వైసీపీ నుంచి టీడీపీకి ఓటు...హైరానా పెడుతున్నదెవరు...?

Update: 2023-03-15 07:40 GMT
ఏపీలో మరో ఎన్నిక ఇపుడు ఆసక్తిని రేపుతోంది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు. ఈ నెల 23న జరిగే ఈ ఎన్నికల కోసం మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు ఓటు వేయాల్సి ఉంటుంది. తెలుగుదేశం కూడా తన అభ్యర్ధిని ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నిలబెట్టడంతో ఈ ఎన్నికలు రసకందాయంలో పడ్డాయి.

దాంతో ఏడుగురు ఎమ్మెల్సీ పదవులకు ఎనిమిది మంది పోటీలో ఉన్నారన్న మాట. మరి ఆ ఓడిపోయే ఎనిమిదవ అభ్యర్ధి ఎవరు. అతను వైసీపీలో ఉన్నారా లేక టీడీపీలో ఉన్న వారు అవుతారా. ఇదే చర్చగా ఉంది. ఇదిలా ఉండగా ఈ ఎన్నికలు అనివార్యం కావడంతో మంత్రివర్గ సమావేశంలో జగన్ మంత్రులను అలెర్ట్ చేశారు. ఎట్టి పరిస్థితులలోనూ అధికార పార్టీ నిలబెట్టిన ఏడుగురు ఎమ్మెల్సీ అభ్యర్ధులు గెలవాల్సిందే అని స్పష్టం చేశారు.

ఇందుకోసం మంత్రులు అంతా కృషి చేయాలని కోరారు. ప్రతీ మంత్రికి ఆరుగురు ఎమ్మెల్యేలను జగన్ కేటాయించినట్లుగా ప్రచారం సాగుతోంది. అదే విధంగా అధికార పక్షం నుంచి ఒక్క ఓటు కూడా విపక్షానికి రాకూడదు అని జగన్ హెచ్చరించారని ప్రచారం సాగుతోంది. నిజానికి అలాంటి అనుమానం ఎందుకు వచ్చింది. అలా కూడా జరుగుతుందా అన్నదే ఇపుడు చర్చకు వస్తోంది.

అయితే మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి వంటి రెబెల్స్  టీడీపీకి ఓటు వేస్తారేమో అన్న డౌట్లు అధినాయకత్వానికి ఉన్నాయని అందుకే అలా అధినేత హెచ్చరించి ఉండొచ్చు అని అంటున్నారు. మరో వైపు చూసే ఈ ఏడాది జూలై నాటికి పరిపాలనను విశాఖపట్నానికి మార్చడానికి జగన్ చూస్తున్నారు. అదే విషయాన్ని ఆయన మంత్రులతో పంచుకున్నారు.

జూలై నుంచి విశాఖ వేదికగా కార్యకలాపాలు మొదలెడదామని ఆయన అన్నట్లుగా తెలుస్తోంది. నిజానికి ఉగాది నుంచి విశాఖలో పాలన అని వినిపించింది. ఇపుడు ఆ డేట్. ముహూర్తం మారినట్లుగా ఉందని అంటున్నారు. అదే విధంగా విశాఖలో జరిగిన  గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ సందర్భంగా కుదిరిన కీలకమైన  ఒప్పందాలు అన్నీ కూడా వాస్తవరూపం దాల్చేలా చూడాలని ముఖ్యమంత్రి జగన్  అధికారులను ఆదేశించారు.

అలాగే పెట్టుబడులకు సంబంధించిన రాయితీలను సైతం ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, అవి గ్రౌండింగ్ అయ్యేలా చూడాలని అధికారులకు చెప్పారు. మరో కొత్త విషయం ఏంటి అంటే ఈసారి అసెంబ్లీ ముందుకు 2023-27 కొత్త పారిశ్రామిక విధానం రానుంది. దాన్ని క్యాబినెట్ సమావేశం ఆమోదించింది. దీని వల్ల ఏపీలో పారిశ్రామిక ప్రగతి సాధ్యపడుతుందని ప్రభుత్వం నమ్ముతోంది.

Similar News