మోడీ అంత పెద్ద బ్యాట్స్ మెన్! సోషల్ లో పంచ్ లే పంచ్ లు

Update: 2021-06-03 14:30 GMT
ప్రధాని నరేంద్ర మోడీ ఏమిటి? బ్యాట్స్ మెన్ ఏమిటి? అంటారా? అక్కడికే వస్తున్నాం. సోషల్ మీడియా పుణ్యమా అని ఆయనలోని బ్యాట్స్ మెన్ యాంగిల్ ను బయటకు తెచ్చేస్తున్నారు. ఏడేళ్ల క్రితం ఎన్నో ఆశలు.. మరెన్నో అంచనాలతో ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెట్టిన ప్రజలు.. ఇప్పుడు ఆయన్ను ప్రధాని కంటే కూడా పన్నులతో అదరగొట్టే బ్యాట్స్ మెన్ గా  చూస్తున్నారు.

ఏం పెరిగినా ఫర్లేదు.. నిత్యవసర వస్తువులు..పెట్రోల్ ధరలు పెరగకుండా సామాన్యుడి బతుకుబండి గతి తప్పకుండా ఉంటుంది. కానీ.. మోడీ మాష్టారు మాత్రం అందుకు భిన్నం. ఎవరైనా సరే.. తాను బాదే బాదుడుకు మినహాయింపు కాదన్నట్లుగా ఆయన నిర్ణయాలు ఉంటున్నాయి. స్వాతంత్య్రం వచ్చి దగ్గర దగ్గర ఏడున్నర దశాబ్దాలవుతోంది. ఎన్నో ప్రభుత్వాలు పాలించాయి. కానీ.. చరిత్రలో ఎప్పుడూ లేనంతగా పెట్రోల్.. డీజిల్ ధరలు పెరిగిపోవటమే కాదు.. కాస్త ముందు వెనగ్గా.. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ లీటరు పెట్రోల్ ధర సెంచరీ దాటించేసిన ఘనత మోడీదే.

మరికొద్ది రోజులు వెయిట్ చేస్తే.. లీటరు డీజిల్ ను సైతం సెంచరీ దాటేసిన చారిత్రక రికార్డు ఆయన సొంతం కానుంది. వీటన్నింటికి మించి.. మరో అద్భుతమైన రికార్డును ఆయన తన ఖాతాలో వేసుకున్నారు. అది వంట నూనెల ధరలు. లీటరు పామాయిల్ రూ.150ను దాటించేసి.. రిఫైండ్ సన్ ఫ్లవర్ అయిన్ ను రూ.200 దగ్గరకు తెచ్చేశారు. బహిరంగ మార్కెట్లో లీటరుసన్ ఫ్లవర్ అయిల్  రూ.175-180 మధ్యలో నడుస్తోంది. గత ఏడాది ఇదే సమయానికి లీటరు సన్ ఫ్లవర్ అయిన రూ.100 - 105 మధ్యలో ఉండేది. ఏడాదిలో రూ.70 పెంచేసినప్పుడు ఈ ఏడాది చివరికి డబుల్ సెంచరీ దాటించకటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.

మిగిలిన వాటి ధరలకు.. పెట్రోల్.. డీజిల్.. వంట నూనెలకు సంబంధించి ఒక పోలిక ఉంది. అదేమంటే.. పెట్రోల్.. డీజిల్ కు కేంద్రం వేసే పన్నులు.. రాష్ట్రాలు వేసే పన్నులు అసలు పెట్రోల్  ధరకు మించి ఉండటం. అదే సమయంలో లీటరు పామాయిల్ కానీ.. లీటరు సన్ ఫ్లవర్ ఆయిల్ అసలు ధరకు కేంద్రం వేసే పన్ను పోటు భారీగా ఉంటుంది. ఏమైనా చమురు ధరల్ని సెంచరీకి.. వంట నూనెల ధరల్ని డబుల్ సెంచరీకి తీసుకెళ్లిన మోడీ.. దేశంలోనే అత్యద్భుత బ్యాట్స్ మెన్ కాకుండా మరేం అవుతారు చెప్పండి?
Tags:    

Similar News