‘జైభీమ్’ గుర్తుకు వచ్చేలా మరియమ్మ లాకప్ డెత్

Update: 2021-11-11 04:30 GMT
ఈ మధ్యనే విడుదలై.. అందరూ చర్చించుకుంటున్న సినిమా సూర్య నటించిన ‘జైభీమ్’. తప్పుడు కేసు పెట్టి దారుణంగా హింసించి ప్రాణాలు తీసిన రియల్ కథను మూవీగా తీయటం.. ఈ చిత్రం అన్ని వర్గాల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. కొన్నేళ్ల క్రితం జరిగిన ఈ చిత్ర కథ లాంటి పరిస్థితే ఇప్పటికి ఉంది. తెలంగాణలో మరియమ్మ లాకప్ డెత్ ఉదంతాన్ని చూస్తే.. జైభీమ్ మూవీ గుర్తుకు రాక మానదు. సంచలనంగా మారిన మరియమ్మ లాకప్ డెత్ కేసు విచారణ తాజాగా తెలంగాణ హైకోర్టులో జరిగింది.

మరియమ్మ లాకప్ డెత్ కేసును సీబీఐకు అప్పగించదగినదిగా హైకోర్టు అభిప్రాయపడటమే కాదు.. ఈ నెల 22న విచారణకు హాజరు కావాలంటూ సీబీఐ ఎస్పీకి నోటీసులు జారీ చేసింది. అంతేకాు.. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాల్ని అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ కు అప్పగించాలని ఆదేశించింది. విచారణ వేళ హైకోర్టు సంధించిన ప్రశ్నలు ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చేశాయి.

మరియమ్మ లాకప్ డెత్ కు కారణమైన పోలీసులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ఏజీని ప్రశ్నించగా.. ఎస్ఐ.. కానిస్టేబుల్ ను ఉద్యోగాల నుంచి తొలగించినట్లుగా పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్ 17న యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీసులు దొంగతనం ఆరోపణపై మరియమ్మ.. ఆమె కొడుకు ఉదయ్ కిరణ్.. అతని స్నేహితుడు వేముల శంకర్ లను విచారణ పేరుతో గ్రామం నుంచి తీసుకెళ్లారు.

పోలీస్ స్టేషన్ లో దారుణంగా కొట్టటంతో మరియమ్మ మరణించటం.. అప్పట్లో పెను సంచలనంగా మారింది. ఆమె మరణంపై న్యాయ విచారణ చేపట్టాలని పౌరహక్కుల సంఘం హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యాన్ని దాఖలు చేసింది. దీంతో.. ఈ ఉదంతంపై న్యాయ విచారణ అందజేయాలని ఆలేరు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

దీంతో.. అప్పటికే అంత్యక్రియలు పూర్తి చేసిన మరియమ్మ మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహించారు. దీనికి సంబంధించిన నివేదిక తాజాగా వెలుగు చూసింది. హైకోర్టు విచారణ సందర్భంగా ఏజీ తన వాదనలు వినిపిస్తూ.. మరియమ్మ కుటుంబానికి పరిహారం చెల్లించామని చెప్పారు. దీనికి స్పందించిన హైకోర్టు పరిహారం ప్రాణాల్ని తిరిగి తీసుకురాలేదని పేర్కొంది. దీనికి ఏజీ స్పందిస్తూ.. మరియమ్మకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని.. అందుకే గుండె ఆగి చనిపోయినట్లుగా పేర్కొన్నారు.

దీనిపై హైకోర్టు తీవ్రంగా స్పందిస్తూ.. రెండోసారి జరిపిన పోస్టుమార్టం నివేదికలో మరియమ్మ గుండెపై గాయాలు ఉన్నట్లుగా ఉందని.. గుండెలు ఆగేలా ఎవరైనా కొడతారా? అంటూ తీవ్రంగా ప్రశ్నించింది. తాజా పోస్టుమార్టం నివేదికను చూస్తే.. లాకప్ లో మరియమ్మను ఎంత దారుణంగా హింసించారన్న విషయం ఇట్టే అర్థమయ్యే పరిస్థితి. ఇదంతా చూసినప్పుడు ఎప్పుడో జరిగిన జైభీమ్ చిత్ర కథ గురించి చర్చించుకుంటున్న సమాజం.. ఇప్పటికి తమ చుట్టూ అలాంటి పరిస్థితులే నెలకొన్నాయన్న విషయం మరియమ్మ ఉదంతం స్పష్టం చేస్తుందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News