మోడీ తెలివే తెలివి.. పెట్రోల్ లీటరు రూ.80 టచ్ చేయించట్లేదే..

Update: 2019-12-23 05:24 GMT
తెలివి అంటే ప్రధాని మోడీని చూసి నేర్చుకోవాల్సిందే. అధికారంలోకి రాక మునుపు చెప్పే మాటలు.. పవర్లోకి వచ్చిన తర్వాత గుర్తుకు రాకుండా చేయటం మాటలు కాదు. అధికారపక్షాన్ని ఇరుకున పడేసేలా విపక్షాలు వ్యవహరిస్తుంటాయి. కానీ.. అలాంటి అవకాశం ఇవ్వకుండా మోడీ మాష్టారు వేసే ఎత్తులు ఊహించలేనివిగా చెప్పక తప్పదు.

పెట్రోల్.. డీజిల్ ధరల విషయాన్నే చూడండి.. తాముపవర్లోకి వస్తే లీటరు రూ.50కు దాటదన్న సోషల్ మీడియా ప్రచారానికి భిన్నంగా ఇప్పుడు లీటరు పెట్రోల్ ధర దగ్గర దగ్గర రూ.80 వరకూ వచ్చేసింది. కేవలం పైసలు దూరంలో ఆగింది. అలా అని అంతర్జాతీయ మార్కెట్లో ఏమైనా ధరలు పెరిగాయా? అంటే.. తగ్గుతూనే ఉన్నాయి. మన దగ్గర రోజువారీగా పది పైసలు.. పాతిక పైసలు చొప్పున రోజువారీగా అంతో ఇంతో వడ్డిస్తూ పెట్రోల్.. డీజిల్ ధరల్ని పెంచేస్తున్న తీరుకు భిన్నంగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు అంతో ఇంతో తగ్గుతూనే ఉన్నాయే తప్పించి పెరగని పరిస్థితి.

అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గుతున్నా.. దేశీయంగా మాత్రం పెట్రోల్.. డీజిల్ ధరలు పెరుగుతున్న దుస్థితి. గడిచిన కొద్ది రోజులుగా తెలంగాణలో పెట్రోల్ లీటరు ధర రూ.79.42 వద్ద నిలకడగా ఉండిపోయింది. దేశంలోని చాలా రాష్ట్రాలతో పోలిస్తే సంపన్న రాష్ట్రమైన తెలంగాణలోనే పెట్రోల్.. డీజిల్ ధరలు ఎక్కువ కావటం గమనార్హం. పక్కనున్న ఏపీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువగా ఉన్నాయి.  

కేంద్రం విధించే పన్నులకు అదనంగా.. ఆయా రాష్ట్రాలు వేసే పన్నుబాదుడు కారణంగా ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా పెట్రోల్.. డీజిల్ ధరలు ఉన్నాయని చెప్పాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో పెట్రోల్ ధరల్ని ఏ మాత్రం పెంచినా.. పలు రాష్ట్రాల్లో లీటరు పెట్రోల్ రూ.80 టచ్ అవుతుంది.అదే జరిగితే.. మీడియా మొదలు రాజకీయ పార్టీల వరకూ అన్ని ఈ అంశాన్ని హైలెట్ చేస్తాయి. అందుకే.. విపక్షాలకు అవకాశం ఇవ్వని మోడీ ప్రభుత్వం.. పెట్రోల్ ధరల్ని పెంచటం ఆపింది. ఇదెంతకాలం అన్నది పక్కన పెడితే.. డీజిల్ ధరల్ని మాత్రం రోజువారీగా పది పైసలు.. ఇరవై పైసలు ఇలా పెంచుతూ ఉంది. ఇదంతా చూసినప్పుడు మోడీ తెలివి మామూలుగా లేదనుకోకుండా ఉండలేం.

ఇదిలా ఉంటే.. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు చూస్తే.. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 66 డాలర్లకు చేరుకుంది. ఇక.. డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్ 60.31 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. ఈ రెండిటి ధరలు అంతకంతకూ క్షీణిస్తూ ఉండటం గమనార్హం. అంతర్జాతీయంగా ముడిచమురు తగ్గుతూ ఉండటం ఏమిటో? సామాన్యుడు మొదలు ప్రముఖుల వరకూ లీటరు పెట్రోల్ కు రూ.79.. డీజిల్ రూ.73 (దగ్గర దగ్గరగా) చెల్లించటం ఏమిటో?
Tags:    

Similar News