సెల్ఫీ పంపితేనే.. డాక్ట‌ర్ల‌కు శాల‌రీ?

Update: 2022-03-19 09:30 GMT
ప్ర‌భుత్వ వైద్యులు స‌ర్కారు ద‌వాఖాన‌ల్లో ఓ గంట సేపు ప‌ని చేసి.. త‌మ ప్రైవేటు క్లినిక్‌లో రోజంతా డ్యూటీ చేసేందుకు వెళ్తార‌నే సంగ‌తి ఎవ‌రిని అడిగినా చెప్పేస్తారు. ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో రోగులు ఆరోగ్యాని కంటే కూడా త‌మ ప్రైవేటు హాస్పిట‌ల్స్‌లో ఆదాయంపైనే వాళ్ల‌కు ఎక్కువ ఆస‌క్తి ఉంటుంద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇప్పుడు ఏపీలో ప్ర‌భుత్వ డాక్ట‌ర్ల ప్రైవేటు ప‌నిని క‌ట్ట‌డి చేసేందుకు ప్ర‌భుత్వం ఓ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌భుత్వ ఆసుపత్రుల్లో ప‌నిచేసే డాక్ట‌ర్లు విధుల‌కు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ప్ర‌తి రెండు గంట‌ల‌కోసారి సెల్ఫీ తీసి పంపాల‌ని.. వాటి ఆధారంగానే జీతాలిస్తామ‌ని ప్ర‌క‌టించింది. ఆసుప‌త్రి చ‌క్క‌గా క‌నిపించేలా ఆ సెల్ఫీలు పంపాల‌ని సూచించింది. లేదంటే ఆ రోజు ఆబ్సెంట్‌గా ప‌రిగ‌ణిస్తామ‌ని హెచ్చ‌రించింది. దీంతో ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో ప‌ని నుంచి త‌ప్పించుకుని త‌మ ప్రైవేటు క్లినిక్‌ల‌కు వాళ్లు వెళ్లే అవ‌కాశం ఉండ‌ద‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది.

ఈ సెల్ఫీ అటెండెన్స్ విధానాన్ని ఏప్రిల్ 1 నుంచి అమ‌లు చేసేందుకు ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. పీహెచ్‌సీలో ప‌నిచేసే ఏ డాక్ట‌రైనా త‌మ సెల్ఫీల‌ను సూచించిన వెబ్‌సైట్లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్ర‌తి రెండు గంట‌ల‌కోసారి అంటే ఉద‌యం 9 గంట‌ల‌కు, 11 గంట‌ల‌కు, మ‌ధ్యాహ్నం 1 గంట‌ల‌కు, 3 గంట‌ల‌కు, సాయంత్రం 4 గంట‌ల‌కు సెల్ఫీలు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. వైద్య శాఖ‌కు చెందిన ఉన్న‌తాధికారుల స‌మావేశంలో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ సెల్ఫీల సంఖ్య ఆధారంగానే వైద్యుల‌కు జీతాలు చెల్లిస్తారు.

నిర్దేశించిన సంఖ్య‌కు త‌గ్గ‌ట్లుగా సెల్ఫీలు ఉంటే పూర్తి జీతం ఇస్తారు. లేదంటే కోత పెడ‌తారు. అయితే దీనిపై మ‌హిళా డాక్ట‌ర్ల నుంచి వ్య‌తిరేక‌త వ‌స్తోంది. ఇలా పంపించే త‌మ ఫోటోల‌ను మార్ఫ్ చేసే ప్ర‌మాదం ఉంద‌ని వాళ్లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే ప్ర‌భుత్వ డ్యూటీలు వ‌దిలేసి ప్రైవేటుగా ప్రాక్టీస్ చేసుకుంటున్న వాళ్ల జాబితా ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర ఉంద‌ని వాళ్ల‌పై చ‌ర్య‌లు తీసుకుంటే  స‌రిపోతుంద‌ని చెబుతున్నారు.

మొత్తం మీద 10 శాతం ప్ర‌భుత్వ వైద్యులే అలా చేస్తున్నార‌ని గ‌ణాంకాలు స్ప‌ష్టం చేస్తున్నాయి. గ‌త ఏడాదిన్న‌ర‌గా వాళ్ల‌ను అడ్డుకునేందుకు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటోంది. వాళ్ల‌పై తీవ్ర‌మైన చ‌ర్య‌లు తీసుకుందామంటేనేమో ప్ర‌భుత్వ ఉద్యోగానికి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకునే ప్ర‌మాదం ఉంద‌ని ప్ర‌భుత్వం వెన‌క‌డుగు వేస్తోంది.  అయితే ఒకే ప్రాంతంలో అయిదేళ్లు స‌ర్వీస్ పూర్తి చేసుకున్న ప్ర‌భుత్వ వైద్యుల‌ను బ‌దిలీ చేయాల‌ని అనుకుంది. కానీ ఒకేసారి ఇలా వైద్యులంద‌రినీ బ‌దిలీ చేస్తే ఇబ్బంది త‌లెత్తే అవ‌కాశం ఉంది. అందుకే 30 శాతం మందిని మాత్ర‌మే బ‌దిలీ చేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. ఇప్పుడేమో  సెల్ఫీ అటెండెన్స్ విధానాన్ని తీసుకు రానుంది. గంట‌కో సారి సెల్ఫీ తీసి అప్‌లోడ్ చేయాల‌ని ఆదేశాలు జారీ చేసేందుకు మొదట నిర్ణ‌యం తీసుకున్న‌ప్ప‌టికీ దాన్ని రెండు గంట‌ల‌కోసారి పంపేలా మార్చారు
Tags:    

Similar News