ఆయ‌న‌వ‌ల్ల‌..బీజేపీ వ్య‌తిరేక శ‌క్తుల సంతోషం

Update: 2018-05-23 12:42 GMT
అంద‌రి  ముఖంలో సంతోషం...త‌మ ఉమ్మ‌డి శ‌త్రువును మ‌ట్టిక‌రిపించిన ఆనందం, రాబోయే కాలంలో  త‌మ‌దే భ‌విష్య‌త్ అనే విశ్వాసం..ఇలాంటి సంబ‌రానికి వేదిక అయింది...కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణ స్వీకారోత్సవ కార్య‌క్ర‌మం. ఈ ప్రాంతీయ పార్టీల ప్ర‌త్య‌ర్థి బీజేపీ అనే సంగ‌తి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. కుమార‌స్వామి ప్ర‌మాణ స్వీకారం కార్య‌క్ర‌మాన్ని ప్రతిపక్షాలు తమ ఐక్యతను చాటుకునే వేదికగా మార్చేశాయి. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ నేతలు, పలు రాష్ర్టాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.

104 స్థానాల‌తో అతిపెద్ద పార్టీగా నిలిచిన బీజేపీ నుంచి య‌డ్యూర‌ప్ప సీఎంగా ప్ర‌మాణ‌స్వీకారం చేసినా.. బ‌లం నిరూపించుకోలేక మూడు రోజుల‌కే త‌ప్పుకున్న విష‌యం తెలిసిందే. కాంగ్రెస్ 78 - జేడీఎస్ 37 స్థానాల‌తో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటుచేశాయి. ఈ సంకీర్ణ స‌ర్కారులో సీఎంగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన కుమార‌స్వామి బుధ‌వారం ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. ఈ కార్య‌క్ర‌మం బీజేపీ వ్య‌తిరేక శ‌క్తుల వేదిక అయింది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ - ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు - కేరళ సీఎం పినరయి విజయన్ - కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ - సోనియాగాంధీ - యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ - బీఎస్పీ అధినేత్రి మాయావతి - ఎన్సీపీ అధినేత శరద్ పవార్ - ఆర్జేడీ నేత తేజ్‌ ప్రతాప్ యాదవ్ - సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి - సీపీఐ ప్రధాన కార్యదర్శి ఎ రాజా ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చారు. వీళ్లంతా కుమారస్వామిని అభినందించారు.తెలంగాణ‌ సీఎం కేసీఆర్ ఒకరోజు ముందే బెంగళూరు వెళ్లి కుమారస్వామిని అభినందించి వచ్చిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా నేతలంతా ఎంతో ఉత్సాహంగా కనిపించారు. ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత నేతలంతా వేదికపై నుంచి ప్రజలకు అభివాదం చేశారు. ఒకరకంగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న పార్టీలన్నీ బెంగళూరు విధానసౌధ ముందు కొలువుదీరాయి. కాగా, కుమార‌స్వామి క‌ర్ణాట‌క సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌డం ఇది రెండోసారి. గ‌తంలో 2006లో తొలిసారి క‌ర్ణాట‌క సీఎం అయ్యారు.
Tags:    

Similar News