ఎల్ఐసీ ఐపీఓ ఎందుకు బ్రేక్ అయిందో తెలుసా?

Update: 2022-03-05 09:42 GMT
దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా ఎల్ఐసీ ప‌బ్లిక్ ఇష్యూ ఈ మార్చిలో మార్కెట్‌లోకి రానున్న‌ట్లు గ‌త నెల‌రోజులుగా వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే.

ప్ర‌భుత్వ వాటా 5 శాతం లేదా 31.6 కోట్ల షేర్ల‌తో మెగా ఐపీఓ ద‌లాల్ స్ట్రీట్‌లో దుమ్ములేపనుంద‌న్న అంచ‌నాల‌తో ఇన్వెస్ట‌ర్లు సైతం ఆస‌క్తిని చూపించారు. అయితే, ఈ ఐపీఓకు బ్రేక్ ప‌డింది. ర‌ష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేప‌థ్యంలో ఇన్వెస్ట‌ర్ల ప్ర‌యోజనాల‌ను దృష్టిలో పెట్టుకుని ఎల్ఐసీ ఐపీవోపై నిర్ణ‌యం తీసుకుంటామ‌ని కేంద్రం తెలిపింది.

ఎల్ఐసీకి సంబంధించి ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రంలో పెట్టుబ‌డుల ఉప‌సంహ‌ర‌ణ ద్వారా రూ.78 వేల కోట్ల నిధులు సేక‌రించాల‌ని కేంద్రం ల‌క్ష్యంగా పెట్టుకుంది. అందుకోసం ఎల్ఐసీ ఐపీవో ద్వారా రూ.60 వేల కోట్ల పై చిలుకు నిధులు స‌మ‌కూర్చుకోవాల‌ని భావిస్తోంది. అయితే, ఉక్రెయిన్‌-ర‌ష్యా యుద్ధంతో మార్కెట్‌లో అనిశ్చితి నెల‌కొన్న నేప‌థ్యంలో కేంద్రం సంయ‌మ‌నం పాటిస్తోంది. మార్కెట్లో ఒడిదొడుకుల‌ను సునిశితంగా ప‌రిశీలిస్తున్న‌ట్లు దీపం కార్య‌ద‌ర్శి తుహిన్ కాంతా పాండే చెప్పారు.

ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రంలోనే ఎల్ఐసీ ఐపీవోకు వెళ్లాల‌ని కేంద్రం ఆస‌క్తితో ఉంద‌ని, అయితే, ఎల్ఐసీ ఐపీవోకు వెళ్లే తేదీపై పున‌రాలోచిస్తామ‌న్నారు. ఎక‌న‌మిక్స్ ఆఫ్ కాంపిటీష‌న్ లా-2022 ఏడో జాతీయ స‌ద‌స్సులో పాల్గొన్న తుహిన్ కాంతా పాండే ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ, ప్ర‌స్తుతానికి అనూహ్య ప‌రిణామాలు చోటు చేసుకున్నాయని, ఐపీవో, ఇన్వెస్ట‌ర్ల ప్ర‌యోజ‌నాల‌ను బ‌ట్టి ప్ర‌భుత్వం తుది నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని తెలిపారు. నిపుణుల సూచ‌న‌ల మేర‌కు నిర్ణ‌యం తీసుకుంటామ‌న్నారు.



ఇదిలాఉండ‌గా, ఉక్రెయిన్‌పై ర‌ష్యా దండ‌యాత్ర నేప‌థ్యంలో ఎల్ఐసీ ఎప్పుడు ఐపీవోకు వెళ్లాల‌న్న విష‌య‌మై ప్ర‌భుత్వం దృష్టి సారిస్తుంద‌ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ఓ ఆంగ్ల‌దిన‌ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో చెప్పారు. `వాస్త‌వంగా జాతీయ ప‌రిస్థితుల‌ను బ‌ట్టే ఎల్ఐసీ ఐపీవో టైం ఖ‌రారు చేశాం, కానీ అంత‌ర్జాతీయ ప‌రిణామాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే మ‌రోసారి దృష్టి సారించాల్సిన అవ‌స‌రం ఉంది` అని అన్నారు.  

ఎల్ఐసీ ఐపీవో జాప్యం అయితే, ప్ర‌భుత్వ పెట్టుబ‌డుల ఉప‌సంహ‌ర‌ణ ల‌క్ష్యాల‌ను చేరుకోలేరు క‌దా? అన్న ప్ర‌శ్న‌పై నిర్మ‌లా సీతారామ‌న్ స్పందిస్తూ తాను యావ‌త్ ప్ర‌పంచానికి వివ‌రించాల్సి ఉంటుంద‌న్నారు. రూ.5.4 ల‌క్ష‌ల కోట్ల విలువైన ఎల్ఐసీలో ఐపీవో ద్వారా 10.4 బిలియ‌న్ డాల‌ర్ల విలువైన వాటాల విక్ర‌యానికి కేంద్రం సిద్ధ‌మైంది. బ‌డ్జెట్‌లో ద్ర‌వ్య‌లోటు స‌మ‌స్య ప‌రిష్కారానికి ఎల్ఐసీ ఐపీవో కీల‌కం కానుంది. గ‌త నెల 13న ఐపీవోకు అనుమ‌తించాల‌ని సెబీకి ఎల్ఐసీ ద‌ర‌ఖాస్తు చేసింది.
Tags:    

Similar News