వైసీపీలో చెడ్డీ గ్యాంగులు...తొట్టి గ్యాంగులు...ఎంత మాట అనేశారు...!

Update: 2023-03-09 21:31 GMT
వైసీపీని ప్రత్యర్ధులు ఎంత అయినా విమర్శించవచ్చు. వారికి ఆ రైట్ ఉంటుంది. కానీ చిత్రమేంటి అంటే సొంత పార్టీ వారే బయట వారి కన్నా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఒక విధంగా వైసీపీలో కాంగ్రెస్ కల్చర్ చాలానే ఉంది. అందుకే జగన్ లాంటి బలమైన అధినాయకుడు ఉన్నా తమ గొంతులకు పని చెబుతూ ఉంటారు. నాలుగేళ్ళుగా రఘురామరాజు అనే రెబెల్ ఎంపీ ప్రతీ రోజూ వైసీపీ మీద గట్టిగా మాట్లాడుతూ ఉంటారు.

మా పార్టీ అంటూనే వైసీపీ దారుణంగా ఓడిపోతుంది అని ఆయన చెబుతారు. ఇక చూస్తే ఎమ్మెల్యేలలో రెబెల్స్ కొత్తగా బయల్దేరుతున్నారు. నెల్లూరు జిల్లా నుంచి ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామ నారాయణరెడ్డి ప్రభుత్వం మీద ధాటీగానే విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇపుడు సొంత పార్టీలో మరో ఎమ్మెల్యే సౌండ్ చేస్తున్నారు.

చిత్రమేంటి అంటే ఆయనను దగ్గరకు పిలిపించుకుని జగన్ మాట్లాడి హామీ ఇచ్చాక కూడా ఆయన సొంత పార్టీ మీద కామెంట్స్ చేయడం మానడంలేదు. ఆ మధ్య దాకా మైలవరం ఎమ్మెల్యే వసంత క్రిష్ణ ప్రసాద్ టీడీపీలోకి వెళ్తారని అనుకున్నారు. కానీ ఆయన వైసీపీలో ఉంటానని చెబుతున్నారు. జోరు కూడా పెంచారు. అదే టైం లో నోరు పెంచారు. అయితే ఆయన జోరు బాగున్నా నోరు మాత్రం వైసీపీని ఇబ్బందులో పడేస్తోంది.

తన వరకూ అమరావతి మాత్రమే ఏపీకి రాజధాని అని ఈ మధ్యనే వైసీపీ పెద్దలకు గట్టి ఝలక్ ఇచ్చిన వసంత వారు ఇపుడు సొంత పార్టీలో బ్లేడ్ బ్యాచ్, చెడ్డీ గ్యాంగులు, తొట్టి గ్యాంగులు ఉన్నారని అంటున్నారు. తాజాగా తన మైలవరం నియోజకవర్గంలో జి.కొండూరు మండలంలోని వెల్లటూరు గ్రామంలో ఎం.పీ.ఎఫ్.సీ గోడౌన్,కేడీసీసీ బ్యాంక్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ హాట్ హాట్ కామెంట్స్ సొంత పార్టీలోని వారి మీదనే చేశారు.

తనకు సొంత నియోజకవర్గంలోనే విపక్షం తయారు అయిందని, అది కూడా సొంత పార్టీలోని వారే అంటూ ఆయన మధన పడుతున్నారు. ఆయన ఉద్దేశ్యం విమర్శలు అన్నీ కూడా మంత్రి జోగి రమేష్ మీదనే అని అంటున్నారు.  విపక్షాలకు తనను అనే ధైర్యం ఎక్కడిది అని ఆయన అంటూనే సొంత వారే కోతి మూకల మాదిరిగా మారి చేస్తున్న చర్యలను పార్టీ వారు అసలు పట్టించుకోవద్దని వసంత అంటున్నారు.

ఇక ఆయనతో పాటు ఇదే కార్యక్రమంలో పాల్గొన్న కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు కూడా వసంతకు మద్దతుగా మాట్లాడారు. మాజీ మంత్రి దేవినేని ఉమకు ఓటమి లేదని, అలాంటి ఆయన్ని ఏకంగా పన్నెండు వేల పై చిలుకు మెజారిటీతో ఓడించిన ఘనత వసంతకే దక్కుతుందని అన్నారు. వైఎస్సార్ కాలం నుంచి చిత్తశుద్ధితో పనిచేసే నేత వసంత అన్నారు.

మరోసారి మైలవరం నుంచి వసంత పోటీ చేసి గెలవడం ఖాయమని ఆయనకు ఈసారి బంపర్ మెజారిటీ వస్తుందని అన్నారు. ఇక పక్క నియోజకవర్గంలఒ తమ ఎమ్మెల్యే వేలూ కాలూ పెట్టరని, అవతల వారూ అలాగే ఉండాలి ఆయన కోరుతున్నారు. ఇంతకీ వసంత మాటలు అన్నీ మంత్రి జోగి రమేష్ మీదనేనా. మరి వాటిని ఆయన ఎలా తీసుకుంటారో మరెలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News