జ‌య‌ల‌లిత మృతికి.. మోడీనే కార‌ణం: సంచ‌ల‌న కామెంట్ చేసిన జ‌య‌ ప్ర‌త్య‌ర్థి

Update: 2023-01-08 23:30 GMT
దేశంలో ఇప్ప‌టికీ ఒక మిస్ట‌రీగానే మిగిలిపోయిన త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి  జయలలిత మరణంపై ప్ర‌స్తుత అధికార ప‌క్షం డీఎంకే ఎమ్మెల్యే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జ‌య‌ల‌లిత మ‌ర‌ణం వెనుక ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఉన్నార‌ని, ఆయ‌నే ఆమెను హత్య చేయించారని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.  ప్రొఫెసర్ అన్బళగన్ శతజయంతి వేడుకల సందర్భంగా.. విలాతికుళం డీఎంకే(అధికార పార్టీ) ఎమ్మెల్యే మార్కండేయన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ శతజయంతి వేడుకల్లో పాల్గొన్న మార్కండేయన్.. మోడీనే జయలలితను హత్య చేయించారని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఎంకే ఎమ్మెల్యే, డీఎంకే నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఉన్నారు. వీరి స‌మ‌క్షంలోనే ఆయ‌న ఇలా వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. నిజానికి జ‌య‌ల‌లిత‌.. అన్నాడీఎంకే నాయ‌కురాలు. డీఎంకేకు.. అన్నాడీఎంకేకు అస‌లు ప‌డ‌దు. అలాంటిది.. జ‌య‌ల‌లిత విష‌యంలో డీఎంకే నేత ఇలా వ్యాఖ్యానించ‌డం.. మ‌రో సంచ‌ల‌నంగా మారింది.

అయితే.. దీనికి కార‌ణం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు .ప్ర‌స్తుతం అన్నాడీఎంకే నేత‌లు బీజేపీతో ట‌చ్‌లో ఉన్నారు. ముఖ్యంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ క‌నుస‌న్నల్లోనే వీరు ప‌నిచేస్తున్నారు. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మోడీ త‌మిళ‌నాడులో ని రామ‌నాథ‌పురం నుంచి పోటీ చేయాల‌ని భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో అన్నాడీఎంకే సంపూర్ణంగా ఆయ‌న‌కు స‌హ‌క‌రించే అవకాశం ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని.. అటు బీజేపీని, ఇటు అన్నాడీఎంకేను.. ఏక‌కాలంలో ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డేసేలా డీఎంకే నేత వ్యాఖ్య‌లు చేశార‌నే చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.

ఇదిలావుంటే, జయలలిత 2016 సెప్టెంబర్ 22న ఆస్పత్రిలో చేరారు. దాదాపు 10 వారాల పాటు చికిత్స పొంది.. 2016 డిసెంబర్ 5న మరణించారు. జయలలిత మరణంపై చాలా ప్రశ్నలు తలెత్తాయి. వాస్తవాలను వెలికితీసేందుకు ఓ కమిటీని వేయాలని అభిమానులు ప్రభుత్వాన్ని కోరారు. దీంతో ప్రభుత్వం జస్టిస్ ఆరుముగస్వామి అధ్యక్షతన ఓ కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఆ కమిషన్ దాదాపుగా ఐదేళ్లలో.. చాలా సార్లు తమ విచారణ కాలాన్ని పొడిగించింది. ఇటీవ‌ల నివేదిక ఇచ్చింది.
Tags:    

Similar News