హైకోర్టులో ఏఏజీ అవ‌మాన‌క‌రంగా మాట్లాడారా?

Update: 2019-02-09 05:42 GMT
గ‌డిచిన ప్ర‌భుత్వంలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి.. ఎస్.ఎ. సంప‌త్ కుమార్ ల అసెంబ్లీ స‌భ్య‌త్వాల విష‌యంలో నెల‌కొన్న వివాదం గుర్తుందా?  స‌భ‌లో గ‌ల‌భా చేశారంటూ కోమ‌టిరెడ్డి.. సంప‌త్ ల అసెంబ్లీ స‌భ్య‌త్వాల్ని ర‌ద్దు చేస్తూ నిర్ణ‌యం తీసుకోవటం.. దీనిపై వారు కోర్టును ఆశ్ర‌యించ‌టం.. అసెంబ్లీ నిర్ణ‌యాన్ని త‌ప్పు ప‌డుతూ కోర్టు ఆదేశాలు జారీ చేయ‌టం తెలిసిందే.

ఇదిలా ఉండ‌గా.. ఈ ఇష్యూకు సంబంధించిన కేసు ప‌రిణామాలు హాట్ హాట్ గా మారాయి. నాటి కేసులో కోమ‌టిరెడ్డి.. సంప‌త్ ల అసెంబ్లీ స‌భ్య‌త్వాల్ని పున‌రుద్ద‌ర‌ణ‌కు సంబంధించిన కేసులో కోర్టు ధిక్కార‌ణ కింద అసెంబ్లీ.. న్యాయ‌శాఖ‌ల కార్య‌ద‌ర్శ‌కుల‌కు కోర్టు బెయిలబుల్ వారెంట్లు జారీ చేయ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఈ నెల 15న వారిని కోర్టులో హాజ‌రుప‌ర్చాలంటూ న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ కు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ధిక్కార కేసు విచార‌ణ‌లో భాగంగా కోర్టు ఎద‌ట హాజ‌రుకావాల్సిన అసెంబ్లీ.. న్యాయ‌శాఖ‌ల కార్య‌ద‌ర్శులు హాజ‌రు కాక‌పోవ‌టాన్ని త‌ప్పు ప‌ట్టిన హైకోర్టు.. వారిద్ద‌రూ కోర్టు ఎదుట హాజ‌రు కావాల్సిందేన‌ని స్ప‌ష్టం చేసింది.

కోర్టు ధిక్కార కేసులో కోర్టుకు స‌హ‌క‌రించాల్సిన అద‌న‌పు అడ్వొకేట్ జ‌న‌ర‌ల్ (ఏఏజే) జె. రామ‌చంద్ర‌రావు కోర్టును ఉద్దేశించి అవ‌మానించేలా మాట్లాడుతూ ఎదురుదాడికి దిగిన‌ట్లుగా హైకోర్టు అభిప్రాయ‌ప‌డింది. అసెంబ్లీలో త‌మ శాస‌న‌స‌భ్య‌త్వాల్ని పున‌రుద్ద‌రించాల్సిందిగా కోర్టు ఇచ్చిన ఆదేశాల్ని అమ‌లు చేయ‌క‌పోవ‌టంపై కోమ‌టి రెడ్డి వెంక‌ట‌రెడ్డి.. సంపత్ కుమార్ లు కోర్టు ధిక్కార పిటిష‌న్ ను దాఖ‌లు చేశారు. దీనికి సంబంధించిన కేసు విచార‌ణ శుక్ర‌వారం జ‌రిగింది. ఈ విచార‌ణ‌కు హాజరైన అసెంబ్లీ కార్య‌ద‌ర్శి త‌ర‌ఫు న్యాయ‌వాది మ‌రో రోజుకు వాయిదా ఇవ్వాల‌ని కోరారు. అందుకు సింగిల్ జ‌డ్జి నిరాక‌రించారు. మ‌ధ్యాహ్నం న్యాయ‌శాఖ కార్య‌ద‌ర్శి త‌ర‌ఫున కోర్టుకు హాజ‌రైన అద‌న‌పు అడ్వొకేట్ జ‌న‌ర‌ల్ రామ‌చంద్ర‌బాబు హాజ‌రై వాయిదా కోరారు.

