హిజాబ్ ఇష్యూ వేళ మన దగ్గర ఇలా.. ఇప్పుడు ఆఫ్గాన్ లో అలా

Update: 2022-02-17 05:34 GMT
అందరూ ఒకేలా ఉండేందుకు.. యూనిఫారం ధరించాలే తప్పించి.. విద్యాసంస్థకువచ్చే వారు హిజాబ్ ధరించకూడదంటూ కర్ణాటకకు చెందిన ఒక విద్యా సంస్థ తీసుకున్న నిర్ణయం ఆ ప్రాంతంలోనే కాక.. దేశంలోని వివిధ ప్రాంతాలకు ఈ ఇష్యూ పాకటం ఒక ఎత్తు అయితే.. డిజిటల్ ప్రపంచంలో హిజాబ్ ధరించాలన్న వాదనకు వామపక్షవాదులు.. సూడో లౌకిక వాదులు వినిపిస్తున్న వాదనలు.. స్వేచ్ఛ.. సమానత్వం పేరుతో మరింత మౌఢంలోకి దించుతున్నారన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.

ఒకపక్క హిజాబ్ కోసం గళం ఎత్తుతున్న వారు.. అసలు తమకేం కావాలన్న దానిపై సరిగా ఆలోచిస్తున్నారా? అన్నది ప్రశ్నగా మారుతోంది. ఎందుకిలా అంటే.. హిజాబ్ కోసం గళం విప్పిన కొందరు విద్యార్థులకు మద్దతుగా కర్ణాటకలోని పలు విద్యాసంస్థల్లో పని చేసే టీచర్లు హిజాబ్ ధరిస్తూ విద్యా సంస్థలకు రావటం ఈ ఉదంతం మరో మలుపు తిరిగేలా మారింది. ఆధునిక ప్రపంచంలో హిజాబ్ నిర్భందం నుంచి తమను విముక్తి చేయాలని కోరుతూ మనకు ఇరుగున ఉన్న ఆఫ్గాన్ మహిళలు ఉద్యమించటం తెలిసిందే. తప్పనిసరిగా హిజాబ్ ధరించాలన్న నిబంధనను కఠినంగా అమలు చేయటంపై ఆఫ్గాన్ మహిళలు తీవ్ర ఆక్రోశాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఆఫ్గాన్ అసలు సిసలు ముస్లిం దేశం. ఆ విషయంలో మరో మాట లేదు. కానీ.. అక్కడి మహిళలు మాత్రం హిజాబ్ వద్దని కోరుతుంటే.. తాజాగా అధికారంలోకి వచ్చిన తాలిబన్ల అతి ఎంతలా మారిందనటానికి చిన్న ఉదాహరణ.. షాపుల్లో అమ్మే అమ్మాయిల బొమ్మల తలల్ని కట్ చేస్తున్నారు. కారణం.. ఆ బొమ్మల ముఖాలకు పరదా లేకపోవటమే కారణమని తాలిబన్లు స్పష్టం చేస్తున్నారు.

 తాలిబన్లు కఠినంగా అమలు చేస్తున్న డ్రెస్ కోడ్ మీద ఆఫ్గాన్ మహిళలు తీవ్ర నిరసన తెలుపుతున్నారు. టీవీ కార్యక్రమాల్లో మహిళలు కనిపించకూడదని.. టీవీ చానళ్లలో మహిళా రిపోర్టర్లు.. కెమేరా ముందుకు వచ్చేటప్పుడు తప్పనిసరిగా బురఖా ధరించాలని ఆదేశాలు జారీ చేశారు.

ఇక.. మహిళలు ఆటలు ఆడాల్సిన అవసరం లేదన్న మాటతో పాటు ముఖానికి బురఖాతో పాటు.. చేతులకు తొడుగులు ధరించాలని స్పష్టం చేస్తున్నారు. గతంలో ఆ దేశంలో మహిళా వ్యవహారాల్ని చూసేందుకు ఉన్న మహిళా మంత్రిత్వ శాఖను సైతం తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మహిళలు బయటకు వస్తే తప్పనిసరిగా పురుష బంధువులు వెంట ఉండాలన్న నిబంధనతో పాటు.. హిజాబ్ ధరించని వారిని ట్యాక్సీల్లో ఎక్కించుకుంటే కఠిన శిక్షలు తప్పవన్న వార్నింగ్ లు డ్రైవర్లకు జారీ అయ్యాయి.

ఇక.. వర్సిటీల్లో స్త్రీలు.. పురుషులకు కలిపి పాఠాలు బోధించటానికి తాలిబన్లు అనుమతించడం లేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళలకు అవకాశం ఇవ్వట్లేదు. ఇలా..అక్కడి మహిళల్ని అడుగడుగునా అడ్డుకుంటున్న తాలిబన్ల తీరుతో విసిగిపోయిన ఆఫ్గాన్ మహిళలు.. తమ స్వేచ్ఛ కోసం పరదా చాటు నుంచి బయటకు వచ్చేందుకు తహతహలాడుతున్నారు. మరోవైపు సంప్రదాయం పేరుతో హిజాబ్ ధరిస్తామని మన దగ్గర వినిపిస్తున్న డిమాండ్ చూస్తే.. లోకానికి విరుద్ధంగా జరుగుతున్న పరిణామాలేమిటన్న సందేహం కలగక మానదు.
Tags:    

Similar News