కాంగ్రెస్ ముక్త్ భార‌త్‌..ఫ‌లిస్తున్న మోడీ క‌ల‌

Update: 2018-03-03 09:17 GMT
గుజ‌రాత్ ఫలితాల‌తో ఒకింత నిరాశ‌లో కూరుకుపోయిన బీజేపీ శ్రేణుల‌కు అతిపెద్ద తీపిక‌బురు అందింది. ఈశాన్య రాష్ర్టాల్లో బీజేపీ పాగా వేసింది.ఆ పార్టీ ర‌థసార‌థులు అయిన ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ - బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్‌ షా లక్ష్య‌మైన కాంగ్రెస్ విముక్త భారత్ దిశగా బీజేపీ మరో అడుగు పడింది. ఈశాన్య రాష్ట్రాల్లోను కమల వికాసానికి తిరుగులేకుండా పోయింది. అక్కడి ఏడు రాష్ట్రాల్లో అసోం - అరుణాచల్‌ ప్రదేశ్ - మణిపూర్‌ లో కాషాయ జెండా రెపరెపలాడుతుండగా.. ఇప్పుడు ఆ జాబితాలో త్రిపుర - నాగాలాండ్‌ కూడా చేరిపోయాయి. ముఖ్యంగా మాణిక్ సర్కార్‌ ను గద్దె దించడం కమలనాథుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తోంది. త‌ద్వారా బీజేపీ త‌న ల‌క్ష్యాన్ని దాదాపు చేరుకున్న‌ట్ల‌యింది.

ఇటీవ‌లి కాలంలో కేరళలో ఆరెస్సెస్‌ కార్యకర్తల హత్యలకు పాల్పడుతున్న కామ్రేడ్లకు త్రిపురలో గట్టి షాక్ ఇవ్వాలని కమలనాథులు తహతహలాడారు. ఇందుకోసం మూడేళ్ల క్రితమే పక్కా ప్రణాళిక సిద్ధం చేసి అమలు చేశారు. చిన్న రాష్ట్రాలే కదా అని ఈశాన్యంపై బీజేపీ ఏమాత్రం చిన్నచూపు చూడలేదు. పైగా ప్రత్యేక శ్రద్ధ చూపుతూ వచ్చింది. గుజరాత్ ఫార్ములాను అక్కడా అమలు చేశారు. ముఖ్యంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ఆధ్వర్యంలో బూత్‌ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా త్రిపురలో ఇప్పటివరకు బీజేపీ ప్రాతినిథ్యమే లేదు. అలాంటి చోట కమ్యూనిస్టుల్ని మట్టి కరిపించడం మామూలు విషయం కాదు. రామ్‌ మాధవ్‌ ఆధ్వర్యంలో వ్యూహాల్ని అమలుచేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో వారణాసిలో మోడీకి మేనేజర్‌ గా పనిచేసిన దేవ్‌ ధర్‌ ను త్రిపురకు ప్రత్యేకంగా నియమించారు. బూత్‌ లెవల్‌ లో పార్టీని ఎలా పటిష్టం చేయాలో.. కార్యకర్తల్ని ఎలా సమీకరించాలో అమిత్‌ షాకు కొట్టిన పిండి. దీంతో.. ఆయన కూడా ఈశాన్యంపై స్పెషల్ ఫోకస్‌ చేశారు. ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ.. మోడీ సభలు ఓటర్లలో ఉత్సాహం నింపాయి.

ఈ మూడు రాష్ర్టాలు వ్యూహాత్మ‌కంగా బ‌ల‌మైనవి కూడా కావ‌డం విశేషం. ఫలితాలు వెలువడిన మూడు రాష్ట్రాలు కూడా పొరుగు దేశాలతో సరిహద్దులు ఉన్నవే. ఈశాన్య భారతంలో అభివృద్ధికి అడ్డంకిగా మారుతున్నమిలిటెంట్లపై ఇండియన్ ఆర్మీ సర్జికల్ స్ట్రైక్స్‌ బీజేపీకి కలిసొచ్చాయనే చెప్పాలి. అటు.. చైనా దూకుడు నేపథ్యంలో.. ఓటర్లలో కమలనాథులు దేశభక్తిని రగిల్చారు. కమలనాథులు ఏలుబడిలోకి వస్తే.. కేంద్ర ప్రభుత్వ అండతో తమకు మరింత భద్రత కలుగుతుందనే ధీమా కల్పించారు. అవన్నీ ఫలించి.. రెండు రాష్ట్రాల్లో బీజేపీ సత్తా చాటగలిగింది.సరిహద్దుల్లోని రాష్ట్రాలు కావడంతో.. ఇప్పటికే నిధుల వరద పారించగా.. మోడీ మరిన్ని హామీలు గుప్పించారు. మొత్తంగా మోడీ మేజిక్ కొనసాగింది. కాంగ్రెస్ విముక్త భారత్‌ దిశగా మరో ముందడుగు పడినట్టయిందని బీజేపీ శ్రేణులు ఖుష్‌ అవుతున్నాయి..
Tags:    

Similar News