నోట్ల రద్దు ఘాటు మోడీని సైతం వ‌ద‌ల‌లేదా?

Update: 2016-11-24 11:02 GMT
ఉత్తర ప్రదేశ్‌ రాజధాని లక్నోలో డిసెంబర్‌ 24న భారతీయ జనతా పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలనుకున్న ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభను ఎందుకు రద్దు చేసుకున్నారు? పెద్ద నోట్ల రద్దు రేపిన దుమారాన్ని తట్టుకోవడం కష్టమనా? ప్రజలు రారని భయమా?  నోట్ల ర‌ద్దు షాక్ ప్ర‌ధానిని సైతం వ‌దిలిపెట్ట‌లేదా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా సీనియర్‌ మంత్రులతో సమావేశమై మోడీ లక్నో బహిరంగ సభను రద్దు చేయాలని నిర్ణయించడం దీనికి బ‌లం చేకూరుస్తోంది.

అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తర ప్రదేశ్‌ లో పార్టీ ప్రచార పర్వాన్ని తారస్థాయికి తీసుసుకు వెళ్లేందుకు రాష్ట్రంలోని నలుమూలల నుంచి బీజేపీ ఈ నెల మొదట్లో నాలుగు పరివర్తన్‌ ర్యాలీలను ప్రారంభించింది. ఈ నాలుగు ర్యాలీలు డిసెంబర్‌ 24న లక్నోలో కలసుకొని ముగుస్తాయి. ఈ సందర్భంగా మోడీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించాల్సి ఉంది. ఈ సభకు ఎంతో ప్రాముఖ్యం ఉందంటూ పార్టీ ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారాన్ని చేపట్టింది. అశేష జన వాహినిని సభకు తరలించాలని కూడా భావించింది. అయితే, ఇటీవల గోవాలో జరిగిన మోడీ బహిరంగ సభకు ఆశించిన స్థాయిలో ప్రజలు రాకపోవడంతో పార్టీలో అసంతృప్తి వ్యక్తం అయింది. దేశంలో పెద్ద నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో తలెత్తిన పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునేందుకు అమిత్‌ షా సోమవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ - ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంత్‌ దాస్‌ తో సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. ఆ చర్చల్లోనే మోడీ బహిరంగ సభను వాయిదా వేయాలని అభిప్రాయపడినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. నోట్ల తిప్పలతో ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, ఈ సమయంలో సభను నిర్వహిస్తే మొదటికే మోసం వస్తుందని కూడా వారు అభిప్రాయపడ్డారట. నోట్ల తిప్పలు జనవరి నెల వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లు అరుణ్‌ జైట్లీ - శక్తికాంత్‌ సూచించారని తెలిసింది. నోట్ల రద్దుపై పార్టీ ఎంపీల్లో కూడా అసంతృప్తి రగులుతోందని గ్రహించిన అమిత్‌ షా పార్టీ ఎంపీల సమావేశాన్ని రెండు సార్లు రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత జరిగిన సమావేశంలో ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేయడానికి అవకాశం ఇవ్వకుండా మోడీ ఒకింత‌ భావోద్వేగంతో ప్రసంగించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News