లగడపాటి సర్వే.. ఆ మంత్రికి ఓటమి తప్పదట

Update: 2019-05-21 13:18 GMT
ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాతనే హడావిడి ఎక్కువగా కనిపిస్తోంది. రాష్ట్రంలోని పార్టీలన్నీ విజయంపై ధీమాను ప్రదర్శిస్తోంది. అదే సమయంలో ఏపీలోని ఒక్కో వర్గం ఒక్కోలా టెన్షన్ పడుతోంది. పోటీచేసిన అభ్యర్థులకు గెలుస్తామా? లేదా? అనే టెన్షన్‌.. తాము గెలిచినా.. తమ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందా? లేదా? అనే టెన్షన్‌. పందెంరాయుళ్లకు తాము బెట్టింగ్‌ వేసిన అభ్యర్థి గెలుస్తాడా? లేదా? అనే టెన్షన్‌. గ్రామాల్లో కేడర్‌ కి తమ పార్టీ అభ్యర్థి గెలుస్తాడా? లేదా? అనే టెన్షన్‌.. ఇలా ఎన్నికల ఫలితాలు వచ్చేవరకు చాలా వర్గాల్లో ఉత్కంఠ వాతావరణం కొనసాగుతుంది. ఈ కారణంగానే రాష్ట్రంలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. వీటికితోడు ఇటీవల వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరింత వేడిని రాజేశాయి.

 ముఖ్యంగా ఎగ్జిట్ పోల్స్ వెలువడిన తర్వాత పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వీటిలో ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్న పితాని సత్యనారాయణకు సంబంధించిన వార్త ఒకటి. గత ఆదివారం మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఎగ్జిట్ పోల్స్ సర్వేను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సర్వేలో పితాని సత్యనారాయణ ఓడిపోబోతున్నారని తేలినట్లు తెలుస్తోంది. ఈ సర్వే ప్రకారం.. వైసీపీ అభ్యర్థికి 43.34 శాతం ఓట్లు, పితానికి 38.93 శాతం ఓట్లు మాత్రమే వస్తాయని, అక్కడి నుంచి పోటీ చేసిన జనసేన అభ్యర్థికి 12.53 శాతం ఓట్లు పోలయ్యే అవకాశం ఉందట. మొత్తానికి సార్వత్రిక ఎన్నికల్లో సిట్టింగ్ స్థానమైన ఆచంట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన ఓడిపోబోతున్నారన్న వార్త పశ్చిమ గోదావరి జిల్లాలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది.

 గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పితాని సత్యనారాయణ 2014 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పుడు ఆచంట నుంచి పోటీ చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముద్దనూరి ప్రసాద్ రాజుపై విజయం సాధించారు. దీంతో టీడీపీ అధినేత ఆయనకు మంత్రి పదవిని కట్టబెట్టారు. అయితే, తాజా ఎన్నికలకు ముందు పితానికి టికెట్ ఇవ్వడం లేదన్న వార్తతో పాటు, ఆయన టీడీపీని వీడబోతున్నారన్న ప్రచారం జోరుగా జరిగింది. కానీ, ఇవేమీ జరగలేదు. ఆయనకు ఆచంట టికెట్ కేటాయించారు చంద్రబాబు. వైసీపీ మాత్రం అభ్యర్థిని మార్చింది. గత ఎన్నికల్లో ఓడిపోయిన ప్రసాద్ రాజును పక్కనబెట్టి చెరుకువాడ శ్రీరంగనాథ రాజును బరిలోకి దించింది. ఇక, జనసేన నుంచి జవ్వాది వెంకట విజయరామ్ పోటీ చేశారు.
Tags:    

Similar News