బోతున్నారంటూ వ‌స్తోన్న ఊహాగానాల‌కు కుమార‌స్వామి చెక్ పెట్టారు. తాజాగా 118 మంది ఎమ్మెల్యేలను తీసుకొని గ‌వ‌ర్న‌ర్ వాజుభాయ్ ను క‌లిసేందుకు కుమార‌స్వామి రాజ్ భ‌వ‌న్ కు చేరుకున్నారు. త‌న‌ను ప్ర‌భుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాల‌ని కుమార‌స్వామి గ‌వ‌ర్న‌ర్ ను కోరారు.

కర్ణాట‌క‌లో రాజ్ భ‌వ‌న్ వ‌ద్ద హైడ్రామా న‌డుస్తోంది. త‌న‌కు 118 మంది ఎమ్మెల్యేల మ‌ద్ద‌తుంద‌ని, ప్ర‌భుత్వ ఏర్పాటు కు అనుమ‌తివ్వాల‌ని గ‌వ‌ర్న‌ర్ వాజుభాయ్ ను కుమార‌స్వామి కోర‌బోతున్నారు. ప్ర‌త్యేక బ‌స్సుల్లో ఆ 118 మంది ఎమ్మెల్యేలు రాజ్ భ‌వ‌న్ కు చేరుకున్నారు. త‌న బ‌లం నిరూపించుకునేందుకు అవ‌స‌ర‌మైతే గ‌వ‌ర్న‌ర్ ఎదుట ఎమ్మెల్యేల‌ల‌తో ప‌రేడ్ నిర్వ‌హించేందుకు కూడా తాను సిద్ధ‌మ‌ని కుమార‌స్వామి చెప్పిన‌ట్లు తెలుస్తోంది. అయితే, త‌న‌ను క‌లిసేందుకు కాంగ్రెస్, జేడీఎస్ కు చెందిన 10 మంది ఎమ్మెల్యేల‌ను మాత్ర‌మే గ‌వ‌ర్న‌ర్ అనుమతించిన‌ట్లు తెలుస్తోంది. ప‌రేడ్ చేసేందుకు ఆయ‌న విముఖ‌త వ్య‌క్తం చేసిన‌ట్లు తెలుస్తోంది. అయితే, రాజ్ భ‌వ‌న్ లో గ‌వ‌ర్న‌ర్ తో భేటీ అయిన త‌ర్వాత య‌ల‌హంక‌లోని రిసార్ట్స్ కు 118మంది ఎమ్మెల్యేల‌ను త‌ర‌లించ‌బోతున్నార‌ని తెలుస్తోంది. మ‌రోవైపు, ఈ ఎన్నిక‌ల్లో గెలుపొందిన ఎమ్మెల్యేల జాబితాను ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్...గ‌వ‌ర్న‌ర్ కు అంద‌జేశారు. మ‌రోవైపు, ఈ భేటీ అనంత‌రం గ‌వ‌ర్న‌ర్ ను య‌డ్యూర‌ప్ప క‌ల‌వ‌బోతున్నట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం గ‌వ‌ర్న‌ర్ కోర్టులో బంతి ఉన్నందును ప్ర‌భుత్వ ఏర్పాటుకు ఎవ‌రిని ఆహ్వానిస్తార‌న్న‌దానిపై తీవ్ర ఉత్కంఠ ఏర్ప‌డింది. 
Tags:    

Similar News