రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో ద్రౌప‌దికే మాయావ‌తి మ‌ద్ద‌తు

Update: 2022-06-25 07:41 GMT
జూలై 18న జ‌ర‌గ‌నున్న రాష్ట్రపతి ఎన్నికల్లో బ‌హుజ‌న స‌మాజ్ పార్టీ (బీఎస్పీ) మ‌ద్ద‌తు ఎన్డీయే అభ్యర్థి ద్రౌపదీ ముర్ముకేన‌ని ఆ పార్టీ అధినేత్రి మాయావ‌తి ప్ర‌క‌టించారు. ఈ మేరకు తమ నిర్ణయాన్ని మాయావతి జూన్ 25న‌ వెల్లడించారు. కాగా ప్ర‌తిప‌క్ష పార్టీల్లో ఎన్డీయే అభ్య‌ర్థికి మ‌ద్ద‌తు తెలిపిన తొలి పార్టీ బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీయే కావ‌డం గ‌మ‌నార్హం.

బీఎస్పీ మొద‌టి నుంచి బ‌డుగు, బ‌ల‌హీన‌వ‌ర్గాలకు అండ‌గా ఉంటుంద‌ని మాయావ‌తి గుర్తు చేశారు. ఈ నేప‌థ్యంలోనే గిరిజ‌న అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముకు త‌మ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించామ‌ని తెలిపారు. ఈ నిర్ణ‌యాన్ని బీజేపీకి మ‌ద్ద‌తుగానో, ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు వ్య‌తిరేకంగానో చూడాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. తమ పార్టీ సిద్ధాంతాలను, తమ ఉద్యమాన్ని దృష్టిలో ఉంచుకునే గిరిజన తెగకు చెందిన అభ్యర్థికి మద్దతివ్వాలని నిర్ణయించామని మాయావ‌తి తెలిపారు.

రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసే సమయంలో ప్రతిపక్ష కూటమి తమను సంప్రదించలేదని మాయావతి ఆక్షేపించారు. దీనిపై అసహనం వ్యక్తం ఆమె అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కొన్ని ఎంపిక చేసుకున్న పార్టీలనే రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ఎంపిక సంద‌ర్భంగా పిలిచారని అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. చివ‌ర‌కు ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ కూడా అభ్యర్థి ఎంపికపై తమను చ‌ర్చించ‌లేద‌ని మాయావ‌తి చెబుతున్నారు.

దళితుల చేతుల్లో నాయకత్వం ఉన్న ఏకైక జాతీయ పార్టీ.. బహుజ‌న్ స‌మాజ‌న్ పార్టీయేన‌ని మాయావ‌తి ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. బీజేపీని, కాంగ్రెస్ పార్టీల‌ను తాము అనుస‌రించే వాళ్లం కాద‌ని మాయావ‌తి తెలిపారు. పారిశ్రామికవేత్తలకు కూడా తామెప్పుడూ అండ‌గా నిల‌వ‌లేద‌ని చెప్పారు.

ఇప్ప‌టిదాకా అణగారిన వర్గాలకు మేలు చేసే నిర్ణయాలే బీఎస్పీ తీసుకుంద‌న్నారు. బ‌డుగు, బ‌ల‌హీన‌వ‌ర్గాల‌కు మేలు చేసే నిర్ణ‌యాలు తీసుకున్న పార్టీల‌కు త‌మ మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తామ‌న్నారు.

కాగా బీఎస్పీ కూడాద్రౌపదీ ముర్ముకు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌డంతో ఆమెకు 60 శాతానికిపైగా ఓట్లు వస్తాయని బీజేపీ అంచ‌నా వేస్తోంది. ఎన్డీయే మిత్రపక్షాలతోపాటు బయటినుంచి బీజేడీ, వైఎస్సార్సీపీ, ఇతర పార్టీలూ మద్దతిస్తున్న నేపథ్యంలో ఈ అంచ‌నాతో ఉంది.
Tags:    

Similar News