అడవి పంది ఎంత పని చేసింది.. మంత్రి హరీశ్ కు తృటిలో తప్పిన ప్రమాదం

Update: 2021-06-21 03:12 GMT
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదానికి గురైన ఆయన కారు ముందుభాగం మొత్తం ధ్వంసమైంది. సిద్ధిపేట శివారులో చోటు చేసుకున్న ఈ ప్రమాదం హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనలో పాల్గొని తిరిగి వెళుతున్నారు మంత్రి హరీశ్. ఆయన ప్రయాణిస్తున్న కారు కొండపాక మండలం దుద్దెడ వద్ద అనుకోని రీతిలో ప్రమాదం జరిగింది.

హరీశ్ కాన్వాయ్ ప్రయాణిస్తున్న కారుకు అడవి పందులు అడ్డు వచ్చాయి. దీంతో.. ముందున్న పైలట్ కారు డ్రైవర్ సడన్ బ్రేక్ వేశారు. దీంతో.. వేగంగా వస్తున్న హరీశ్ రావు కారు.. ముందు కారును బలంగా తాకింది. దీంతో.. హరీశ్ ప్రయాణిస్తున్న కారు ముందుభాగంగా బాగా దెబ్బతింది. అయితే.. కారులో ముందు భాగంలో హరీశ్ కూర్చోకుండా వెనుక కూర్చోవటం పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లుగా చెబుతున్నారు.

ఈ ప్రమాదంలో ముందు కూర్చున్న గన్ మేన్ కు, కారు డ్రైవర్ కు గాయాలు కావటంతో వారిని ఆసుపత్రికి తరలించారు. హరీశ్ మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్నంతనే ముఖ్యమంత్రి కేసీఆర్.. హరీశ్ కు ఫోన్ చేశారు. ప్రమాదం గురించి ఆరా తీశారు. పెను ప్రమాదం తృటిలో తప్పటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం హరీశ్ రావు మరో కారులో హైదరాబాద్ కు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో రహదారి మీద వాహనాలు నిలిచిపోయాయి.


Tags:    

Similar News