మోడీ ‘హిందీ’ఇజం.. దక్షిణాదికి శాపం?

Update: 2020-08-10 06:30 GMT
భారతదేశాన్ని పరిపాలించిన ప్రధానుల్లో మెజార్టీ హిందీ బెల్ట్ కు చెందిన ఉత్తర భారతీయులే. మధ్యలో మన పీవీ నరసింహరావు లాంటి కొంతమంది తప్పితే అంతా ఉత్తరభారత ఆధిపత్యమే. నిజానికి దేశంలో ఎక్కువ రాష్ట్రాల్లో హిందీయే భాషగా ఉంది. దానికి దగ్గరగా ఉండే మరాఠీ, గుజరాతీ, రాజస్థానీ అంతా హిందీ రాష్ట్రాలుగా పరిగణించబడుతాయి.

దీన్ని బట్టి ఆధిపత్యం.. అధికారం అంతా హిందీలోనే ఉంటోంది. గుజరాత్ కు చెందిన మోడీ రెండు సార్లు అధికారంలోకి వచ్చారు. ఆయన అధికారం చేపట్టడంలో హిందీ బెల్ట్ పాత్ర అధికంగా ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాంతీయపార్టీలే గెలవడంతో ఇక్కడి రాష్ట్రాలపై బీజేపీ సవతి ప్రేమ చూపిస్తోందన్న వాదన ఉంది. దక్షిణాది భాషలన్నా.. ఇక్కడి సంస్కృతి అన్న వివక్షనే హిందీ వారిలో కనిపిస్తోంది.  ఇక నిధుల పరంగా కేటాయింపుల్లో దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం ఇవ్వడం లేదన్న విమర్శలున్నాయి.

ఈ క్రమంలోనే దక్షిణాదివారిపై దేశంలో వివక్ష కొనసాగుతోంది. కేరళలోని కోజికోడ్ లో ఎయిర్ పోర్ట్ కు వెళ్లిన డీఎంకే నేత, లోక్ సభ ఎంపీ కనిమొళికి చేదు అనుభవం ఎదురైంది. ఆ ఘటన స్థలంలో విధులు నిర్వహిస్తున్న ఉత్తర భారతానికి చెందిన సీఐఎస్ఎఫ్ కు చెందిన ఓ మహిళా జవాన్ కనిమొళిని గుర్తు పట్టకుండా తీవ్రంగా అవమానించారు.   సీఐఎస్ఎఫ్ మహిళా జవాన్ హిందీలో  ఏదో చెప్పింది. దానికి తనకు హిందీ రాదని.. తమిళం లేదంటే ఇంగ్లీష్ లో మాట్లాడాలని సూచించానని కనిమొళి తెలిపారు. దానికి ఆ మహిళా జవాన్ ‘హిందీ తెలియదా? ఇంతకూ మీరు భారతీయులేనా’ అని ఆమె తనను ప్రశ్నించిందని కనిమొళి వాపోయింది.

హిందీ భాష వచ్చిన వారు భారతీయులు అన్నట్టేనా? అని ఎంపీ కనిమొళి ట్విట్టర్ లో ప్రశ్నించారు. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర సర్కార్ బలవంతంగా హిందీని రుద్దాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ‘హిందీఇంపోజిషన్’ అని హ్యాష్ ట్యాగ్ ను వైరల్ చేశారు.

ప్రస్తుతం విద్యావిధానం నుంచి సంస్కృతి సంప్రదాయాల వరకు కేంద్రంలోని మోడీ సర్కార్ హిందీని ప్రొజెక్ట్ చేస్తూ మిగతా దక్షిణాది భాషలను విస్మరిస్తుందన్న ఆవేదన ఆయా రాష్ట్రాల నేతలు, ప్రజల్లో నెలకొంది. అమిత్ షా సైతం ఆ మధ్య దక్షిణాది రాష్ట్రాలపై హిందీ రుద్దే ప్రయత్నం చేయడం వివాదాస్పదమైంది. మోడీ కూడా అలాంటి పోకడలే అవలంభిస్తుండడంతో దేశంలో దక్షిణాది భాషల ప్రభవం తగ్గిపోతోంది. ఈ పరిస్థితి మారడానికి దక్షిణాది ప్రాంతాల నేతలంతా ఒక్కటి కావాల్సిన అవసరం ఉంది. హిందీనే వ్యాపింపచేస్తున్న బీజేపీ నేతలకు స్థానిక భాషల గౌరవాన్ని గుర్తు చేయాల్సిన అవసరం ఉంది.
Tags:    

Similar News