దాయాదిపై మోడీ వార్ టైటిల్ ఇదే..

Update: 2016-10-12 05:06 GMT
సర్జికల్ దాడుల అనంతరం దాయాది దేశంతో నిత్యం ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి తెలిసిందే. పాకిస్థాన్ అనుసరిస్తున్న తీరుతో.. యుద్ధం తప్పదన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్న వేళ.. ప్రధాని మోడీ మదిలో ఏం ఉందన్న మాటకు అర్థం దాదాపుగా దొరికినట్లేనని చెప్పక తప్పదు. దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నోలోని రాంలీలా ఉత్సవంలో పాల్గొన్న మోడీ.. దాయాది తీరును తీవ్రంగా తప్పు పట్టటమే కాదు.. పాక్ కానీ తోక జాడిస్తే యుద్ధం తప్పదన్న మాటను చెప్పేశారు. సర్జికల్ దాడుల తర్వాత.. ఆ అంశంపై తొలిసారి గళం విప్పిన మోడీ.. పాక్ కు వార్ వార్నింగ్ లు ఇచ్చేశారు. ఉగ్రవాదానికి ఊతమిస్తున్న దేశాల్ని వెలివేయాలని పిలుపునిచ్చారు.

ముంబయి దాడుల తర్వాత ఉగ్రవాదుల వల్ల కలిగే నష్టాన్ని ప్రపంచం గుర్తించిందని చెప్పిన మోడీ.. తన ప్రసంగాన్ని ‘‘జైశ్రీరాం’’ అన్న మాటతో స్టార్ట్ చేయటం గమనార్హం. దేశ ప్రజలందరికి దసరా శుభాకాంక్షలు చెబుతూ.. ఒకప్పటి తమ పార్టీ నినాదమైన ‘‘జైశ్రీరాం’’ను సందర్భానికి తగ్గట్లుగా ప్రస్తావించటం విశేషం. ఎప్పటిలానే మేనేజ్ మెంట్ గురు మాదిరి మంచి మాటలు కొన్ని చెబుతూనే..పాక్ వైఖరిని తప్పు పడుతూ.. వార్ మాటల్ని చెప్పేశారు. ఉగ్రదాడులు జరుగుతున్నప్పుడు యుద్ధాలు తప్పవని వ్యాఖ్యానించారు. తాజాగా మోడీ చేసిన వ్యాఖ్యలతో ఒక్క విషయం స్పష్టమైనట్లే. అదేమంటే.. పాకిస్థాన్ తో యుద్దానికి మోడీ మానసికంగా సిద్ధమైనట్లుగా తాజా వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయని చెప్పాలి.

అంతేకాదు.. దాయాది మీద ఒకవేళ యుద్ధమే చేయాల్సి వస్తే.. దాని నినాదం ఏమిటన్నది మోడీ తాజా మాటలతో తేలిపోయిందని చెప్పాలి. ఉగ్రవాదులను పెంచి పోషించేవాళ్లను ఉపేక్షించరాదని చెప్పటం ద్వారా.. పాకిస్థాన్ తీరును తప్పు పడుతూ.. ఉగ్రవాదులకు అండగా నిలిచే దాయాది పీచమణచటానికి గల కారణాన్ని మోడీ సూటిగా చెప్పేసినట్లేనని చెప్పక తప్పదు. సమాజంలో చెడును పోగొట్టి మంచిని పెంచేదే రాంలీలా అని పేర్కొన్న మోడీ.. ఉగ్రవాదం మానవాళికి శత్రువని.. ఉగ్రవాదంపై పోరాడిన తొలి యోధుడిని జటాయువుగా అభివర్ణించారు. ఉగ్రవాదులకు అండగా నిలిచే పాక్ మూల్యం చెల్లించక తప్పదని.. అలాంటి దేశాలకు బుద్ధి చెప్పకపోతే ఉగ్రవాదుల్ని కంట్రోల్ చేయటం తప్పదన్న మాటను చెప్పటం చూస్తుంటే.. మోడీ మనసులో ‘వార్’ ఆలోచనలపై ఒక స్పష్టత వచ్చినట్లుగా అనిపించక మానదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News