నాన్సెన్స్‌.. డోంటాక్‌.. ఎమ్మెల్సీపై వైసీపీ ఎమ్మెల్యే మ‌ల్లాది ఫైర్‌.. !

Update: 2021-09-24 12:30 GMT
విజ‌య‌వాడ సెంట్ర‌ల్ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు.. శాస‌న మండ‌లి స‌భ్యుడిపై బ‌హిరంగ స‌భా వేదిక‌గా నోరు పారేసుకున్నారు. తానో అధికార పార్టీ ఎమ్మెల్యేన‌ని, త‌న‌తోపాటు వేదిక పంచుకున్న నాయ‌కుడు.. తోటి ప్రజాప్రతినిధి అనే స్పృహ‌కూడా కోల్పోయారు. నోటికి ఎంత మాట వ‌స్తే.. అంత మాట అనేశారు. నాన్సెన్స్‌.. డోంటాక్‌.. నువ్వేం చేస్తావ్‌.. అంటూ.. విరుచుకుప‌డ్డారు. దీంతో ఒక్క‌సారిగా స‌ద‌రు ఎమ్మెల్సీ నివ్వెర పోయారు. ఇంత‌కీ ఈ ఘ‌ట‌న ఎందుకు జరిగింది..? ఎమ్మెల్యే మ‌ల్లాది ఎందుకు నోరు పారేసుకున్నారు? అనే విష‌యాలు ఆస‌క్తిగాను.. వివాదంగానూ మారాయి.

విజ‌య‌వాడ‌లో ఈ నెల 22న ఏపీ ప్ర‌భుత్వ ఐఐటీలు.. డీఎల్ టీల‌కు సంబంధించిన అప్ గ్రేడ్ విధానంపై కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ.. వెంక‌టేశ్వ‌రావు స‌హాప‌లువురు ప్ర‌జాప్ర‌తి నిధులు హాజ‌ర‌య్యారు. అయితే.. ఈ కార్య‌క్ర‌మంలో తొలుత ప్ర‌సంగించిన ఎమ్మెల్సీ.. వెంక‌టేశ్వ‌రావు.. తాము ఎప్ప‌టి నుంచో డిమాండ్ చేస్తున్న సీపీఎస్ పింఛ‌న్ విధానంపై ప్ర‌భుత్వం ఉదాసీనంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని అన్నారు. అంతేకాదు.. జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో సీపీఎస్ పింఛ‌న్ ర‌ద్దుపై హామీలు ఇచ్చార‌ని.. అయితే.. వీటిని ఆయ‌న అమ‌లు చేయ‌డం లేద‌ని అన్నారు.

ఆ తర్వాత‌.. మైకు పుచ్చుకున్న ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు.. అస‌లు విష‌యం వ‌దిలేసి..   ఉపాధ్యాయ ఎమ్మెల్సీ వెంక‌టేశ్వ‌ర‌రావుపై తీవ్ర‌స్థాయిలో ఫైర‌య్యారు. నాన్సెన్స్ మాట్లాడొద్దంటూ.. దుర్భాషలాడారు. మీరు, మీ ఉపాధ్యాయులు ఏం చేస్తారు..? ఏం చేయ‌గ‌ల‌రు? అంటూ.. ప్ర‌శ్నించారు. మీరేదైనా మాట్లాడుకోవాలంటే.. ప్ర‌త్యేకంగా మైకు పెట్టుకుని మాట్లాడుకోవాల‌ని.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఒకానొక ద‌శలో గుర్రుగా చూస్తే.. వెంక‌టేశ్వ‌రరావును బెదిరించే ప్ర‌య‌త్నం చేయంతో ఆయ‌న బేల‌గా మారిపోయారు. ప్ర‌స్తుతం ఈ వీడియో.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఎమ్మెల్యే అయిన విష్ణు.. తోటి ప్ర‌జాప్ర‌తినిధిపై ఇలాగేనా ప్ర‌వ‌ర్తించేదంటూ.. విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.  
Tags:    

Similar News