పాపం జనసేన

Update: 2022-04-12 04:35 GMT
జనసేన నాయకులు చాలా ఆశలే పెట్టుకుని ఉన్నట్లున్నారు. జగన్మోహన్ రెడ్డి కొత్త మంత్రివర్గ పునర్ వ్యవస్ధీకరణ కారణంగా 50 మంది వైసీపీ ఎంఎల్ఏలు రాజీనామాలు చేయటానికి సిద్ధంగా ఉన్నట్లు పార్టీ అధికార ప్రతినిధి పోతిన మహేష్ చెప్పారు. రాజీనామాలు చేయబోతున్న ఎంఎల్ఏలంతా వేర్వేరు పార్టీల్లో చేరడానికి సిద్దంగా ఉన్నట్లు చెప్పారు. అంటే పోతిన ఉద్దేశ్యం ప్రకారం రాజీనామాలు చేయబోతున్న ఎంఎల్ఏల్లో కొందరు జనసేనలో చేరకపోతారా ? అని ఆశిస్తున్నట్లుంది.

 ఇక్కడే పోతిన వ్యాఖ్యలను చూసిన తర్వాత పాపం జనసేన అని అనిపిస్తోంది. ఇతర పార్టీల నుండి వచ్చే నేతలను చేర్చుకుని బలోపేతం అవ్వాలనే తప్ప సొంతంగా బలోపేతమయ్యేంత సీన్ లేదని అర్ధమైపోయినట్లుంది. మంత్రివర్గ పునర్ వ్యవస్ధీకరణ లేదా విస్తరణ ఎవరు చేసినా ఎంతో కొంత అసంతృప్తి సహజం. అలాగే ఇపుడు జగన్ క్యాబినెట్-2 సందర్భంగా కూడా మాజీమంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, మేకతోటి సుచరితలో అసంతృప్తి ఉన్నది నిజం.

 అంతమాత్రాన పార్టీకి, ఎంఎల్ఏ పదవికి రాజీనామాలు చేసి బయటకు వెళ్ళిపోయేంత సీన్ వాళ్ళకు లేదు. ఎందుకంటే జగన్ను కాదని బయటకు వెళితే వాళ్ళ భవిష్యత్తు ఏమిటో వాళ్ళకి బాగా తెలుసు.

అందుకనే బాలినేని లాంటివాళ్ళు జగన్ కు సరెండర్ అయిపోయారు. ఇద్దరు ముగ్గురు ఎంఎల్ఏలు అసంతృప్తి వ్యక్తం చేయగానే ఏకంగా 50 మంది ఎంఎల్ఏలు రాజీనామాలు చేసి పార్టీ నుండి బయటకు వచ్చేయటానికి సిద్దంగా ఉన్నారని పోతిన చెప్పటమే హాస్యాస్పదం.

ఇంకా విచిత్రం ఏమిటంటే జగన్ కు దమ్ముంటే ఎంఎల్ఏలు రాజీనామాలను వెంటనే ఆమోదించాలని సవాలు విసరటం. నిజానికి పోతిన తన స్థాయికి మించే మాట్లాడారు. ఇక్కడ వాస్తవం ఏమిటంటే ఎంఎల్ఏలు రాజీనామాలు చేసేది లేదు ఆమోదించే ప్రసక్తే రాదు.

ఇంతోటి దానికి జనసేన నేతలు ఏవేవో ఊహించుకుని ఆశల్లో తేలిపోతున్నట్లుంది. వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా టీడీపీలోకి ఫిరాయించిన 23 మంది ఎంఎల్ఏలు, ముగ్గురు ఎంపీల పరిస్థితి తర్వాత ఏమైందో చూసిన తర్వాత కూడా తమ పదవులకు రాజీనామాలు చేసేంత ధైర్యం చేస్తారా ఎంఎల్ఏలు.
Tags:    

Similar News