కేసీఆర్ కు అపాయింట్ మెంట్ ఇవ్వని మోడీ

Update: 2017-02-05 06:11 GMT
తన తరహాలోనే మరొకరు వ్యవహరిస్తే.. ఆ ఇబ్బంది అంతా ఇంతా కాదు. పవర్ ఫుల్ ప్లేస్ లో ఉన్న వారికి ఇలాంటి అనుభవాలు చాలా అరుదుగా చోటు చేసుకుంటుంటాయి. తాజాగా అలాంటి అనుభవమే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎదురైందని చెప్పాలి.  ప్రధాని మోడీకి.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు కొన్ని దగ్గర పోలికలు ఉంటాయి. ఎవరైనా వచ్చి కలిసినప్పుడు ఎంతో చక్కగా మాట్లాడే వీరిద్దరూ.. ఫుల్ ఖుషీ చేసేస్తారు. వారి మాటలతో ఆనందపడిపోయే సదరు పెద్దమనిషికి.. తర్వాతి కాలంలో అపాయింట్ మెంట్ కూడా ఇవ్వని తీరు ఈ ఇద్దరి నేతల సొంతం.

మొన్నటికిమొన్న నోట్ల రద్దు సందర్భంగా ఏ ముఖ్యమంత్రి ప్రధాని మోడీతో మాట్లాడేందుకు పెద్ద ఆసక్తి ప్రదర్శించలేదు. ఇలాంటి వేళ.. అందరూ మోడీ మీద కత్తులు దూస్తున్న వేళ.. నోట్ల రద్దు వల్ల లాభమే తప్పించి నష్టం అన్నది లేదన్న వాదనను ప్రధానితో పాటు దేశం మొత్తానికి చాటి చెప్పిన కేసీఆర్.. నోట్ల రద్దు అంశంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సలహాలు.. సూచనలు ఇచ్చారని చెప్పాలి. ఈ సందర్భంగా తామిద్దరం చాలా విషయాలు మాట్లాడుకున్నట్లుగా కేసీఆర్ చెప్పారు.

కేసీఆర్ మాటల్ని చూసినప్పుడు.. ప్రధాని మోడీతో మంచి సంబంధాలు ఉన్నయన్నట్లుగా కనిపిస్తుంది. కానీ.. తాజాగా ఆయన తన రాష్ట్రంలోని అఖిలపక్షం నేతలతో ప్రధానిని కలిసే ప్రయత్నం చేసినప్పుడు ఊహించని సమాధానం ఎదురుకావటం ఆసక్తికరం. నిజానికి ఇలాంటి వైఖరినే కేసీఆర్ కూడా ప్రదర్శిస్తుంటారు. తనను కలవటానికి వచ్చిన విపక్ష నేతల్ని గంటల తరబడి సీఎంవోలో వెయిట్ చేయించి.. ఆ తర్వాత టైం లేదంటూ వెనక్కి తిప్పి పంపించిన ఘన చరిత్ర కేసీఆర్ సొంతం. ఇప్పుడు ప్రధాని మోడీ విషయంలో ఇదే అనుభవం ఆయనకు ఎదురుకావటం ఆసక్తికరమైన అంశంగా చెప్పాలి.

ఎస్సీ వర్గీకరణపై ప్రధాని మోడీతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలో వచ్చే అఖిలపక్షంతో జరగాల్సిన భేటీని రద్దు చేసినట్లుగా ప్రధాని కార్యాలయం వెల్లడించటం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా పలువురికి షాకింగ్ గా మారింది. ఢిల్లీ వచ్చిన సమాచారం ఆయన్ను విస్మయానికి గురి చేసింది. ఒక అంశంపై అన్ని పార్టీ నేతల్ని తీసుకొని ప్రధానిని కలవటానికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ముందస్తుగా అనుమతి తీసుకొని.. ఏర్పాట్లన్నీ చేసుకొన్న తర్వాత ఒక రోజు ముందే.. అపాయింట్ మెంట్ క్యాన్సిల్ అయ్యిందన్న మాట కేసీఆర్ అండ్ కో మింగుడుపడని విధంగా మారింది.

అసలు ఎందుకిలా మారిందన్న విషయాన్ని విశ్లేషించే పనిలో పడింది తెలంగాణ అధికారపక్షం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఎస్సీ వర్గీకరణ విషయంలో మోడీ సర్కారు సానుకూల నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. కేసీఆర్ నేతృత్వంలోని అఖిలపక్షాన్ని ప్రధాని కలిస్తే.. ఆ మైలేజీ మొత్తం తెలంగాణ ప్రభుత్వానికి దఖలు పడటం జరుగుతుందని ఉద్దేశంతోనే అపాయింట్ మెంట్ ను క్యాన్సిల్ చేసుకున్నట్లుగా చెబుతున్నారు. ఏమైనా ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి వ్యక్తికి.. తనను తానే అద్దంలో చూసుకునేలా చేసిన ఘనత మాత్రం ప్రధాని మోడీకే దక్కుతుందని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News