ఎమ్మెల్యే వ‌ర్సెస్ ఎంపీ.. ప‌శ్చిమ వైసీపీలో క‌ల‌క‌లం

Update: 2021-11-13 23:30 GMT
ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా వైసీపీలో నేత‌ల మ‌ధ్య ర‌గ‌డ ముదురుతోంది. తొలిసారి విజ‌యం ద‌క్కించుకున్న ఇద్ద‌రు నేత‌ల మ‌ధ్య ఆధిప‌త్య ర‌గ‌డ తెర‌మీదికి వ‌స్తోంది. వీరిలో ఒక‌రు ఏలూరు ఎంపీ.. కోట‌గిరి విద్యాధ‌రరా వు కుమారుడు.. కోట‌గిరి శ్రీధ‌ర్ కాగా, మ‌రొక‌రు చింత‌ల‌పూడి ఎమ్మెల్యే ఎలీజా. ఇరువురు నాయ‌కులు కూడా ఒక‌రిపై ఒక‌రు పైచేయి సాధించేందుకు ప్ర‌య‌త్నిస్తుండ‌డం జిల్లా రాజకీయాల‌ను వేడెక్కించాయి. మాట‌ల తూటాలు పేలేలా చేస్తున్నాయి. దీంతో అధికార పార్టీ వ‌ర్గంలో.. ఈ ర‌గ‌డ‌.. క‌ల‌క‌లం రేపుతుండ‌డం గ‌మ‌నార్హం.

ఇంత‌కీ ఏం జ‌రిగింది?

ఏలూరు పార్ల‌మెంటు ప‌రిధిలో కొన్నాళ్లుగా కోట‌గిరి దూకుడు పెరుగుతోంద‌నే వాద‌న ఉంది. ఎక్క‌డ ఏం జ‌రిగినా.. త‌న‌కు తెలియాల‌నే ష‌ర‌తులు విధించ‌డం..త‌న‌మాటే నెగ్గాల‌నే వ్య‌వ‌హారాన్ని తీసుకు వెళ్తున్నారు. అంతేకాదు.. అంద‌రూ త‌న మాటే వినాల‌ని ఆయ‌న తెగేసి చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే  కొన్నాళ్ల కింద జ‌రిగిన సొసైటీ చైర్‌ పర్సన్‌ల నియామకంలో ఎంపీ వర్గం పైచేయి సాధించింది. దీంతో కోట‌గిరి వ‌ర్గ‌మే.. సొసైటీ చైర్ ప‌ర్స‌న్‌ల ప‌ద‌వులు దక్కించుకుంది. దీనిపై ఇదే నియోజ‌వ‌ర్గం ప‌రిధిలోని ఎమ్మెల్యేలు.. గుస్సాగా ఉన్నారు.

ఈ క్ర‌మంలో అవ‌కాశం కోసం ఎదురు చూస్తున్న‌వారు కూడా క‌నిపిస్తున్నారు. వీరిలో చింత‌ల‌పూడి ఎమ్మెల్యే ఎలీజా ఒక‌రు. ఎంపీ వైఖ‌రిపై కొన్నాళ్లుగా రుస‌రుస‌లాడుతున్న ఎలీజా.. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల విష‌యంలో త‌న హ‌వా చూపించారు.  ఎన్నికల్లో ఆయ‌న త‌న అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేసుకున్నారు. దీంతో ఈ ప‌రిణామం .. ఎంపీకి తీవ్ర ఇబ్బందిగా మారింది. దీంతో ఆయ‌న క్షేత్ర‌స్థాయిలో ఏం జ‌రిగిందో తెలుసుకునేందుకు రంగంలోకి దిగారు. ఈ సంద‌ర్భంగా ఎంపీ వ‌ర్గంలోని వారు భారీ ఎత్తున ఆయ‌న‌కు స్వాగ‌తం ప‌లిక‌కారు.

కానీ, ఇదే స‌మయంలో ఎంపీ వ‌ర్గం.. ఎంపీ స‌మావేశానికి దూరంగా ఉండ‌డం గ‌మ‌నార్హం. దీంతో తీవ్ర‌స్థాయిలో హ‌ర్ట‌యిన‌.. ఎంపీ.. శ్రీధ‌ర్‌.. ఎమ్మెల్యే పై ప‌రోక్షంగా వ్యాఖ్య‌లు చేశారు. మీ అందరి వెనుక నేనుంటా. ఆత్మగౌరవం కాపాడుకోవడానికి వచ్చా. మన ప్రాంతాన్ని కాపాడుకునే సమయం వచ్చింది. ఒకరికి న్యాయం చేసేందుకు ఎంత దూరమైనా వెళ్లాలి. తప్పదు అని వ్యాఖ్యానించారు. అంతేకాదు,  ‘చింతలపూడి నియోజకవర్గంలో రాజకీయం దారి తప్పితే ఎంత దూరమైనా వెళతా. కఠిన నిర్ణయాలకు సమయం వచ్చింది’ అని తీవ్ర కామెంట్లే చేశారు. దీంతో ఇక్క‌డి ప‌రిస్థితి మ‌రింత వేడెక్క‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి దీనిపై పార్టీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
Tags:    

Similar News