ఎల్ ఐసీ ఆర్థికంగా దృఢంగా ఉంది

Update: 2020-03-04 00:30 GMT
భారత జీవిత బీమా సంస్థ (ఎల్‌ ఐసీ) ఆర్థిక పరిస్థితిపై సోషల్‌ మీడియాలో వస్తున్న వదంతులను ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ థాకూర్‌ కొట్టివేశారు. ఎల్‌ఐసీ ఆర్థికంగా దృఢంగా ఉందని మంగళవారం ఆయన రాజ్యసభలో ప్రకటించారు.  ఎల్‌ ఐసీ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతున్న వదంతులు ప్రభుత్వం దృష్టికి వచ్చాయని వైఎస్సార్సీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ మంత్రి తెలిపారు.

ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ - డెవలప్‌ మెంట్‌ అథారిటీ నిర్దేశించిన సాల్వెన్సీ మార్జిన్‌ (1.50) కంటే ఎల్‌ ఐసీ సాల్వెన్సీ మార్జిన్‌ (1.60) అధికంగా ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. అలాగే పాలసీల సంఖ్య, మొదటి ఏట ప్రీమియం చెల్లింపుల్లో అత్యధిక మార్కెట్‌ షేర్‌ కూడా ఎల్‌ ఐసీదేనని ఆయన వివరించారు.

ఈ ఏడాది జనవరి 31 నాటికి దేశవ్యాప్తంగా ఎల్‌ ఐసీతో సహా 24 బీమా సంస్థలు విక్రయించిన పాలసీలలో 77.61 శాతం ఒక్క ఎల్‌ ఐసీనే విక్రయించింది. మొదటి ఏట పాలసీ చెల్లింపులలో 70.02 శాతం మార్కెట్‌ షేర్‌ ఎల్‌ ఐసీదే అని మంత్రి చెప్పారు. ఎల్‌ ఐసీ క్రమం తప్పకుండా ప్రభుత్వానికి డివిడెంట్‌ చెల్లిస్తూ వస్తోంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 2,610.74 కోట్ల రూపాయలను ఎల్‌ఐసీ డివిడెండ్‌ కింద ప్రభుత్వానికి చెల్లించినట్లు మంత్రి తెలిపారు.
Tags:    

Similar News