అందుకు స్పందించిన న్యాయ‌మూర్తి గ‌తంలో కూడా వాయిదా తీసుకున్నార‌ని.. కోర్టుకు వారిద్ద‌రు (అసెంబ్లీ.. న్యాయ‌శాఖ కార్య‌ద‌ర్శులు) హాజ‌ర‌వుతార‌ని చెప్పార‌న్నారు. ఈ ద‌శ‌లో తీవ్ర ఆగ్ర‌హానికి గురైన  ఏఏజీ రామ‌చంద్ర‌రావు.. ఏమిటీ నాన్ సెన్స్?  కేసు విచారించ‌టానికి ఏం ఆధారాలు ఉన్నాయి? అంత అత్య‌వ‌స‌రం ఏమిటి?  నా వాద‌న‌లు పూర్తి చేయ‌నివ్వ‌రా? అని ప్ర‌శ్నించారు.

దీంతో.. వాతావ‌ర‌ణం ఒక్క‌సారిగా వేడెక్కింది. దీనికి స్పందించిన న్యాయ‌మూర్తి నాన్ సెన్స్ తో కాదు గుడ్ సెన్స్ తో అడుగుతున్నా.. వాద‌న‌లు వినిపించండన్నారు. దీంతో తాను సోమ‌వారం వ‌ర‌కు గ‌డువు కోరుతున్న‌ట్లు కోరారు. దీనికి స్పందించిన న్యాయ‌మూర్తి.. కోర్టు ధిక్కార‌ణ ఎదుర్కొంటున్న వారు హాజ‌ర‌వుతార‌ని గ‌తంలో వాయిదా తీసుకున్నారా?  లేదా? అన్న దానిపై క్లారిటీ ఇవ్వాల‌ని కోర‌గా.. అలాంటి హామీ ఇవ్వ‌లేద‌న్నారు.

అదే స‌మ‌యంలో కోర్టు ధిక్కార‌ణ పిటిష‌న్ ను మూసివేయాల‌ని డివిజ‌న్ బెంచ్ ఉత్త‌ర్వులు ఉన్నాయ‌ని.. అయినా ఉత్త‌ర్వులు జారీ చేయాలంటే వాటిని ఎదుర్కొంటామ‌న్నారు. పిటిష‌న్ పై డివిజ‌న్ బెంచ్ విచార‌ణ మూసివేశాక‌.. మ‌ళ్లీ సింగిల్ జ‌డ్జి ద‌గ్గ‌ర విచార‌ణ ఎందుక‌ని ప్ర‌శ్నించారు. ధ‌ర్మాస‌నం ప్ర‌తిని.. ర‌ద్దు అయిన అసెంబ్లీ నేప‌థ్యంలో అప్పీలుపై విచార‌ణ అవ‌స‌రం లేద‌ని ముగించింది. ఈ ఉద్దేశంతోనే కోర్టు ధిక్కార‌ణ‌నూ మూసివేయాల‌ని ఆదేశాలు జారీ చేసిన‌ట్లుగా ఏఏజీ చెప్పారు.కోర్టు ధిక్కార‌ణ‌ను మూసివేయాల‌ని సింగిల్ జ‌డ్జికి ధ‌ర్మాస‌నం ఎలా ఆదేశాలు ఇస్తుంద‌ని?.  అలా ఇవ్వ‌లేర‌ని న్యాయ‌మూర్తి స్ప‌ష్టం చేశారు.

ఉత్త‌ర్వులు జారీ చేయొచ్చ‌ని చెబుతూ ఏఏజీ వెళ్లిపోతుండ‌గా జ‌డ్జి ఆయ‌న్ను ఆపుతూ ఉత్త‌ర్వులు ఇస్తున్నాం అగండంటూ సూచ‌న చేశారు. కోర్టు ధిక్కార‌ణ కేసులో స‌హ‌క‌రించాల్సిన ఏఏజీ కోర్టును ఉద్దేశించి అవ‌మాన‌క‌ర‌రీతిలో మాట్లాడుతూ ఎదురుదాడికి దిగ‌టంతో త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో వారెంట్లు జారీ చేయాల్సి వ‌చ్చిందంటూ పేర్కొంటూ బెయిల్ బుల్ వారెంట్ల‌ను అసెంబ్లీ.. న్యాయ‌శాఖ కార్య‌ద‌ర్శుల‌కు జారీ చేశారు. మ‌రి.. ఈ వ్య‌వ‌హారం రానున్న రోజుల్లో మ‌రెలా మారుతుందో చూడాలి.
Tags:    

Similar News