మోడీ-కేసీఆర్.. విజ‌న్-2024.. తెలంగాణ రాజ‌కీయాల్లో గుస‌గుస‌!

Update: 2021-09-06 13:30 GMT
తెలంగాణ రాజ‌కీయాలు మారుతున్నాయా?  నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఉప్పు-నిప్పుగా ఉన్న బీజేపీ-టీఆర్ ఎస్‌ల వ్యూహాలు మారుతున్నాయా? అంటే.. తాజాగా జ‌రిగిన ప‌రిణామాలు ఔన‌నే అంటున్నాయ‌ని చెబుతున్నారు ప‌రిశీల‌కులు. ఇటీవ‌ల ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్.. అక్క‌డ తెలంగాణ భ‌వ‌న్‌కు శంకుస్థాప‌న చేశారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న కేంద్ర పెద్ద‌లు, బీజేపీ దిగ్గ‌జ నాయ‌కులు.. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాల‌తోనూ భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా అనేక అంశాలు చ‌ర్చ‌కు వ‌చ్చాయ‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే.. ఏ విష‌యాల‌పై వారు చ‌ర్చించార‌నే అంశం బ‌హిర్గ‌తం కాక‌పోయినా.. రాజ‌కీయంగా మాత్రం ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి.

ఉన్న‌త‌స్థాయిలో ఉన్న‌వారు.. ముఖ్యంగా బీజేపీ పెద్ద‌లు అప్పాయింట్‌మెంట్ ఇచ్చారంటే.. దీనివెనుక ఖ‌చ్చితంగా స్వ‌ప్ర‌యోజ నాలు ఖ‌చ్చితంగా ఉంటాయ‌నేది వాస్త‌వం. ఈ కోణంలో మోడీ-కేసీఆర్‌ల భేటీ వెనుక కూడా రాజ‌కీయ కార‌ణాలు ఉన్నాయ‌ని అంటున్నారు. దేశంలో జ‌మిలి ఇప్ప‌ట్లో వ‌చ్చే అవ‌కాశం లేనందున‌.. 2024లో జ‌రిగే సార్వ‌త్రిక‌ ఎన్నిక‌ల‌పై కేసీఆర్‌-మోడీల మ‌ధ్య సుదీర్ఘ చ‌ర్చ‌లు జ‌రిగి ఉంటాయ‌ని ప‌రిశీల‌కులు భావిస్తున్నారు. ప్ర‌స్తుతం బీజేపీ యేత‌ర పాలిత రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, అక్క‌డి బ‌ల‌మైన అధికార‌పార్టీల మ‌ద్ద‌తు ఇప్పుడు ప్ర‌ధాని మోడీ(అంటే.. బీజేపీకి) అత్యంత అవ‌స‌రం. ప్ర‌స్తుతం క‌రోనా కార‌ణంగా కావొచ్చు.. ఠారెత్తుతున్న ధ‌ర‌ల ప్ర‌భావం కావొచ్చు.. లేదా తాండ‌విస్తున్న నిరుద్యోగం కావొచ్చు.. ఏదైనా కూడా ప్ర‌ధాని మోడీపై దేశంలో వ్య‌తిరేక‌త పెరుగుతోంది. ఇటీవ‌ల జ‌రిగిన స‌ర్వేలోనూ ఈ విష‌యం స్ప‌ష్టమైంది.

ఇక‌, వ‌చ్చే ఏడాది అత్యంత కీల‌క‌మైన పెద్ద‌రాష్ట్రం ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఎన్నిక‌లు ఉన్నాయి. దీనికితోడు మ‌రో నాలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నిక‌లు ఉన్నాయి. వీటిలో బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ఆయా రాష్ట్రాల్లో క‌నుక బీజేపీ డింకీలు తింటే.. కేంద్రంలో ముచ్చ‌ట‌గా మూడోసారి అధికారంలోకి వ‌చ్చే ప‌రిస్థితి మోడీకి స‌న్న‌గిల్ల‌డం ఖాయ‌మ‌ని అంచ‌నాలు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం యూపీ స‌ర్కారును తీసుకుంటే.. యోగి ఆదిత్య తీసుకుంటున్న నిర్ణ‌యాల‌పై ప్ర‌జ‌లు ఆగ్ర‌హంతో ఉన్నారు. అదేస‌మ‌యంలో బీజేపీలోనూ అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు పెరిగిపోయాయి. సామాజిక వ‌ర్గాల వారీగా.. ఇక్క‌డ రాజ‌కీయాలు సాగుతున్నాయి. దీంతో ఈ రాష్ట్రంలో గెలుపుపై బీజేపీలో ధీమా స‌న్న‌గిల్లుతోంది.

