జైట్లీ చేతిలో తెలంగాణ మంత్రికి ప‌రాభ‌వం

Update: 2018-02-10 04:30 GMT
తెలంగాణ  వైద్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డికి ఘోర అవ‌మానం జ‌రిగింద‌ని చ‌ర్చ జ‌రుగుతోంది. అది కూడా దేశ రాజ‌ధాని ఢిల్లీ వేదిక‌గా అని ప‌లువురు పేర్కొంటున్నారు. పైగా సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త‌ - ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ స‌న్నిహితుడిగా పేరొందిన ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ వ‌ల్ల అని విశ్లేషిస్తున్నారు. తెలంగాణకు ఏడాది కిందట ప్రకటించిన ఎయిమ్స్‌ కు నిధులు కేటాయించాలని విన్నవించేందుకు హస్తినకు వచ్చిన ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ పార్లమెంట్‌ లాబీలో అపాయింట్‌ మెంట్‌ ఇవ్వటంపై ఈ ర‌క‌మైన విశ్లేష‌ణ‌లు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి.

సాధారణంగా ఎంపీలు సైతం తమ రాష్ట్ర అంశాలను నివేదించేందుకు వస్తే పార్లమెంట్‌లోని మంత్రుల కార్యాలయంలో కలవడం ఆనవాయితీ. కానీ అందుకు విరుద్ధంగా రాష్ట్ర మంత్రిని జైట్లీ లాబీలో కలవడం గమనార్హం. ఎయిమ్స్‌ నిధుల అంశంపై వైద్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి శుక్రవారం పార్టీ ఎంపీలతో కలిసి కేంద్రమంత్రులు అరుణ్‌ జైట్లీ - వైద్య ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాను కలిశారు. ఎయిమ్స్‌ ఏర్పాటుకు అవసరమైన స్థలం - ఇతర సదుపాయాలు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని వివరించారు. ఇదే విషయమై ఆరోగ్యశాఖ కార్యదర్శి ప్రీతిసుదన్‌ తోనూ మంత్రి సమావేశమయ్యారు. నిధులను సాధ్యమైనంత త్వరగా విడుదలచేయాలని కోరారు. మంత్రి వెంట ఎంపీలు జితేందర్‌ రెడ్డి - సీతారాంనాయక్‌ - నగేష్‌ - విశ్వేశ్వరరెడ్డి - ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి తదితరులున్నారు.

పార్ల‌మెంటు లాబీలో ఈ భేటీ నిర్వ‌హించిన జైట్లీ తీరు ఇబ్బందిక‌రంగా ఉంద‌ని ప‌లువురు అంటున్నారు. రాష్ట్ర పెండింగ్‌ అంశాలను నివేదించేందుకు ఢిల్లీ వస్తున్న రాష్ట్ర మంత్రులకు కేంద్రమంత్రులు సరైన గౌరవం ఇవ్వడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ ఇటీవల లోక్‌ సభలో మాట్లాడుతూ మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ ఉమ్మడి ఏపీ సీఎం ను అవమానించారని కాంగ్రెస్‌ పై ఆరోపణలు చేసిన రెండు రోజులు కూడా గడవకముందే.. బీజేపీకి చెందిన ఓ కేంద్రమంత్రి రాష్ట్రమంత్రికి అవమానకరంగా పార్లమెంట్‌ లాబీలో వినతిపత్రం తీసుకుని పంపించారు. పైగా ఎయిమ్స్‌ నిధుల కేటాయింపుపై సైతం 'చేద్దాం.. చూద్దాం' అన్నరీతిలో స్పందించారని తెలిసింది.
Tags:    

Similar News