మాగుంట చూపు వైసీపీవైపు..!

Update: 2019-02-15 04:53 GMT
ప్రకాశం జిల్లాలో అధికార టీడీపీకి మరో షాక్ తగలబోతోందన్న వార్త హాట్ టాపిక్ గా మారింది. మరో కీలక నేత టీడీపీని వీడేందుకు సిద్ధమయ్యారన్న విషయం ఇప్పుడు టీడీపీలో కలకలం రేపుతోంది. ఇటీవలే చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీని కాదని వైసీపీలో చేరారు. ముఖ్యమంత్రి స్వయంగా హామీలిచ్చినా కూడా ఆమంచి ససేమిరా అని వైసీపీ చేరడం విశేషం.

తాజాగా మాజీ ఎంపీ - ప్రస్తుత ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు తన వర్గీయులతో ప్రత్యేకంగా సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. ఆయన వైసీపీ వైపు చూస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆయన వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం.పార్టీ మారేందుకు తన అనుచర వర్గంతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.  ఆ సమావేశం జరుగుతున్న సమయంలోనే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మాగుంటకు ఫోన్ కాల్ వచ్చింది. వెంటనే సీఎంతో సమావేశం కావాలని వారు సూచించినట్లు తెలుస్తోంది.

మాగుంట శ్రీనివాస్ రెడ్డి ప్రకాశం జిల్లాలో మంచి పట్టున్న నాయకుడు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. 2014 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి ఒంగోలు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత మాగుంటకు టీడీపీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. కానీ ప్రాధాన్యం లేకపోవడంతో మాగుంట టీడీపీలో అసంతృప్తిగా ఉన్నారు. ఆయన పార్టీని వీడుతారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. మళ్లీ తాను ఒంగోలు ఎంపీగా పోటీచేస్తానని ఆయన చెబుతూ వస్తున్నారు. ఇదే సమయంలో నెల్లూరులో  తన వర్గంతో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి.. ప్రజల మూడ్ ను కార్యకర్తల నుంచి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నుంచి మారితేనే మంచిదన్న ప్రతిపాదన వచ్చినట్లు విశ్వసనీయ సమచారం.

ఒంగోలు ఎంపీగా ఎలాగైనా పోటీచేయాలని పట్టుదలగా ఉన్న మాగుంట ఏ పార్టీ నుంచి పోటీచేస్తే గెలుస్తామనే అంశంపై లోతుగా అధ్యయనం చేస్తున్నట్టు సమాచారం. వైసీపీ నుంచి గడిచిన ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా వైసీపీ పార్టీ తరుఫున సుబ్బారెడ్డి గెలిచారు. ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేసిన సుబ్బారెడ్డికి ఈ సారీ ఎన్నికల్లో పోటీచేయించకుండా.. ఎన్నికల మేనేజ్ మెంట్ కోసం వినియోగించాలని జగన్ భావిస్తున్నారు. దీంతో అక్కడ వైసీపీకి అభ్యర్థి కొరత అనివార్యంగా మారింది. ఇదే సమయంలో మాగుంట పార్టీ మార్పు వైసీపీవైపే ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీ ముఖ్యనేతలు మాగుంటతో టచ్ లో ఉన్నట్టు సమాచారం. త్వరగా నిర్ణయం తీసుకొని వైసీపీలో చేరేందుకు మాగుంట రెడీ అవుతున్నట్టు వార్తలొస్తున్నాయి.

ప్రస్తుతం మాగుంట నెల్లూరులో ఉన్నారు. అక్కడే తన కార్యకర్తలతో చర్చలు జరుపుతున్నారు. 17న ఒంగోలు రానున్నారు. 17 -18 తేదీల్లో ఒంగోలులో మరోసారి తన వర్గంతో సమావేశమవుతారట.. పార్టీ మారే అంశంపై చర్చించి అదే రోజు నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. మాగుంట నెల్లూరు మీటింగ్ సమయంలోనే సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ రావడం.. రాజకీయంగా ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దని.. వచ్చి సీఎం చంద్రబాబును కలవాలని సూచించినట్టు సమాచారం. అయితే మాగుంట మాత్రం ఇప్పటికీ తన మనసులో మాట బయటపెట్టడం లేదు. 17న కీలక నిర్ణయం తీసుకుంటారా లేదా అన్నది వేచిచూడాలి.
  


Tags:    

Similar News