ఆ గ్యాంగ్ స్ట‌ర్ స‌ల్మాన్‌ కే వార్నింగ్ ఇచ్చాడు

Update: 2018-06-09 11:12 GMT
రెండు రోజుల క్రితం హ‌ర్యానాకు చెందిన ఒక పెద్ద గ్యాంగ‌స్ట‌ర్ ను మ‌న పోలీసులు వ‌ల వేసి మ‌రీ అరెస్ట్ చేశారు. మియాపూర్ లో ర‌ద్దీగా ఉండే ప్రాంతంలో ఉన్న గోకుల్ ఫ్లాట్స్ లో హ‌ర్యానాలో మోస్ట్ వాంటెడ్ క్రిమిన‌ల్ గా ఉన్న సంప‌త్ నెహ్రాకు వ‌ల వేసి మ‌రీ ప‌ట్టేసుకున్నారు. అత‌గాడిని ప‌ట్టుకొన్న‌త‌ర్వాత అత‌డికి సంబంధించిన ప‌లు ఆస‌క్తిక‌ర అంశాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి.

పెద్ద గ్యాంగ‌స్ట‌ర్ అయి ఉండి కూడా.. చాలా సింఫుల్ గా ఎవ‌రికి అనుమానం రాకుండా తెలిసిన వారికి సంబంధించిన కుర్రాళ్ల‌తో ఉంటూ.. షెల్ట‌ర్ తీసుకున్నారు.  అయితే..అత‌ని గురించి ఆరా తీస్తున్న హ‌ర్యానా పోలీసులు హైద‌రాబాద్ పోలీసుల్ని సాయం కోర‌టం.. ఎస్ వోటీ పోలీసులు రంగంలోకి దిగి.. అత‌గాడి ఆచూకీని క‌నుగొన్నారు. హ‌ర్యానాతో స‌హా మొత్తం నాలుగు రాష్ట్రాల్లో ఇత‌గాడి నెట్ వ‌ర్క్ ఉంద‌ని.. ఇత‌ని కింద పెద్ద బ్యాచే ప‌ని చేస్తున్న‌ట్లుగా గుర్తించారు.

అత్యాధునిక సాంకేతిక‌త‌ను వినియోగిస్తూ.. సంప‌త్ ను ట్రేస్ అవుట్ చేసిన‌ట్లుగా తెలుస్తోంది. ప‌లు హ‌త్య కేసుల్లో నిందితుడిగా ఉన్న సంప‌త్‌.. డ‌బ్బులు వ‌సూలు చేసేందుకు సామాన్య‌లు మొద‌లుకొని సెల‌బ్రిటీలు.. ప్ర‌ముఖుల వ‌ర‌కూ వార్నింగ్ ఇచ్చేందుకు అస్స‌లు వెన‌కాడేవాడు కాదు.

అత‌న్ని అరెస్ట్ చేసిన పోలీసులు.. అత‌గాడి నేర‌చ‌రిత‌పై ఆరా తీస్తున్న క్ర‌మంలో ఆస‌క్తిక‌ర అంశం ఒక‌టి వెలుగులోకి వ‌చ్చింది. గ‌తంలో బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ ను సైతం ఇత‌ని బాధితుడన్న విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. కృష్ణ జింక‌ల్ని వేటాడి చంపిన కేసులో నిందితుడిగా ఉన్న స‌ల్మాన్ ను ప‌లు సంద‌ర్భాల్లో సంప‌త్ బెదిరించిన‌ట్లుగా తెలిసింది.

కృష్ణ జింక‌ల కేసు విచార‌ణ‌కు కోర్టు వ‌చ్చే స‌మ‌యంలో తాను చంపుతాన‌ని బెదిరించాడ‌ని.. అలా కాకుండా ఉండాలంటే భారీ మొత్తాన్ని డిమాండ్ చేసిన వైనాన్ని గుర్తించారు. సోష‌ల్ మీడియాను ఆధారంగా చేసుకొని ఇత‌గాడి బెదిరింపుల ప‌ర్వం సాగేద‌ని చెబుతున్నారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే గ్యాంగ్ స్ట‌ర్ సంప‌త్ తండ్రి రామ్ చంద్ర పోలీసు అధికారి కావ‌టం. ఆయ‌న చండీగ‌ఢ్ పోలీసు విభాగంలో అసిస్టెంట్ స‌బ్ ఇన్ స్పెక్ట‌ర్ గా ప‌ని చేసి రిటైర్ అయ్యారు.

పంజాబ్ యూనివ‌ర్సిటీ ప‌రిధిలో చ‌దివిన ఇత‌గాడు.. యూత్ గా ఉన్న‌ప్పుడు విద్యార్థి సంఘ నాయ‌కుడిగా వ్య‌వ‌హ‌రించేవాడు. తుపాకీలంటే చాలా ఎక్కువ ఇష్టంగా చెబుతారు. సంప‌త్ ను గుర్తించేందుకు అత‌నికి స‌న్నిహితంగా ఉన్న అనుచ‌రుల‌తో పాటు.. అత‌డి గ‌ర్ల్ ఫ్రెండ్ హిసార్ ఫోన్ ఆధారంగా సంప‌త్ ఆచూకీని గుర్తించిన‌ట్లుగా చెబుతున్నారు. ఆస‌క్తిక‌ర‌మైన మ‌రో అంశం ఏమిటంటే.. గోకుల్ ఫ్లాట్స్ లో షెల్ట‌ర్ తీసుకున్న అత‌గాడు అస్స‌లు బ‌య‌ట‌కు వ‌చ్చేవాడే కాదు. కానీ.. ఒక‌సారి కొబ్బ‌రి బొండాం నీళ్లు తాగేందుకు బ‌య‌ట‌కు వ‌చ్చిన వేళ‌.. అత‌డ్ని పోలీసులు గుర్తించ‌టం.. ఆ త‌ర్వాత వ్యూహాత్మ‌కంగా ఈవినింగ్ వాక్ కు గోకుల్ ఫ్లాట్స్ కింద‌కు వ‌చ్చిన‌ప్పుడు అరెస్ట్ చేశారు. ఇంత పెద్ద గ్యాంగ్ స్ట‌ర్ అయి ఉండి సాదాసీదాగా గోకుల్ ఫ్లాట్స్ లో షెల్ట‌ర్ తీసుకోవ‌టం సంచ‌ల‌నంగా మారింది.
Tags:    

Similar News