మోదీ చాలెంజ్ కు స్పందించిన కుమార స్వామి!

Update: 2018-06-13 11:05 GMT
కొద్ది రోజులుగా దేశ‌వ్యాప్తంగా ఫిట్ నెస్ చాలెంజ్ ట్రెండింగ్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ‘హమ్‌ ఫిట్‌ తో ఇండియా ఫిట్‌’ అంటూ కేంద్ర క్రీడా శాఖా మంత్రి రాజ్య‌వ‌ర్థ‌న్ సింగ్ రాథోడ్ ....కోహ్లీకి చాలెంజ్ విసిరిన విష‌యం విదిత‌మే. ఆ స‌వాల్ ను స్వీక‌రించిన కోహ్లీ...ప్ర‌ధాని మోదీకి స‌వాల్ విసిరారు. దీంతో, కోహ్లీ స‌వాల్ కు స్పందించిన ప్ర‌ధాని మోదీ.....త‌న ఫిట్ నెస్ వీడియోను ట్వీట్ చేస్తూ....క‌ర్ణాట‌క సీఎం కుమార స్వామి - టీటీ ప్లేయ‌ర్ మ‌నికా బాత్రాతోపాటు దేశంలో 40 ఏళ్లు దాటిన ఐఏఎస్ ల‌ను చాలెంజ్ చేశారు. క‌న్న‌డ‌నాట త‌మ చేతికి అధికారం ద‌క్కకుండా చేసిన కుమార స్వామికి మోదీ ఫిట్ నెస్ చాలెంజ్ విస‌ర‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ నేప‌థ్యంలోనే మోదీ చాలెంజ్ పై కుమార స్వామి స్పందించారు. మోదీకి బ‌దులిస్తూ కర్ణాటక సీఎం కార్యాలయం త‌న అధికారిక‌ ట్విట్ట‌ర్ ఖాతాలో ట్వీట్ చేసింది.

త‌న‌కు ప్ర‌ధాని మోదీ ‘హమ్‌ ఫిట్‌ తో ఇండియా ఫిట్‌’ చాలెంజ్ విస‌ర‌డాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు కర్ణాటక సీఎం కుమార స్వామి సీఎం కార్యాలయం ట్విటర్ ఖాతాలో ట్వీట్ చేశారు. తన ఆరోగ్యం గురించి మోదీ చూపుతోన్న శ్రద్ధకు ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ అనేది అంద‌రికీ ముఖ్య‌మేన‌ని, తాను ‘హమ్‌ ఫిట్‌ తో ఇండియా ఫిట్‌’ కు మ‌ద్ద‌తు తెలుపుతున్నాన‌ని చెప్పారు. తాను ప్ర‌తిరోజూ ట్రెడ్‌ మిల్ పై వర్కవుట్స్ చేస్తాన‌ని, యోగా కూడా చేస్తానని  కుమారస్వామి తెలిపారు. అయితే, తాను త‌న ఫిట్ నెస్ క‌న్నా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అభివృద్ధి గురించి ఎక్కువ‌గా  ఆందోళన చెందుతున్నానని చెప్పారు. త‌న రాష్ట్రాభివృద్ధికి మోదీ మద్దతు కావాల‌ని కోరుతూ ట్వీట్ చేశారు. మోదీ చాలెంజ్ కు కుమార‌స్వామి ఇచ్చిన జ‌వాబుపై నెటిజ‌న్లు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. త‌న రాష్ట్రాభివృద్ధికి మోదీ మ‌ద్ద‌తు కోర‌డం ద్వారా ప‌రోక్షంగా బీజేపీకి చుర‌క‌లంటించిన‌ట్లుంద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. క‌న్న‌డ‌నాట పాల‌న స‌జావుగా సాగేలా చూడాల‌ని,....అందుకు బీజేపీ నేత‌ల క్యాంప్ రాజ‌కీయాలు క‌ట్టిపెట్టాల‌ని కుమార‌స్వామి కోరిన‌ట్లుంద‌ని సెటైర్లు వేస్తున్నారు. మ‌రి కుమార‌స్వామి ట్వీట్ కు మోదీ ఏ విధంగా స్పందిస్తారో ఆస‌క్తికరంగా మారింది.

Tags:    

Similar News