రైతు ఆత్మ‌హ‌త్య‌లు : ప్ర‌తిప‌క్షాల ఘాటు కౌంట‌ర్‌

Update: 2015-09-29 07:48 GMT
తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో రైతు ఆత్మహత్యలపై చర్చ అధికార ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య ఆస‌క్తిక‌రంగా సాగుతోంది.  ముఖ్య‌మంత్రి కేసీఆర్ - వ్య‌వ‌సాయ శాఖా మంత్రుల ప్ర‌క‌ట‌న త‌ర్వాత మాట్లాడిన తెలంగాణ టీడీపీ శాస‌న‌స‌భా ప‌క్ష‌నేత ఎర్రబెల్లి దయాకర్‌ రావు మాట్లాడుతూ అధికార‌ప‌క్షంపై మండిప‌డ్డారు. ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయిన తరువాత తెలంగాణ ధనిక రాష్ట్రమే అయినా... రైతులు మాత్రం పేదవారేనని అన్నారు. కష్టాలతో కొట్టుమిట్టాడుతున్న రైతన్నలను ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పదేపదే గత ప్రభుత్వాలను విమర్శిస్తున్న మంత్రులు, టీఆర్ ఎస్ నాయ‌కులు అధికారంలోకి వచ్చాక వారు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కేంద్రానికి తెలంగాణ సర్కార్‌ నివేదికలు పంపడం లేదని ఆరోపించిన ద‌యాక‌ర‌రావు ప్రభుత్వం చొరవ చూపితే కేంద్రం నుంచి నిధులు వస్తాయని అభిప్రాయపడ్డారు.

కరువు కింద తెలంగాణ మండ‌లాల‌ను ప్రకటిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. వర్షాధార పంటలపైనే నమ్మకం పెట్టుకున్న రైతులు మూడుసార్లు విత్తనాలు వేసినా వర్షాలు లేక మొలకెత్తలేదన్నారు. రైతుల సమస్యలను పట్టించుకోకపోవడం వల్లనే ఈ రోజు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకే సారి రుణమాఫీని అమలు చేసి రైతులకు కొంత ఊరట కలిగించాలని డిమాండ్‌ చేశారు. అదే విధంగా రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న 1400 కుటుంబాలకు పరిహారం ఇవ్వాలన్నారు. ప‌రిహారంలో ష‌ర‌తులు పెట్ట‌డం స‌రికాదన్నారు. అనంత‌రం బీజేపీ శాసనసభా పక్ష నేత లక్ష్మణ్ మాట్లాడుతూ... రాష్ట్రంలో రైతులు కరువుతో అల్లాడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితి నెలకొన్నాయని తెలిపారు. రైతులకు సమైక్య ప్రభుత్వాల పాలనలో న్యాయం జరగలేదని అనేవారు తెలంగాణ‌లో ఏం చేస్తున్నార‌ని ప్ర‌శ్నించారు. రైతు ఆత్మహత్యలు రోజురోజుకూ పెరగటం బాధాకరమ‌ని, కొత్తం రాష్ట్రంలో ప్రభుత్వం రైతు సమస్యలు తీరే విధంగా పని చేయాలని సూచించారు.
Tags:    

Similar News