ఎన్టీయార్ ని పదే పదే తలచుకుంటున్న మోడీ

Update: 2023-02-09 20:44 GMT
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీయార్  జాతీయ రాజకీయాల్లో కూడా తన ముద్ర బలంగా చాటుకున్న నేత. నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఆయన ఢిల్లీలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఉమ్మడి ఏపీకి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎన్టీయార్  ప్రజా నాయకుడిగా కీర్తిని గడించారు. ఎన్టీయార్  పేరు చెబితే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కళ్ల ముందు కనిపిస్తాయి. ఎన్టీయార్  వేసిన బాటలో ఈ రోజుకు అంతా నడుస్తున్నారు అంటే ఆయన బలమైన ముద్ర తెలుగు రాజకీయాలతో పాటు జాతీయ రాజకీయాల మీద ఉంది అని అర్ధం అవుతోంది.

ఎన్టీయార్  ని తెలుగుదేశం పార్టీ తరచూ తలచుకుంటుంది. ఆ పార్టీకి ఆయన వ్యవస్థాపకుడు. కానీ ఎన్టీయార్  పేరుని బీజేపీ కూడా ఎక్కువగా ఉపయోగిస్తోంది. ఇటీవల కాలంలో దేశ ప్రధాని బీజేపీ రధ సారధి నరేంద్ర మోడీ ఎన్టీయార్ ని పదే పదే గుర్తు చేసుకుంటున్నారు. ఆయన గురించే మాట్లాడుతున్నారు

ఈ రోజు పార్లమెంట్ లో ఆయన మాట్లాడుతూ ఎన్టీయార్  ప్రస్తావన తెచ్చారు. ఎన్టీయార్  తన అనారోగ్యం నిమిత్తం విదేశాల్లో చికిత్స చేయించుకునేందుకు విదేశాలకు వెళ్తే నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయంగా ఆయన ప్రభుత్వాన్ని కూలదోసిందని నరేంద్ర మోడీ 1984 నాటి ఉమ్మడి ఏపీ వెన్నుపోటు రాజకీయ పరిణామాలను పార్లమెంట్ దృష్టికి తీసుకుని వచ్చారు. ఎన్టీయార్ ని నాడు నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటు పొడిచారు.

నాడు కేంద్రంలో అధికారంలో ఉన్న ఇందిరా గాంధీ ప్రభుత్వం తెర వెనక పూర్తి సహాయ సహకారాలను అందించింది. ఈ విషయాన్నే మోడీ ఈ రోజు పేర్కొంటూ కాంగ్రెస్ తన ఏలుబడిలో పూర్తిగా అధికార దుర్వినియోగం చేసింది అని అన్నారు.  ప్రతిపక్ష ప్రభుత్వాలను పడగొట్టడానికి  356 అధికరణనను యాభై సార్లకు పైగా ఉపయోగించిన చరిత్ర కాంగ్రెస్ ది అని దుయ్యబెట్టారు.

ఇక్కడ మోడీ కాంగ్రెస్ ని విమర్శించాలనుకున్నా ఎన్టీయార్  ప్రస్థావనను తీసుకురావడమే విశేషంగా చెప్పుకోవాలి. దీని కంటే కొద్ది రోజుల ముందు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలలో కూడా మోడీ ఎన్టీయార్ ప్రస్థావనను తెచ్చారు. ఎన్టీయార్  స్పూర్తిగా తీసుకోవాలని ఆయన తన పార్టీ వారికి సూచించారు. నాడు ఎన్టీయార్  చైతన్య రధం మీద ఊరూరా తిరుగుతూ జనంతో మమేకం అయిన తీరుని కూడా ఆయన బీజేపీ సభ్యులకు
వివరించారు.

ఇలా ఎన్టీయార్  గురించి మోడీ ఎక్కువగా మాట్లాడుతున్నారు. దీని వెనక వ్యూహాలు ఏమై ఉంటాయన్న చర్చ కూడా సాగుతోంది. ఏపీలో తెలుగుదేశం తో పొత్తుకు విముఖత ప్రదర్శిస్తున్న బీజేపీ పెద్దలు సొంతంగా ఎదగాలని చూస్తున్నారు. ఎన్టీయార్  కి రెండు తెలుగు రాష్ట్రాలలో తరగని ఆదరణ ఉంది. దాంతో ఆయన పేరుని ప్రస్థావించడం ద్వారా ఆ దివంగత నేత అభిమానులను పార్టీ వైపుగా ఆకట్టుకోవాలని, బలమైన ఒక సామాజికవర్గం మద్దతు సంపాదించాలన్న ఆరాటం బీజేపీకి ఉంది అని అంటున్నారు.

ఇక ఎన్టీయార్ కి భారత రత్న ఇచ్చే ప్రతిపాదన కూడా బీజేపీ సీరియస్ గా పరిశీలిస్తోంది అని అంటున్నారు. వచ్చే ఏడాది లోక్ సభ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఈ ఏడాది చివరలో తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలు ఉన్న వేళ  వీటిని దృష్టిలో పెట్టుకుని ఏదో కీలకమైన సమయంలో ఎన్టీయార్  కి భారత రత్న అవార్డుని కూడా బీజేపీ ప్రకటించే చాన్స్ ఉందని అంటున్నారు. ఇక ఇప్పటికే అమరావతి రాజధానికి అనుకూలంగా కేంద్రంలోని బీజేపీ అతి ముఖ్యమైన స్టెప్ ని తీసుకుంది.

అలా అమరావతి ప్రాంత రైతులతో పాటు ఒక బలమైన సామాజికవర్గాన్ని కూడా ఆకట్టుకోవాలన్న ప్రయత్నంలో భాగంగానే దీన్ని చూస్తున్నారు. ఇపుడు ఎన్టీయార్ ని కూడా తమ వాడుగా చేసుకుని గట్టిగా మాట్లాడడం ద్వారా ఆ వర్గం ఓట్లను తిప్పుకోవాలని వ్యూహ రచన చేస్తోంది అని అంటున్నారు.

ప్రముఖ నాయకులు ప్రజా నాయకులను తమ వారిగా చేసుకోవడం బీజేపీకి ఏమీ కొత్త కాదు. కాంగ్రెస్ లో పుట్టి పెరిగిన వల్ల భాయ్ పటేల్ ని అలాగే సుభాష్ చంద్ర బోస్ ని విప్లవవీరుడు భగత్ సింగ్ ని తమ వారే అంటూ పొగుడుతూ ఉండే బీజేపీ తెలుగు రాజకీయాలో తన రాజముద్ర వేసిన ఎన్టీయార్ ని కూడా మా వారే అన్నా ఆశ్చర్యం లేదు. బీజేపీ రాజకీయ గడుసు తనంతో కాంగ్రెస్ పటేల్, సుభాష్ చంద్రబోస్ వంటి వారి విషయంలో ఏమీ మాట్లాడలేకపోతోంది. ఏపీలో తెలుగుదేశం కూడా అలా డిఫెన్స్ లో పడేలా ఎన్టీఆర్   కి జై అంటూ భారతరత్నమని బీజేపీ కీర్తిస్తే మాత్రం బిగ్ ట్రబుల్స్ సైకిల్ పార్టీకే అని అంటున్నారు. అంతా.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News