న‌మో యాప్ తో మోడీ సొంత స‌ర్వే!

Update: 2019-01-15 05:25 GMT
ప్ర‌ధాని మోడీని ప‌లువురు ప‌లు సంద‌ర్భాల్లో మామూలోడు కాద‌న్న మాట‌ను చెబుతుంటారు. ఇందులో నిజ‌మెంత‌న్న దానికి నిద‌ర్శ‌నంగా ప‌లు ఉదాహ‌ర‌ణ‌లు చూపిస్తుంటారు. అదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా మోడీ తీసుకున్న నిర్ణ‌యం చూస్తే.. మోడీని మ‌ర మేధావిగా అభివ‌ర్ణించ‌క త‌ప్ప‌దు. ఎన్నిక‌లు వ‌స్తున్నాయంటే చాలు.. స‌ర్వే సంస్థ‌ల మీద ఆధార‌ప‌డే ధోర‌ణి అంత‌కంత‌కూ ఎక్కువ అవుతోంది.

ఈ మ‌ధ్య‌న జ‌రిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంలోనూ కేసీఆర్ అదే ప‌నిగా స‌ర్వే సంస్థ‌లు త‌మ పార్టీ ఎంత ఘ‌న విజ‌యం సాధిస్తుంద‌న్న విష‌యాన్ని అదే ప‌నిగా చెప్ప‌టం మ‌ర్చిపోకూడ‌దు. తాము ప‌ది.. ప‌న్నెండు స‌ర్వేలు చేయించిన‌ట్లుగా చెప్పుకున్నారు. అధినేత బాట‌లో న‌డిచిన ప‌లువురు టీఆర్ ఎస్ అభ్య‌ర్థులు.. నాలుగైదు స‌ర్వేలు చేయించ‌టం ఒక ఎత్తు అయితే.. ఒక సంస్థ చేసిన స‌ర్వేను మ‌రో సంస్థ‌తో చేయించిన స‌ర్వేతో క్రాస్ చెక్ చేసుకున్న వైనాలు చాలానే క‌నిపించాయి.

అంద‌రి మాదిరి మోడీ చేస్తే.. ఆయ‌న ప్ర‌త్యేక‌త ఏముంటుంది? అందుకేనేమో.. త‌న పేరిట విడుద‌ల చేసిన న‌మో యాప్ ద్వారా ప్ర‌జ‌ల నుంచే నేరుగా త‌మ ప్ర‌భుత్వ ప‌ని తీరుపై అభిప్రాయ‌ సేక‌ర‌ణ షురూ చేశారు. ఏదో స‌ర్వే సంస్థ‌ను న‌మ్ముకోవ‌టం కంటే.. ఆ సంస్థ‌లు చేసే జ‌నాల‌నే నేరుగా అడిగేసి.. ఎవ‌రికి వారుగా ఇచ్చే అభిప్రాయాల్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోని త‌మ ప్ర‌భుత్వంపై ఉండే ప్ర‌జా వ్య‌తిరేక‌త‌ను మ‌దింపు చేసే ప్ర‌క్రియ‌ను స్టార్ట్ చేశారు.

మ‌రో మూడు నెల‌ల వ్య‌వ‌ధిలో సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న వేళ‌.. మోడీ మాష్టారు వ్యూహాత్మ‌క అడుగు వేశారు. న‌మో యాప్ లో ఉన్న రిజిస్ట‌ర్ మెంబ‌ర్ల‌కు ప్ర‌శ్నావళిని సంధించారు. త‌మ అభిప్రాయాల్ని సూటిగా తెల‌పాల‌ని కోరారు. మోడీ మీద ఉన్న క్రేజ్ తో గ‌తంలో విడుద‌లైన న‌మో యాప్ ను పెద్ద ఎత్తున డౌన్ లోడ్ చేసుకున్నారు. త‌మ ఐదేళ్ల ప‌ని తీరుకు రేటింగ్ కోర‌టంతో పాటు.. మ‌హా కూట‌మి ప్ర‌భావం ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎంత ఉంటుంద‌న్న ప్ర‌శ్న‌ను సంధించారు. ప్ర‌జ‌ల అభిప్ర‌యాల్ని తాను నేరుగా తెలుసుకోవాల‌నుకుంటున్నాన‌ని.. మీ అభిప్రాయాలు నేరుగా నాతో పంచుకోండంటూ వీడియో సందేశాన్ని మోడీ ఇప్ప‌టికే ఇచ్చేశారు.

ప్ర‌జ‌లు వెల్ల‌డించే అభిప్రాయాల‌కు అనుగుణంగా తాము నిర్ణ‌యాలు తీసుకుంటామ‌ని చెప్ప‌టం ద్వారా.. వారి మాట‌కు అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తున్న‌ట్లుగా త‌న మాట‌ల‌తో చెప్పుకున్నారు. స‌ర్వే సంస్థ‌ల‌కు షాకిస్తూ.. వారిచ్చే రిపోర్టుల కంటే నేరుగా ప్ర‌జలు వెల్ల‌డించే అభిప్రాయాల్ని మ‌దింపు చేయ‌టం ద్వారా.. నికార్సైన నిజాలు తెలుసుకునే వీలుంద‌ని మోడీ భావిస్తున్నారు. ఆయ‌న కోరుకున్న‌ట్లుగా మోడీ పాల‌నపై న‌మో యాప్ యూజ‌ర్లు ఎలాంటి ఫీడ్ బ్యాక్ ఇస్తారో చూడాలి. మోడీ బాట‌లో మిగిలిన పార్టీ నేత‌లు ప‌య‌నిస్తే.. స‌ర్వే సంస్థ‌ల‌కు గ‌డ్డుకాలం దాపురించిన‌ట్లే!



Tags:    

Similar News