హిజాబ్ కు ఖురాన్ ను లింకు పెట్టేయటమా? ఇదెక్కడి సిత్రం సామి?

Update: 2022-02-18 04:35 GMT
భావోద్వేగ అంశాలు తెర మీదకు వచ్చిన వేళలో తమ వాదనలు వినిపించేందుకు కొందరు వ్యవహరించే తీరు చూస్తే.. వారి తెలివికి ముచ్చట వేయకుండా ఉండదు. కానీ.. ప్రజలకు పనికి వచ్చేలా ఉంటే బాగుండేదన్న భావన కలుగుతుంది. కర్ణాటకలో మొదలైన హిజాబ్ ఇష్యూ.. అంతకంతకూ పడుతున్న పీటముడుల పుణ్యమా అని.. దేశంలోని వివిధ రాష్ట్రాలకు ఈ ఇష్యూ విస్తరిస్తోంది. ఇప్పటికే కర్ణాటక హైకోర్టులో ఈ ఇష్యూ మీద విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఈ ఇష్యూ మొదలైన ఉడిపి కాలేజీ విద్యార్థులు తాజాగా చేసిన వ్యాఖ్యలు.. లేవనెత్తిన కొత్త వాదన విన్నంతనే ఉలిక్కిపడేలా చేయటమే కాదు.. చిరాకు ఎత్తేలా చేస్తుంది. దీనికి కారణం.. ఇష్యూను మరింత ముదిరేలా వారి మాటలు ఉండటమే. తాజాగా ఉడిపి విద్యార్థులు మాట్లాడుతూ.. హిజాబ్ ను వేసుకోకుండా నిషేధించటం ఖురాన్ ను నిషేధించటమే అంటూ కొత్త వాదనను తీసుకొచ్చారు.

ఒకవేళ అదే నిజమనుకుందాం? మరి.. పక్కనున్న అఫ్గానిస్థాన్ లో ఉన్నది మొత్తం (దాదాపుగా) ముస్లింలే. మరి.. ఆ ముస్లింలు అంతా.. మాకు హిజాబ్ వద్దు మొర్రో అని ఎలుగెత్తటమే కాదు.. నిరసనలు నిర్వహిస్తున్నారు. ఆందోళనల్ని చేపట్టటం తెలిసిందే. పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న వారిని అక్కడి తాలిబన్ ప్రభుత్వం కఠినంగా అణిచివేస్తోంది. హిజాబ్ ను ధరించకుండా ఉంటే కఠిన శిక్షలు విధించటానికి సిద్ధమవుతుంది. తాలిబన్ సర్కారు తీరుపై తీవ్ర మండిపాటు ప్రపంచ వ్యాప్తంగా వెల్లువెత్తటం తెలిసిందే.

ఒకవైపు అఫ్గాన్ ముస్లింలు హిజాబ్ మాకొద్దు బాబోయో అంటూ నెత్తినోరు కొట్టుకుంటుంటే.. మరోవైపు ఉడికి చెందిన ముస్లిం విద్యార్థులు హిజాబ్ కావాలని.. ఒకవేళ దాన్ని బ్యాన్ చేస్తే.. ఖురాన్ ను బ్యాన్ చేసినట్లుగా పిడివాదనను వినిపించటం దేనికి సంకేతం?

ఉడిపి విద్యార్థుల లెక్క ప్రకారం అఫ్గాన్ లోని ముస్లింలు హిజాబ్ వద్దంటున్నప్పుడు.. వారు ఖురాన్ ను కూడా వద్దనుకుంటున్నట్లుగా చెబితే ఎంత ఛండాలంగా ఉంటుంది? ఒకవైపు ప్రపంచం పరిమితుల్ని దాటి ముందుకు వెళ్లాలని భావిస్తుంటే.. అందుకు భిన్నంగా మన ప్రజల్లోని కొందరు పరిమితులు తమకు తప్పనిసరిగా కావాలంటున్న వైనం చూసినప్పుడు.. ఉడిపి ముస్లిం విద్యార్థుల వాదన దేనికి సంకేతం? అన్న సందేహం కలుగక మానదు.

తాజాగా హిజాబ్ ఇష్యూ మీద కర్ణాటక హైకోర్టులో వాదనలు జరుగుతున్న వేళ.. ఆరుగురు కాలేజీ విద్యార్థుల తరఫున వాదనలు వినిపిస్తున్న లాయర్ వినోద్ కులకర్ణి.. హిజాబ్  ధారణపై ఆంక్షల కారణంగా పేద ముస్లింలు బాలికలు బాధ పడుతున్నారని.. వారి మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతోందన్నారు. అందుకే కనీసం ముస్లింలకు జుమ్మా దినమైన శుక్రవారం నాడు.. పవిత్ర రంజాన్ నెలలో అది ధరించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరటం గమనార్హం. ఇదంతా చూసినప్పుడు.. ఇవేం బేరాలు సామీ అనకుండా ఉండలేం.


Tags:    

Similar News