క‌ర్ణాట‌క సీన్లోకి ఇద్ద‌రు చంద్రుళ్లు దిగుతారా?

Update: 2018-05-17 07:06 GMT
కొన్నిసార్లు అంతే. ఎలాంటి సంబంధం లేకున్నా కొన్ని స‌మ‌స్య‌లు వ‌చ్చి మీద‌న ప‌డిపోతుంటాయి. తెలుగు రాష్ట్రాల‌కు పొరుగున ఉన్న క‌ర్ణాట‌క రాష్ట్రంలో సాగుతున్న అల‌జ‌డి.. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్ని.. ఇద్ద‌రు చంద్రుళ్ల‌ను ట‌చ్ చేయ‌నుంది. త‌మ ప్ర‌మేయం లేకుండానే ఇప్పుడు క‌ర్ణాట‌క రాజ‌కీయాల గురించి స్పందించాల్సిన అనివార్య‌త ఏర్ప‌డిందని చెప్ప‌క త‌ప్ప‌దు.

జేడీఎస్ నేత కుమార‌స్వామి చేసిన సంచ‌ల‌న వ్యాఖ్య‌ల్ని చూస్తే.. ఇద్ద‌రు చంద్రుళ్ల‌కు కొత్త క‌ష్టం రానుందా? అన్న సందేహం రాక మాన‌దు. ఎందుకంటే.. ప్రాంతీయ పార్టీల‌తో క‌లిసి పోరాడ‌తామ‌ని.. జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు స్పందించాలంటూ కుమార‌స్వామి విజ్ఞప్తి చేయ‌టం గ‌మ‌నార్హం.

ఈడీ సాయంతో త‌మ ఎమ్మెల్యేల‌ను బెదిరించాల‌ని బీజేపీ ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లుగా ఆయ‌న తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. క‌ర్నాట‌క ఫ‌లితాలు.. త‌ద‌నంత‌ర ప‌రిణామాలు అక్క‌డితో ఆప‌కుండా.. త‌మ‌కు జ‌రిగిన అన్యాయాన్ని దేశ వ్యాప్తంగా ప్ర‌చారం చేయాల‌న్న ఆలోచ‌న‌లో కుమార‌స్వామి అండ్ కోఉన్న‌ట్లుగా తెలుస్తోంది.

ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పేరుతో కొత్త విధానాల్ని తెర మీద‌కు తెస్తూ.. కేంద్రం పెత్త‌నాన్ని.. రాష్ట్రాల‌కు మ‌రిన్ని హ‌క్కులు ఇవ్వాలంటూ స్వ‌రం విప్పిన తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు ఇప్పుడు ఇబ్బందేన‌ని చెప్పాలి. చూస్తూ.. చూస్తూ మోడీ మీద సూటిగా విమ‌ర్శ‌లు చేసేందుకు కేసీఆర్ తొంద‌ర‌ప‌డ‌రు. అందులోని త‌న రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కు సంబంధం లేని ఇష్యూలో ఆయ‌న త‌ల‌దూర్చే త‌త్త్వం ఆయ‌న‌ది కాదు. అలాంటిది ఇప్పుడు.. స్పందించాల్సిన అవ‌స‌రం వ‌చ్చింది. ఎందుకంటే.. కుమార‌స్వామి త‌న‌కు తానుగా కేసీఆర్ ను.. చంద్ర‌బాబును స్పందించాల‌ని కోరారు. జాతీయ‌స్థాయిలో చ‌క్రం తిప్పాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్న కేసీఆర్ కు తాజా వ్య‌వ‌హారం కాస్త క‌ఠిన‌మైన‌దే.

మోడీ అండ్ కో ప‌ర్స‌న‌ల్ గా ఫీల‌వుతున్న ఇష్యూలోకి కేసీఆర్ త‌ల‌దూర్చ‌టం అంటే.. మోడీని ఢీ కొనేందుకు రెఢీ అయిన‌ట్లే. ఇక్క‌డ స‌మ‌స్య ఏమిటంటే.. ఒక‌వేళ నా రాష్ట్రానికి సంబంధించిన వ్య‌వ‌హారం కాద‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తే.. జాతీయ స్థాయిలో చ‌క్రం తిప్పే అర్హ‌త‌ను కేసీఆర్ కోల్పోతారు. అంతేకాదు.. సాటి మిత్రుడికి క‌ష్టం వ‌చ్చిన‌ప్పుడు అండ‌గా నిల‌బ‌డ‌లేక‌పోవ‌టం నాయ‌కుడి తీరు కాద‌న్న ప్ర‌చారం జ‌రుగుతుంది. అలా అని.. అండ‌గా నిలిస్తే.. మోడీ అండ్ కో ఫోక‌స్ కేసీఆర్ మీదా.. తెలంగాణ మీదా ప‌డుతుంద‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు. మ‌రి.. ఈ ఇష్యూలో కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతార‌న్న‌ది ఆస‌క్తిక‌ర‌మైన అంశంగా చెప్పాలి.

మ‌రోవైపు.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు వ్య‌వ‌హారం. ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్పాలి. గ‌తంలో త‌ర‌చూ జాతీయ రాజ‌కీయాల మీద ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శించ‌టం.. చ‌క్రం తిప్పాల‌న్న త‌హ‌త‌హ ఆయ‌న‌లో ఎక్కువ క‌నిపించేది. విభ‌జ‌న త‌ర్వాత పుట్టెడు స‌మ‌స్య‌ల‌తో ఉన్న రాష్ట్రానికి సీఎం కావ‌టంతో ఆయ‌న వ్య‌వ‌హారాలు ఆయ‌న చూసుకోవటానికే స‌రిపోవ‌టం లేదు. ఇలాంటి వేళ‌.. క‌ర్ణాట‌క ఇష్యూను నెత్తిన వేసుకోవ‌టం అంటే.. కొత్త త‌ల‌నొప్పిని మీద వేసుకోవ‌ట‌మే. ఇప్ప‌టికే మోడీతో పెట్టుకున్న పంచాయితీల‌తో.. ఎప్పుడేం జ‌రుగుతుందో అర్థం కాని ప‌రిస్థితి. ఇలాంటి వేళ‌.. క‌ర్ణాట‌క ఇష్యూలోకి ఎంట‌ర్ కావ‌టం ద్వారా  మోడీషాల‌కు మ‌రింత ఆగ్ర‌హం క‌లిగించ‌టం త‌ప్పించి మ‌రింకేమీ ఉండ‌ద‌ని చెబుతున్నారు. మోడీ మీద క‌త్తి దూసేందుకు సిద్ధంగా లేని వేళ‌లో ఇద్ద‌రు చంద్రుళ్లను పోరు చేయాల‌ని కోరుతున్న కుమార‌స్వామి పెద్ద చిక్కే తెచ్చి పెట్టార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News