కరోనా వేళ రాజశేఖరరెడ్డిని గుర్తు చేసిన కేవీపీ

Update: 2020-04-03 15:00 GMT
ప్రపంచమంతా ఇప్పుడు వినిపిస్తున్న ఒకే మాట కరోనా. తెలుగు రాష్ట్రాల్లోనూ అందరి నోటా కరోనా మాటే వినిపిస్తోంది. ఇలాంటి వేళ రాజ్యసభ ఎంపీ, కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని గుర్తుచేశారు. ఆయన చేసిన ఒక చట్టం ఇప్పుడు వైద్యులు, వైద్య సిబ్బందికి రక్షణగా ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ మేరకు ఆయన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను కోరారు.

కోవిడ్-19 పేషెంట్లకు తమ తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి సేవలు అందిస్తున్న  వైద్య సిబ్బందిపై దాడులు జరుగుతున్నాయని.. ఇలాంటి పరిస్థితి మంచిది కాదని కేవీపీ అన్నారు. దాడులను ఆయన ఖండించారు. వైద్య సిబ్బంది, ఆసుపత్రు లపై దాడులుకు వ్యతిరేకంగా  దేశంలో తొలిసారిగా ఏపి చట్టం చేసిందని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. 2007 లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి చేసిన ఆ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని ఆయన ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను కోరారు.

ఏపీలో 2007లో రాజశేఖరరెడ్డి ఆ చట్టం చేయగా ఆ వెంటనే హర్యానా తదితర రాష్ట్రాలు అదే తరహాలు చట్టాలు చేశాయని గుర్తు చేసిన ఆయన వైద్యులు, సిబ్బందిపై దాడులకు పాల్పడిన వారిని గుర్తించి, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను కోరారు.  ఇలాంటి ఆపత్కాల సమయంలో మనందరి క్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించే మార్గదర్శకాలను, విధించే ఆంక్షలను ప్రజలు తప్పనిసరిగా పాటించాలన్నారు.

ఏఐసిసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదేశాల మేరకు, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సాధ్యమైనంత వరకు కష్టాలలో ఉన్న వారికి అండగా ఉండేందుకు, సాయం అందించేందుకు కృషి చేయాలని..  బయటి రాష్టాల నుంచి బతుకు తెరువు కోసం తెలుగు రాష్ట్రాలకు వలస వచ్చి, మౌలిక వసతుల కోసం ఇబ్బందులు పడుతున్నవారికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సాయం చేయాలని కోరారు.  ఉభయ రాష్ట్రాలకు చెందిన  పిసిసి లు రూపొందించిన కార్యాచరణ కు అనుగుణంగా రెండు రాష్ట్రాలలోని ప్రతి కార్యకర్త క్రమశిక్షణ గల సైనికుడి లా పనిచేయాలని పిలుపునిచ్చారు.

Tags:    

Similar News