ఇంటరెస్టింగ్...జగన్ మంత్రి కి చిరు పరామర్శ!

Update: 2019-07-12 15:06 GMT
మెగాస్టార్ చిరంజీవిది నిజంగానే పెద్ద మనసనే చెప్పాలి. సినిమాల్లో నుంచి తాను రాజకీయాల్లోకి వచ్చిన సందర్భంగా తన పిలుపును అనుసరించి జర్మలిస్ట్ వృత్తికి వీడ్కోలు పలికి తన వెంట నడిచిన వైసీపీ నేత - ఏపీ మంత్రి కురసాల కన్నబాబును ఆయన ఇప్పటికీ మరువలేదనే చెప్పాలి. సోదరుడు సురేశ్ బాబు హఠాన్మరణంతో తీవ్ర శోకంలో మునిగిపోయిన కురసాలకు మనోస్థైర్యం నింపేందుకు బయలుదేరిన చిరు... కాకినాడలోని కురసాల ఇంటికి వెళ్లారు. కురసాలతో పాటు ఆయన తండ్రి - కుటుంబ సభ్యులను ఓదార్చారు. చాలాసేపు అక్కడే ఉండి కురసాల కుటుంబాన్ని ఓదార్చారు.

చిరు రాజకీయ తెరంగేంట్రం సమయంలో కురసాల ముందూ వెనుకా చూసుకోకుండా చిరు వెంట నడిచారు. చిరు స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా బరిలో నిలిచి గెలిచారు. ఆ తర్వాత చిరు తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత కురసాల కూడా కాంగ్రెస్ లో చేరిపోయారు. చిరు రాజకీయాల నుంచి విరమించుకున్నాక... రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన కురసాల వైసీపీలో చేరిపోయారు. తాజా ఎన్నికల్లో వైసీపీ టికెట్ పై ఎమ్మెల్యేగా బరిలో నిలిచిన కురసాల విజయం సాధించారు. అనూహ్యంగా జగన్ కేబినెట్ లో కురసాలకు కీలక మంత్రిత్వ శాఖ దక్కింది.

సరిగ్గా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన రోజునే సురేశ్ బాబు గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. తనకు చేదోడువాదోడుగా నిలిచిన సోదరుడి మృతితో షాక్ తిన్న కురసాన చిన్న పిల్లాడికి మల్లే సోదరుడి మృతదేహం రోధించిన తీరు అందరినీ కలచివేసింది. ఈ క్రమంలో సురేశ్ బాబు మరణవార్త తెలుసుకున్న చిరంజీవి... ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేటి ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి నేరుగా కురసాల ఇంటికి చేరుకున్నారు. సురేశ్ బాబు మృతి నేపథ్యంలో తీవ్ర వేదనలో ఉన్న కురసాల ఫ్యామిలీని చిరు ఓదార్చారు. గుండె నిబ్బరంతో జీవితం సాగించాలని కన్నబాబుకు జీవిత పాఠాన్ని ఉద్బోధించి అక్కడి నుంచి బయలుదేరారు.

Tags:    

Similar News