ఇదే జ‌రిగితే.. కేంద్రంలో అధికారంలోకి మ‌రోసారి రావాల‌న్న బీజేపీ ఆశ‌లు స‌న్న‌గిల్లుతాయి. అంటే..ఏక‌ప‌క్షంగా మెజారిటీ ద‌క్కించుకుని, 2014, 2019 ఎన్నిక‌ల్లో మాదిరిగా మోడీ చ‌క్రం తిప్పే అవ‌కాశం లేదు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న త‌మ‌కు మ‌ద్ద‌తిచ్చే పార్టీల‌ను అక్కున చేర్చుకునే వ్యూహంతో ముందుకు సాగుతున్నాయి. వాస్త‌వానికి ఇప్ప‌టికే చాలా పార్టీలు మోడీకి మ‌ద్ద‌తు ఇస్తున్నాయి. వాటిలో కొన్ని ఇటీవ‌ల తీసుకువ‌చ్చిన సాగు చ‌ట్టాల ను వ్య‌తిరేకిస్తూ.. మోడీకి దూర‌మ‌య్యాయి. కాబ‌ట్టి.. ఇప్పుడు ద‌క్షిణాది ప్రాంతీయ పార్టీల‌పై మోడీ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే కేసీఆర్ తో మోడీ భేటీలో విజ‌న్‌-2024 అంశం కీల‌కంగా చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్టు ప‌రిశీల‌కులు భావిస్తున్నారు.

దీనిని బ‌ట్టి.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కేసీఆర్ సాయం మోడీ కోరిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. కేంద్రంలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే విష‌యంలో మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని అడిగిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. అదేస‌మ‌యంలో ఇటు కేసీఆర్‌కు కూడా బీజేపీ నుంచి సాయం అవ‌స‌రం ఉంది. రాష్ట్రంలో బీజేపీ నేత‌లు విజృంభిస్తున్నారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టులో కాసుల దండుకున్నార‌ని.. కేసీఆర్‌ను జైలుకు పంపించే రోజు ద‌గ్గ‌ర‌లోనే ఉంద‌ని.. బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజ‌య్ వ్యాఖ్యానించారు. ఇక‌, ప్ర‌స్తుతం సంగ్రామ యాత్ర కూడా చేస్తున్నారు. అంటే.. రాష్ట్రంలో కేసీఆర్‌కు బీజేపీ ప్ర‌ధాన ఇబ్బందిక‌రంగా ఉంది. ఈ క్ర‌మంలో బీజేపీపెద్ద‌ల‌ను మ‌చ్చిక చేసుకుని.. రాష్ట్రంలో త‌న‌పై వ్య‌తిరేక అస్త్రాలు ప్ర‌యోగిస్తున్న బీజేపీ నేత‌ల‌ను నిలువ‌రించే ప్ర‌య‌త్నం ఆయ‌న చేస్తున్నార‌ని అంటున్నారు. `మీ క‌ది.. మాకిది` త‌ర‌హాలో రాష్ట్రంలోత‌మ‌కు అడ్డు లేకుండా చేస్తే.. కేంద్రంలో మీరు అధికారంలోకి వ‌చ్చేందుకు మేం స‌హ‌క‌రిస్తాం.. అనే వ్యూహాన్ని కేసీఆర్ కూడా అవలంబిస్తున్నార‌ని..దీనిపైనే మోడీ-కేసీఆర్‌ల మ‌ధ్య చ‌ర్చ‌లు  జ‌రిగి ఉంటాయ‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. ఇక‌, ఇదే విష‌యం.. తెలంగాణ రాజ‌కీయాల్లో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News