సుదీర్ఘ విరామం తర్వాత మోడీ విదేశీ పర్యటన.. బైడెన్ తో భేటీ ఎందుకంటే?

Update: 2021-09-05 04:30 GMT
మీకు గుర్తుందా? గతంలో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఏ ప్రధాని చేయనన్ని విదేశీ పర్యటనల్ని మోడీ పూర్తి చేశారు. ఆయన పీఎం కుర్చీలో కూర్చున్న నాటికి పాతికేళ్లు.. ముప్ఫై ఏళ్లుగా పలు దేశాలకు భారత ప్రధాని వెళ్లని పరిస్థితి. ఆ లోటును ఇట్టే పూర్తి చేశారు మోడీ. 2014లో ప్రధాని పదవిని చేపట్టిన తర్వాత ఆయన తక్కువ వ్యవధిలోనే 60 దేశాల్లో వందకు పైగా పర్యటనల్ని చేసి.. కొత్త రికార్డుల్ని క్రియేట్ చేశారు. ఒక దశలో భారత్ లో తక్కువ.. విదేశాల్లో ఎక్కువగా ఉండే ప్రధానిగా ఆయనపై విమర్శలు చేసే వారు విశ్లేషకులు కొందరు.

అలాంటి మోడీ ఫారిన్ టూర్లకు బ్రేకులు వేసింది కరోనా. గత ఏడాది జనవరి తర్వాత మారిన పరిస్థితుల నేపథ్యంలో ఆయన ఎలాంటి విదేశీ పర్యటన చేయలేదు. పశ్చిమబెంగాల్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల వేళ.. వ్యూహాత్మకంగా బంగ్లాదేశ్ లో పర్యటించారన్న మాట వినిపిస్తుంది. అప్పటికప్పుడు షెడ్యూల్ చేసి.. బంగ్లాదేశ్ కు వెళ్లటం ద్వారా బెంగాల్ ఎన్నికల ఫలితాల మీద ప్రభావం ఉంటుందన్న అంచనాలు తప్పు కావటం తెలిసిందే. ఆ టూర్ తర్వాత మరే దేశానికి మోడీ వెళ్లలేదు.
తాజాగా మాత్రం ఆయన అమెరికా టూర్ కు ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటివరకు అందుతున్న అంచనాల ప్రకారం ఈ నెలాఖరులో ఆయన అమెరికాలో పర్యటించే వీలుందని చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండు దేశాల అగ్రనేతలు భేటీ అయ్యింది లేదు. ఈ కొరతను తీర్చేలా తాజా టూర్ ఉంటుందని చెప్పక తప్పదు. ట్రంప్ నకు బాహాటంగా మద్దతు తెలపటంతో.. ఆయనతో పోలిస్తే.. మోడీకి బైడెన్ తో  సంబంధాలు తక్కువనే చెప్పాలి.

ఈ నెల 25న న్యూయార్క్ లో ఐక్యరాజ్యసమితి సర్వ సభ్య సమావేశంలో ప్రధాని మోడీ హాజరవుతారని అంచనా వేస్తున్నారు. అఫ్గానిస్థాన్ లో తాలిబన్లు అధికారాన్ని చేజిక్కించుకుున్న నేపథ్యంలో మోడీ అమెరికా పర్యటన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తన తాజా టూర్ లో భాగంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో భేటీ అవుతారని చెబుతున్నారు. అయితే.. అధికారికంగా మాత్రం షెడ్యూల్ ను సిద్ధం చేయలేదు. 2019లో అమెరికాలో నిర్వహించిన హౌదీ మోడీ కార్యక్రమాన్ని న్యూయార్కులో ప్రవాస భారతీయుల నడుమ నిర్వహించటం.. ఆ సందర్భంగా ట్రంప్ నకు మద్దతు ఇవ్వాలని పిలుపును ఇవ్వటం తెలిసిందే.
Tags:    

Similar News