వచ్చే ఎన్నికల్లో తమిళనాడు నుంచి మోడీ.. నిజమేనా?

Update: 2023-06-15 18:00 GMT
తిరుగులేని అధికారపక్షంగా.. దేశ ప్రధానుల్లో ఇటీవల కాలంలో మరే ప్రధానికి లేనంత ప్రజా ఛరిస్మా నరేంద్ర మోడీ సొంతం. సమాకాలీన రాజకీయాల్లో దేశ ప్రధానిగా మోడీ తనదైన ముద్రను వేయటంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఉత్తరాదిన..ఈశాన్య భారతంలో బీజేపీ పట్టు సాధించినా.. నేటికి దక్షిణాది పట్టు పెంచుకోవటంలో ఫెయిల్ అవుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీనే స్వయంగా రంగంలోకి దిగాలని భావిస్తున్నారా? ఆ వాదనలో నిజం ఎంత? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

దేశంలోని దక్షిణ భాగంలో ఉన్న తెలంగాణ .. ఆంధ్రప్రదేశ్.. తమిళనాడు.. కర్ణాటక.. కేరళ రాష్ట్రాలు ఉండగా.. మరికొన్నికేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. వీటిల్లో కర్ణాటకలో తప్పించి.. బీజేపీ ఇప్పటివరకు మరే రాష్ట్రంలోనూ తన సత్తా చాటింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పట్టు పరిమితంగా ఉన్నప్పటికీ.. ఎవరో ఒక మిత్రపక్షాన్ని సాయంగా చేసుకొని ప్రత్యర్థులపై పట్టు సాధిస్తూ ముందుకు వెళుతున్నారు. అయితే.. ఈ మిత్రపక్షాలు ఒక్కోసారి ఒక్కోరితో ఉండటంతో బీజేపీకి ఇబ్బందికరంగా మారింది. కర్ణాటకను మినహాయిస్తే.. ఏపీ.. తెలంగాణ.. తమిళనాడు.. కేరళ రాష్ట్రాల్లో బీజేపీ పట్టు కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం లేని పరిస్థితి.

ఈ నేపథ్యంలో పట్టు కోసం ఎంత పెద్దగా ప్రయత్నాలు చేసినా ప్రయోజనం ఉండదని.. ఆ స్థానే ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా రంగంలోకి దిగి.. తమిళనాడులోని ఏదైనా ప్రాంతం నుంచి పోటీ చేస్తే.. కమలనాథుల్లో కొత్త జోష్ రావటం ఖాయమంటున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల చోటు చేసుకున్ పరిణామాలు ఉన్నాయని చెబుతున్నారు. కొత్త పార్లమెంటు భవనాన్నిప్రారంభించిన సందర్భంలో తమిళనాడుకు చెందిన ప్రముఖ పీఠాధిపతుల్ని ప్రత్యేకంగా ఆహ్వానించటంతో పాటు.. వారికి రాచమర్యాదలు చేయటం తెలిసిందే.

అంతేకాదు.. రాజదండం పేరుతో తమిళనాడుకు చెందిన రాజవంశీకులకు చెందిన సింగోల్ ను తీసుకొని రావటం ద్వారా  తమిళ కల్చర్ కు తాము ఎంత ప్రాధాన్యత ఇస్తామన్న  సందేశాన్ని ప్రజల్లోకి తీసకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నట్లు చెబుతన్నారు. అంతేకాదు.. తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్నిప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకొని.. అక్కడ పార్టీ కార్యకలాపాల్ని తీవ్రతరం చేయాలన్నది మోడీ అండ్ కో వ్యూహంగా చెబుతున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మధురై నుంచి దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను దించాలన్నయోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

అన్నాడీఎంకే కూటమితో పొత్తు పెట్టుకున్నప్పటికి.. నెమ్మదిగా ఆ పార్టీని తమలో కలిపేసుకోవటం ద్వారా.. పార్టీ క్యాడర్ ను తేలిగ్గా తమతో కలిసి ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇందుకుతగ్గట్లే  తాజాగా ముగిసిన అమిత్ షా రాష్ట్ర పర్యటన కొంత క్లారిటీ ఇచ్చిందనిచెప్పాలి. డీఎంకే.. అన్నాడీఎంకేలు అవినీతి పార్టీలుగా చెబుతూ.. పార్టీ లాభపడేలా ప్లాన్ చేస్తున్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. రెండు రోజుల క్రితం తమిళనాడులో మాట్లాడిన కేంద్రహోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. దేశ ప్రధానిగా తమిళ వ్యక్తిని చూడాలన్నది తన కలగా ఆయన చెప్పటం ద్వారా.. తమిళుల విషయంలో తనకున్న అభిమానం ఎంతన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని చెప్పాలి. అమిత్ షా తాజా వ్యాఖ్యలు చూస్తే.. తమిళ వ్యక్తి ప్రధాని పీఠం మీద సాధ్యం కాకున్నా.. ప్రధాని మోడీ తమిళనాడు నుంచి పోటీ చేయటం ద్వారా.. ప్రధానిగా తమిళనాడు ప్రాంతాన్నిప్రాతినిధ్యం వహించిన వైనాన్ని తమిళుల మదిలో రిజిస్టర్ చేయాలన్నది మోడీ అండ్ కోఆలోచనగా చెబుతున్నారు. ఏమైనా.. తమిళనాడు మీద మోడీషాలు కొత్తగా టార్గెట్ చేశారని మాత్రం చెప్పక తప్పదు.

Similar News